ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అమరావతి రాజధాని నిర్మాణ పనులు ప్రస్తుతం ఆశించిన వేగంతో సాగడం లేదు. ఇటీవల సీఆర్డీఏ విడుదల చేసిన కాంట్రాక్టర్ల వారీ పనుల పురోగతి చార్ట్ ప్రకారం, రాజధానిలో జరుగుతున్న పనుల వాస్తవ పురోగతి నిర్దేశించిన లక్ష్యాల కంటే సగం తక్కువగానే ఉంది. మొత్తం రూ. 42,729 కోట్ల విలువైన 90 పనులకు గాను, ప్రస్తుతం సగటున 19.60 శాతం పనులు పూర్తి కావాల్సి ఉండగా, కేవలం 9.72 శాతం మాత్రమే పూర్తయ్యాయి. ప్రభుత్వం పనులను వేగవంతం చేయాలని హెచ్చరిస్తున్నా, క్షేత్రస్థాయిలో పరిస్థితి మాత్రం ఇంకా గాడిలో పడలేదు.
వెనుకబడిన దిగ్గజ సంస్థలు
ముఖ్యంగా పెద్ద పెద్ద కాంట్రాక్టులు దక్కించుకున్న దిగ్గజ కంపెనీల పనితీరు నిరాశాజనకంగా ఉంది. రాజధానిలో అత్యధిక పనులు చేస్తున్న ఎన్సీసీ సంస్థ 21.93 శాతం లక్ష్యానికి గాను కేవలం 11.61 శాతం మాత్రమే పూర్తి చేసింది. భారీ ప్రాజెక్టులు చేస్తున్న మేఘా ఇంజనీరింగ్ పరిస్థితి మరీ దారుణంగా ఉంది. 13.48 శాతం పూర్తి కావాల్సిన పనుల్లో కేవలం 4.86 శాతం మాత్రమే పురోగతి సాధించింది. ఎల్ అండ్ టీ కూడా 22 శాతం లక్ష్యానికి గాను కేవలం 4.75 శాతం వద్దే ఉంది. ఈ జాప్యం వల్ల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారుల నివాస సముదాయాలు, హైకోర్టు , అసెంబ్లీ వంటి ఐకానిక్ భవనాల నిర్మాణం అనుకున్న సమయానికి పూర్తవుతాయా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
యంత్రాలు, మానవవనరుల కొరత
పనులు ఆలస్యం కావడానికి ప్రధాన కారణం ఆయా కంపెనీలు అవసరమైన స్థాయిలో సిబ్బందిని, యంత్రాలను రంగంలోకి దించకపోవడమేనని సీఆర్డీఏ గుర్తించింది. గత ఐదేళ్ల కాలంలో పనులు నిలిచిపోవడం వల్ల చాలా వరకు యంత్రాలు తుప్పుపట్టడం లేదా వేరే చోటికి తరలించడం జరిగింది. ఇప్పుడు మళ్లీ కొత్తగా మొబిలైజేషన్ చేయడానికి సమయం పడుతోందని కంపెనీలు చెబుతున్నాయి. అలాగే, కొన్ని చోట్ల డిజైన్ల మార్పులు, పెరిగిన నిర్మాణ ఖర్చులు , ముడిసరుకు లభ్యత వంటి అంశాలను కూడా కాంట్రాక్ట్ ఏజెన్సీలు కారణంగా చూపుతున్నాయి.
ప్రభుత్వ హెచ్చరిక.. ఇకపై ఉపేక్ష లేదు
ఇటీవల నెలపాడులో గెజిటెడ్ అధికారుల క్వార్టర్లను పరిశీలించిన మున్సిపల్ శాఖ మంత్రి పి. నారాయణ నిర్మాణ సంస్థల తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పని చేస్తారా.. లేక తప్పుకుంటారా అంటూ ఆయన ఘాటుగా హెచ్చరించారు. ముఖ్యంగా షాపుర్జీ పల్లోంజీ వంటి సంస్థల ప్రతినిధులను పనుల నుంచి తప్పించాలని అధికారులను ఆదేశించడమే కాకుండా, నిర్ణీత గడువులోగా పనులు పూర్తి చేయని కంపెనీలపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. 2026 మార్చి నాటికి 4,000 నివాస గృహాలను పూర్తి చేయాలని ప్రభుత్వం డెడ్ లైన్ విధించింది. ఒకవైపు ప్రభుత్వం నిధుల సమీకరణపై దృష్టి పెట్టి పనులను పరుగులు తీయించాలని చూస్తుంటే, మరోవైపు కాంట్రాక్టర్ల జాప్యం రాజధాని కలను ఆలస్యం చేస్తోంది. చిన్న చిన్న ప్యాకేజీలు తీసుకున్న కంపెనీలు 60 శాతం పైగా పురోగతి చూపిస్తున్న తరుణంలో, భారీ కంపెనీలు ఎందుకు వెనుకబడుతున్నాయన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.


