అల్లు అర్జున్ – బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వచ్చిన ‘సరైనోడు’ని ఎవరూ మర్చిపోలేరు. అప్పటి వరకూ బన్నీ కెరీర్ లో అదే పెద్ద హిట్. గీతా ఆర్ట్స్ కి లాభాల పంట పండించింది. అప్పట్నుంచి వీరి కాంబోలో మరో సినిమా కోసం అభిమానులు ఆశగా ఎదురు చూస్తూనే ఉన్నారు. మధ్యలో చాలాసార్లు ‘సరైనోడు 2’ ప్రస్తావన వచ్చింది. ఈ సినిమా ముందుకు వెళ్తుంది.. అనుకొన్నారంతా. కానీ అటు బన్నీ, ఇటు బోయపాటి ఎవరి కమిట్మెంట్స్ లో వాళ్లు బిజీ అయిపోయారు. అయితే ఇప్పుడు వీరిద్దరి కాంబో మళ్లీ పట్టాలెక్కడానికి సన్నాహాలు మొదలైపోయాయని ఇన్ సైడ్ వర్గాల టాక్.
ప్రస్తుతం అట్లీ సినిమాలో నటిస్తున్నాడు బన్నీ. ఈ సినిమా అనుకొన్నదానికంటే ముందే పూర్తి కానుందని సమాచారం. ఆ వెంటనే ఏమాత్రం ఆలస్యం చేయకుండా మరో ప్రాజెక్ట్ ముందుకు తీసుకువెళ్లాలని బన్నీ భావిస్తున్నాడు. ఈమేరకు కొంతమంది దర్శకులతో సంప్రదింపులు మొదలెట్టినట్టు తెలుస్తోంది. ఆ వరుసలో బోయపాటి శ్రీను పేరు ముందు వరుసలో ఉంది. `అఖండ 2` తరవాత బోయపాటి చేసే సినిమా బన్నీతోనే అన్నది ఆయన సన్నిహితులు కూడా గట్టిగా చెబుతున్నారు. పైగా గీతా ఆర్ట్స్ నుంచి బోయపాటి తీసుకొన్న అడ్వాన్స్ కూడా ఉంది. ఎప్పటి నుంచో ఈ సంస్థలో ఓ సినిమా చేయాలి. ఇటీవలే… బన్నీ – బోయపాటి మధ్య చర్చలు కూడా జరిగాయని సమాచారం. ‘సరైనోడు 2’ కాదు కానీ… అలాంటి పవర్ ఫుల్ కథతోనే మాస్, యాక్షన్, ఎంటర్టైనర్ చేయాలని ఇద్దరూ ఫిక్సయ్యార్ట. అఖండ 2 విడుదలైన తరవాత ఈ కాంబోపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.


