ఆంధ్రప్రదేశ్‌ను ప్రపంచ హరిత ఇంధన కేంద్రంగా మార్చే దిశగా రాష్ట్ర ప్రభుత్వం మరో భారీ అడుగు వేసింది. ప్రపంచ ప్రఖ్యాత సంస్థ AM Green కాకినాడ కేంద్రంగా 1.5 మిలియన్ టన్నుల వార్షిక సామర్థ్యం గల గ్రీన్ అమ్మోనియా ఎగుమతి టెర్మినల్‌ను ఏర్పాటు చేయనుంది. ఈ విషయాన్ని మంత్రి నారా లోకేష్ ప్రకటించారు. ఉదయం సాయంత్రం ఆరు గంటలకు ఓ ప్రకటన చేస్తానని ఆయన అన్నారు. ఆ ప్రకటన ఈ భారీ పెట్టుబడి గురించే.
సుమారు 10 బిలియన్ డాలర్లు అంటే దాదాపు రూ. 84,000 కోట్ల భారీ పెట్టుబడితో చేపట్టనున్న ఈ ప్రాజెక్టు, ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక ముఖచిత్రాన్ని మార్చడమే కాకుండా గ్లోబల్ గ్రీన్ ఎనర్జీ వ్యాల్యూ చైన్‌లో రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలుపుతుంది. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు అవసరమైన విద్యుత్తు కోసం సుమారు 7.5 గిగావాట్ల పునరుత్పాదక ఇంధనాన్ని, 1 గిగావాట్ పంప్డ్ హైడ్రో స్టోరేజీని వినియోగించనున్నారు.
ఇది భారతదేశ చరిత్రలోనే ఒక చారిత్రాత్మక ఘట్టమని, మన దేశం నుండి గ్రీన్ ఎనర్జీని అమ్మోనియా రూపంలో జర్మనీ, సింగపూర్ , జపాన్ వంటి అభివృద్ధి చెందిన దేశాలకు ఎగుమతి చేయబోతున్నామని లోకేష్ వివరించారు. ఈ ప్రాజెక్టు ద్వారా అమోనియా ఉత్పత్తి రంగంలో అత్యాధునిక సాంకేతికత అందుబాటులోకి రావడమే కాకుండా, పర్యావరణ హితమైన ఇంధన తయారీలో ఏపీ అంతర్జాతీయ ప్రమాణాలను నెలకొల్పనుంది.
ఉపాధి కల్పన విషయంలో కూడా ఈ ప్రాజెక్టు యువతకు భారీ అవకాశాలను తీసుకురానుంది. నేరుగా మరియు పరోక్షంగా సుమారు 8,000కు పైగా ఉన్నత స్థాయి ఉద్యోగాలు లభిస్తాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పారిశ్రామికవేత్తల్లో పెరిగిన నమ్మకానికి ఈ భారీ పెట్టుబడే నిదర్శనం.
