ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి అత్యున్నత చట్టబద్ధత కల్పించే దిశగా కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఏపీ అసెంబ్లీ చేసిన తీర్మానం మేరకు.. ఏపీ పునర్విభజన చట్టం సవరణ బిల్లు-2026 పేరుతో రూపొందించిన కీలక బిల్లును బుధవారం పార్లమెంటు ముందుకు తీసుకురానున్నట్లు కేంద్ర హోంశాఖ ఇప్పటికే లోక్సభ స్పీకర్ కార్యాలయానికి అధికారిక సమాచారం అందించింది. ఈ చారిత్రాత్మక బిల్లును బుధవారం ఉదయం జరగనున్న కేంద్ర కేబినెట్ భేటీలో ప్రవేశపెట్టి, తక్షణమే ఆమోదం తెలపాలని కేంద్రం భావిస్తోంది. కేబినెట్ ఆమోద ముద్ర పడిన వెంటనే లోక్సభలో ఈ బిల్లును ప్రతిపాదించనున్నారు.
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్ ఈ బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టనున్నారు. 2014 నాటి ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టానికి కీలక సవరణలు చేయడం ద్వారా, అమరావతిని రాష్ట్ర ఏకైక రాజధానిగా శాశ్వత ప్రాతిపదికన చట్టబద్ధం చేయడమే ఈ బిల్లు ప్రధాన లక్ష్యం. గత పదేళ్లుగా రాజధాని విషయంలో నెలకొన్న అనిశ్చితికి, న్యాయపరమైన చిక్కులకు ఈ సవరణతో తెరపడనుంది. కేంద్రమే నేరుగా చట్ట సవరణకు సిద్ధం కావడంతో, రాష్ట్ర రాజధానిగా అమరావతికి జాతీయ స్థాయిలో తిరుగులేని గుర్తింపు లభించనుంది.
ఈ బిల్లు ఆమోదం పొందితే అమరావతి నిర్మాణానికి కేంద్రం నుంచి అందే ఆర్థిక సహాయం, మౌలిక సదుపాయాల కల్పనలో స్పష్టమైన గ్యారెంటీ లభిస్తుంది. విభజన చట్టంలోని సెక్షన్లను సవరించడం ద్వారా భవిష్యత్తులో రాజకీయ మార్పులు సంభవించినా రాజధాని మార్పు సాధ్యం కాకుండా పటిష్టమైన రక్షణ కల్పించనున్నారు. ఏపీ ప్రజల చిరకాల స్వప్నమైన రాజధాని నిర్మాణంపై కేంద్రం తీసుకున్న ఈ వేగవంతమైన నిర్ణయం .. ఏపీ ప్రజలు గత ఎన్నికల్లో ఇచ్చిన స్పష్టమైన తీర్పునకు లభిస్తున్న ఫలితం.
