‘ఐకాన్’ అనే టైటిల్ దిల్ రాజు సంస్థ ఎప్పుడో రిజిస్టర్ చేయించుకొంది. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో, అల్లు అర్జున్ హీరోగా ఈ సినిమా మొదలెట్టాలని చూసింది. వేణు శ్రీరామ్ స్క్రిప్ట్ కూడా తయారు చేశాడు. కానీ ఎందుకో ఆ ప్రాజెక్ట్ ముందుకు వెళ్లలేదు. వేణు మాత్రం ‘ఎప్పటికైనా ఆ సినిమా ఉంటుంది’ అనే ఆశాభావంతో ఉన్నారు. దిల్ రాజు కూడా అంతే. అందుకే ఆ టైటిల్ ఇంత కాలం అలానే ఉండిపోయింది.
అయితే ఇప్పుడు అల్లు అర్జున్ – అట్లీ సినిమా కోసం ఆ టైటిల్ వాడేద్దామని చూస్తున్నారు. ఈ సినిమాకు టైటిల్ ఇంకా నిర్దారణ కాలేదు. అందుకోసం అట్లీ చాలా రకాల ఆప్షన్లు బన్నీ ముందు పెట్టాడు. కానీ అవేం బన్నీకి నచ్చలేదు. ఈ సినిమాని పాన్ వరల్డ్ స్థాయిలో విడుదల చేయాలి. అందరికీ అర్థమయ్యే క్యాచీ టైటిల్ ఉండాలి. అందుకే బన్నీనే స్వయంగా `ఐకాన్` అనే పేరు సూచించాడట. అది అట్లీకి కూడా బాగా నచ్చింది. బన్నీని ఎలాగూ ఐకాన్ స్టార్ అంటారు. ఐకాన్ అనే పేరు బన్నీ కోసమే రిజిస్టర్ చేశారు. కాబట్టి.. ఈ టైటిల్ తీసుకోవడం పెద్ద కష్టమేం కాదు. ఒకవేళ ఇప్పుడు ఈ టైటిల్ వాడేస్తున్నారంటే.. వేణు శ్రీరామ్ తో అనుకొన్న `ఐకాన్` ప్రాజెక్ట్ లేనట్టే. ఒకవేళ బన్నీ చేయకపోయినా, మరో హీరోతో ఆ సినిమా చేద్దామని వేణు భావిస్తున్నాడు. ఇప్పుడు ఎత్తుకెళ్లిపోతే – ఇక ఆ ప్రయత్నాన్నీ విరమించుకుంటాడేమో?
ఈ సినిమాలో ఐదుగురు కథానాయికలు ఉంటారన్న ప్రచారం జరుగుతోంది. దీపికా పదుకొణె, మృణాల్ ఠాకూర్, జాన్వీ కపూర్ పేర్లు దాదాపు ఖాయమయ్యాయి. మరి మిగిలిన ఆ ఇద్దరూ ఎవరో చూడాలి.