ఏప్రిల్ 8న అల్లు అర్జున్ పుట్టిన రోజు. ఆ సందర్భంగా అట్లీ సినిమాకు సంబంధించి ఓ టీజర్ విడుదల చేస్తున్నారు. ఈ సినిమా టైటిల్ ఏమిటన్నది ఆ రోజునే అధికారికంగా ప్రకటిస్తారు.
నిజానికి ఏప్రిల్ 8న కేవలం ఫస్ట్ లుక్ తో టైటిల్ రివీల్ చేద్దామనుకొన్నారు. కానీ.. అభిమానులకు ఇంకాస్త జోష్ ఇవ్వాలన్న ఉద్దేశంతో ఇప్పుడు టీజర్ కట్ చేస్తున్నారని తెలుస్తోంది. ఈ టీజర్ కూడా సినిమా స్థాయిని, కాన్సెప్ట్ ని, ఆ ప్రపంచాన్ని పరిచయం చేసేలా ఉండబోతోందని సమాచారం. దాదాపు రూ.600 కోట్లతో తెరకెక్కుతున్న సినిమా ఇది. ఆ రేంజ్, క్వాలిటీ ఈ టీజర్ లో కనిపించేలా జాగ్రత్త పడుతున్నారని తెలుస్తోంది. పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేస్తున్న సినిమా ఇది. అన్ని భాషల్లోనూ టీజర్ కవర్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నారు. టైటిల్ పాన్ ఇండియా స్థాయికి తగ్గట్టుగానే ఉండబోతోందని టాక్. టీజర్ లో డైలాగులు ఏం ఉండకపోవొచ్చు. కాకపోతే ఇంపాక్ట్ మాత్రం గట్టిగా ఉండబోతోందని ఇన్ సైడ్ వర్గాలు చెబుతున్నాయి.
ఈమధ్య పెద్ద సినిమాలన్నీ లీకుల బారీన పడ్డాయి. చిత్రబృందం రివీల్ చేయకముందే.. టైటిల్, హీరో క్యారెక్టరైజేషన్, కథాంశం.. వీటికి సంబంధించిన అంశాలన్నీ ముందే లీక్ అయిపోతున్నాయి. రాజమౌళి సినిమాకే లీకుల గోల తప్పలేదు. కానీ బన్నీ సినిమాకు సంబంధించి ఒక్క విషయం కూడా లీక్ అవ్వలేదు. ఆ స్థాయిలో జాగ్రత్తలు తీసుకొంటోంది చిత్రబృందం. ఈ సినిమా షూటింగ్ అంతా ముంబైలో జరుగుతోంది. అందుకే ఎలాంటి సమాచారం బయటకు రావడం లేదు. టైటిల్ ఏమిటి అనే విషయంలోనూ ఎవరికీ ఎలాంటి క్లూ లేదు. ఏప్రిల్ 8 వరకూ ఆ సస్పెన్స్ కొనసాగుతూనే ఉంటుంది. ఆరోజు విడుదలైన టీజర్ ని బట్టి, అందులోని విజువల్స్ ని బట్టి ఈ సినిమాపై ఓ అంచనాకు రావొచ్చు.


