ప్రస్తుతం ‘నక్షత్రం’లో నటిస్తున్నాడు సందీప్ కిషన్. కృష్ణవంశీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం దాదాపుగా ఓ మల్టీస్టారర్ సినిమా రేంజులో తయారవుతోంది. ‘నక్షత్రం’ పూర్తవ్వగానే ఓ ద్విభాషా చిత్రంలో నటించడానికి సందీప్ ఒప్పుకొన్నాడు. తమిళ దర్శకుడు సుశీంద్రన్ (నా పేరు శివ ఫేమ్) కథకు ఓకే చెప్పాడు సందీప్. తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి ఈ చిత్రం తెరకెక్కబోతోంది. ఈ చిత్రంలో కథానాయికగా మెహరీన్ని ఎంచుకొన్నారు. కృష్ణగాడి వీర ప్రేమగాథతో వెలుగులోకి వచ్చింది మెహరీన్. ఆ తరవాత అల్లు శిరీష్ సినిమాకు సంతకం చేసింది. అయితే ఆ సినిమా.. మధ్యలోనే ఆగిపోయింది. మెహరీన్ ని మర్చిపోతున్నారేమో అనుకొన్న దశలో ద్విభాషా చిత్రాన్ని దక్కించుకొంది.
నిజానికి ఈ ప్రాజెక్టు అల్లు శిరీష్దగ్గరకు వెళ్లింది. శ్రీరస్తు శుభమస్తు హిట్టు కొట్టిన వెంటనే… శిరీష్ విన్న కథ ఇది. అయితే.. ఎందుకనో శిరీష్ చేతిలోంచి ఇప్పుడు సందీప్ కిషన్ చేతిలోకి వెళ్లిపోయింది. నా పేరు శివలానే ఇది కూడా ఓ రియలిస్టిక్ సినిమా అని తెలుస్తోంది. శిరీష్ కంటే.. సందీప్ కిషన్కే తమిళంలో కాస్తో కూస్తో క్రేజ్ ఉంది. సందీప్ అక్కడ కొన్ని సినిమాలు చేశాడు కూడా. అందుకే సుశీంద్రన్ శిరీష్ కంటే సందీప్నే బెస్ట్ ఆప్షన్ అనుకొన్నాడేమో. నక్షత్రం పూర్తయిన వెంటనే ఈ సినిమా పట్టాలెక్కబోతోంది. పూర్తి వివరాలు త్వరలో తెలుస్తాయి.