రాజధాని అమరావతిలో అత్యంత కీలకమైన, సుమారు 1,691 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించతలపెట్టిన ‘స్టార్టప్ ఏరియా’ ప్రాజెక్టుకు పూర్వవైభవం తెచ్చేందుకు కూటమి ప్రభుత్వం శరవేగంగా అడుగులు వేస్తోంది. గతంలో 2015లో చంద్రబాబు ప్రభుత్వం సింగపూర్ కన్సార్టియంతో కుదుర్చుకున్న ఈ ప్రతిష్టాత్మక ఒప్పందం, 2019లో అధికారంలోకి వచ్చిన జగన్ రెడ్డి ‘మూడు రాజధానుల’ కుయుక్తులు, కక్షసాధింపు చర్యల కారణంగా రద్దయింది. రాజధాని మార్పు, మూడు ముక్కలాటతో పెట్టుబడిదారుల నమ్మకం దెబ్బతినడంతో నాటి సింగపూర్ ప్రభుత్వం పరస్పర అంగీకారంతో ఈ ప్రాజెక్టు నుంచి వెనక్కి తగ్గింది.
అయితే, కూటమి ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి రావడం, అమరావతికి కేంద్ర ప్రభుత్వం, ప్రపంచ బ్యాంకు నుంచి రూ. 15,000 కోట్ల నిధుల గ్రీన్ సిగ్నల్ లభించడంతో.. సింగపూర్ ప్రభుత్వం సరికొత్త ఉత్సాహంతో అమరావతి అభివృద్ధిలో భాగస్వామ్యం కావడానికి మళ్లీ ముందుకొచ్చింది. సింగపూర్ ‘పుంగోల్’ తరహా ఇంటిగ్రేటెడ్ స్మార్ట్ టౌన్షిప్ గతంలో కేవలం స్టార్టప్ ఏరియా అభివృద్ధిగా ఉన్న ప్రణాళికను, ఇప్పుడు అంతకంటే అధునాతనంగా మార్చేందుకు ఐటీ, మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ నేతృత్వంలో ప్రయత్నాలు చేస్తున్నారు.
సింగపూర్‌లోని ప్రపంచ ప్రసిద్ధ ఐటీ, డిజిటల్ టెక్నాలజీ హబ్ అయిన ఈకో-ఫ్రెండ్లీ ‘పుంగోల్’ జిల్లా నమూనాలో అమరావతిలో ఒక ఇంటిగ్రేటెడ్ స్మార్ట్ టౌన్‌షిప్‌ను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సింగపూర్ ప్రభుత్వ జాయింట్ ఇంప్లిమెంటేషన్ స్టీరింగ్ కమిటీ సమావేశాల్లో పాల్గొన్న మంత్రి నారాయణ, అమరావతి ఎకనామిక్ రీజియన్‌ను ఒక గ్లోబల్ హబ్‌గా మార్చేందుకు సింగపూర్ ప్రతినిధులతో ఒప్పందాలను పునరుద్ధరించారు. ఈ ప్రాజెక్టు కోసం అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన మాస్టర్ ప్లాన్ ఫేజ్-2 ను రూపొందించే బాధ్యతను సింగపూర్‌కే చెందిన సుప్రసిద్ధ ప్లానింగ్ సంస్థ ‘సుర్బానా జురాంగ్’ కు ప్రభుత్వం అధికారికంగా అప్పగించింది.
ఆర్థిక రంగానికి ఊపు.. లక్షలాది ఉద్యోగాల సృష్టి ఈ సరికొత్త ‘అమరావతి స్మార్ట్ ఎకనామిక్ టౌన్షిప్’ ద్వారా రాష్ట్ర జీఎస్డీపీ ఏకంగా రూ. 1.15 లక్షల కోట్ల ఆదాయం లభిస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. కేవలం ఐటీ రంగానికే పరిమితం కాకుండా, సింగపూర్ లోని ‘సన్‌టెక్ సిటీ’ తరహాలో అమరావతిని అంతర్జాతీయ సదస్సులు, ప్రదర్శనల కేంద్రంగా తీర్చిదిద్దబోతున్నారు. రాబోయే ఐదేళ్లలో దాదాపు 1.25 లక్షల కుటుంబాలు ఇక్కడ స్థిరపడేలా నివాస, వాణిజ్య, వినోద సముదాయాలను ఏకకాలంలో నిర్మించనున్నారు. దీనివల్ల దాదాపు 2.50 లక్షల మంది యువతకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి.
