మహబూబ్ నగర్ వద్ద అమరరాజా సంస్థ చేపడుతున్న అతిపెద్ద గిగా ఫ్యాక్టరీ పురోగతి ఫోటోలను షేర్ చేసిన కేటీఆర్.. తనను తాను అభినందించుకునే ప్రయత్నం చేశారు. తమ హయాంలో తిరుగులేని పరిశ్రమలు తెలంగాణకు వచ్చాయని .. అవన్నీ వేగంగా గ్రౌండ్ అవుతున్నాయని ఆయన ఉద్దేశం. అందులో నిజం ఉంది. అమరరాజా పరిశ్రమ తెలంగాణకు రావడంలో కేటీఆర్ కీలక పాత్ర పోషించారు. కానీ అసలు క్రెడిట్ ఇవ్వాల్సింది మాత్రం ఏపీ మాజీ సీఎం జగన్ రెడ్డికే. ఏకంగా పదివేల కోట్ల పెట్టుబడుల్ని ఆయన తరిమిస్తే.. చిత్తూరు నుంచి తెలంగాణకు వచ్చాయి.
సొంత ప్రాంత ప్రజలకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలని.. తమ ప్రాంత అభివృద్ధిలో స్వయంగా భాగస్వామ్యం కావాలని అమెరికాలో మంచి భవిష్యత్ ను వదులుకుని ఉన్నదంతా అమ్మేసుకుని చిత్తూరు వచ్చి పరిశ్రమలు పెట్టారు గల్లా రామచంద్రనాయుడు. ఆయన అక్కడ పరిశ్రమ పెట్టి.. ప్రపంచవ్యాప్తంగా పేరెన్నిక పన్న అమరాన్ బ్రాండ్ ను విస్తృత పరిచారు. ఎంత చేసినా.. తన పరిశ్రమలు మొత్తం చిత్తూరులోనే ఉండాలని … అక్కడి ప్రజలకు ఉపాధి కల్పించేలా ఉండాలనుకున్నారు. ఈ పెట్టుబడిని కూడా అక్కడే పెట్టాలనుకున్నారు.
కానీ జగన్ రెడ్డి .. పరిశ్రమల్ని కూడా రాజకీయంతో చూశారు. ఆ సంస్థ మీద చేయకూడని కక్ష సాధింపులకు పాల్పడ్డారు. ఉత్పత్తిని నిలిపివేయించారు. ఇది పారిశ్రామిక వర్గాలను దిగ్భ్రాంతికి గురి చేసింది. అదే సమయంలో అక్కడ మారుతున్న మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా ఈవీ మార్కెట్ కోసం తయారు చేయాలనుకున్న బ్యాటరీ యూనిట్ కూడా ప్రోత్సాహం లభించలేదు. అదే సమయంలో కేటీఆర్ అందిపుచ్చుకున్నారు. అన్ని సౌకర్యాలు, రాయితీలు ఇస్తూ ఆఫర్ ఇచ్చారు. పరిస్థితులతో.. అమరరాజాకూ.. చిత్తూరు వదిలి వెళ్లాల్సిన దుస్థితి కలిగింది. అది తెలంగాణకు ప్లస్ అయింది.
ఈ క్రెడిట్ అంతా జగన్ రెడ్డితే. కూర్చున్న కొమ్మను ఇరుక్కునే జగన్ రెడ్డి లాంటి రాజకీయ నాయకుడ్ని దేశం ఇప్పటి వరకూ చూసి ఉండదు.. ఇక ముందు కూడా చూడకపోవచ్చు.
