తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందించనున్న గద్దర్ ఫిల్మ్ అవార్డులను జ్యూరీ ప్రకటించింది. ఈ అవార్డుల కోసం మొత్తం 1248 నామినేషన్లు రాగా వాటిని పరిశీలించిన అనంతరం అవార్డు గ్రహీతల పేర్లను ప్రకటించారు. ఉత్తమ నటుడిగా ‘పుష్ప 2’ చిత్రానికి గానూ అల్లు అర్జున్ ఎంపికయ్యారు. కల్కి, పోట్టేల్, లక్కీ భాస్కర్ ఉత్తమ చిత్రాలుగా నిలిచాయి.
కాగా ఉత్తమ నటుడిగా ఎంపికైన అల్లు అర్జున్ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. ‘ పుష్ప2 చిత్రానికి గాను ఫస్ట్ బెస్ట్ యాక్టర్ అవార్డును పొందడం గౌరవంగా భావిస్తున్నాను. ఈ ప్రతిష్టాత్మకమైన గౌరవాన్ని ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈ విజయంలో క్రెడిట్ మొత్తం నా దర్శకుడు సుకుమార్ గారికి, నా నిర్మాతలకి, మొత్తం పుష్పా టీంకే చెందుతుంది. ఈ అవార్డును నా అభిమానులందరికీ అంకితం చేస్తున్నాను. వారి అశేషమైన మద్దతు నాకు నిరంతర స్ఫూర్తి’ అని పోస్ట్ చేశారు.
14 ఏళ్ల తర్వాత ఈ అవార్డులను ప్రకటించారు. మొత్తం 11 కేటగిరీల్లో వీటిని వెల్లడించారు. 2014 జూన్ నుంచి 2023 డిసెంబర్ 31 వరకు ఏడాదికి ఒక ఉత్తమ చిత్రానికి, 2014 నుంచి 2023 వరకు సెన్సార్ అయిన చిత్రాలను మాత్రమే పరిగణనలోకి తీసుకున్నారు. 2024కు సంబంధించి అన్ని కేటగిరీల్లోనూ అవార్డులు ఇచ్చారు. జూన్ 14న అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం ఘనంగా జరగనుంది.