మెగా అల్లుడు కల్యాణ్ దేవ్ తొలి ప్రయత్నం ‘విజేత’ బాక్సాఫీసు దగ్గర పల్టీలుకొట్టింది. కథ, కథనాల్లో కొత్తదనం లేకపోవడం, సాదాసీదా సన్నివేశాలతో సాగదీయడంతో.. `విజేత`కు మార్కులు పడలేదు. వసూళ్లపరంగా కూడా బాగా నిరుత్సాహపరుస్తోంది. అసలు ఎలాంటి అంచనాలూ లేకుండా వచ్చిన ‘ఆర్.ఎక్స్ 100’ దూసుకుపోతున్న తరుణంలో… దాని పక్కన పోలిస్తే ‘విజేత’ వసూళ్లు మరింత కనిపిస్తున్నాయి. మెగా ఫ్యాన్స్ కూడా ఈ సినిమాని పట్టించుకోవడం లేదు. దాంతో… కాస్త ఊపు తెచ్చే పనిలో పడింది మెగా కాంపౌండ్. విడుదలైన రెండో రోజే చిరంజీవి రంగ ప్రవేశం చేసి ఓ ప్రెస్ మీట్ పెట్టి.. ‘సెభాష్’ అంటూ అలవాటు ప్రకారం చిత్రబృందాన్ని పొగిడేశారు. ఇప్పుడు అల్లు అర్జున్ వంతు వచ్చింది. ఆదివారం హైదరాబాద్లో ‘విజేత’ విజయోత్సవం జరగబోతోంది. దీనికి అల్లు అర్జున్ చీప్ గెస్ట్. ఆ తరవాత.. చరణ్ కూడా రంగంలోకి దిగబోతున్నట్టు భోగట్టా. సినిమా ఫలితం, దాని వసూళ్లూ ఎలాగున్నా ‘మేం మాత్రం మా వంతు పబ్లిసిటీ ఇచ్చాం’ అని చెప్పడానికి ఈ ప్రమోషన్లు ఉపయోగపడతాయంతే. ఇప్పటికే ‘విజేత’ రిజల్ట్ అర్థమైపోయింది. ఎంత ప్రమోషన్లు చేసినా, మెగా బృందం అంతా కట్టకట్టుకుని క్యాంపెయినింగ్ చేసినా… ‘విజేత’ రాత మార్చలేరు. చూస్తున్న జనం మాత్రం ఇదంతా ‘మెగా రుద్దుడు’ అనుకునే ప్రమాదం ఉంది.