సొంత రాజధానిపై కుట్రలు చేసే వాళ్లు ఎవరైనా ఉంటారా?. ఎక్కడా ఉండరు కానీ.. ఒక్క ఏపీలో ఉంటారు. జగన్ రెడ్డి ఏపీ రాజధానిపై భయంకరమైన కుట్రలు చేస్తూనే ఉన్నారు. అమరావతిపై ఇప్పుడు ప్రాంతీయ విద్వేషాల కుట్రను అమలు చేస్తున్నారు. ఉత్తరాంధ్రలో వయసుడిగిపోయిన నేతలతో.. ప్రెస్మీట్లు పెట్టించి అమరావతికి వ్యతిరేకంగా మాట్లాడిస్తున్నారు. అటు రాయలసీమలో ..భూమన కరుణాకర్ రెడ్డిని ముందు పెట్టి అదే డ్రామా ఆడుతున్నారు.
అమరావతి కడితే ఇతర ప్రాంతాలకు ఎలా నష్టం?
ఉత్తరాంధ్ర రాయలసీమ ప్రాంతాల్లోని సీనియర్ నేతలను ముందు పెట్టి అమరావతికి వ్యతిరేకంగా మాట్లాడించడం విద్వేష కుట్రలో భాగమే. ఉత్తరాంధ్రలో ధర్మాన ప్రసాదరావు వంటి నేతలు అమరావతి కడితే మా ప్రాంతం వెనుకబడుపోతుంది అంటూ చేస్తున్న వ్యాఖ్యలు కేవలం ప్రజలను తప్పుదోవ పట్టించడానికే. అటు రాయలసీమలో భూమన కరుణాకర్ రెడ్డి వంటి వారిని అడ్డం పెట్టుకుని ఇదే తరహా రాజకీయాలు చేయిస్తున్నారు. వయసు మళ్లిన ఈ నేతలను పావులుగా వాడుకుంటూ, అమరావతిపై విషాన్ని చిమ్మడం ద్వారా ప్రజల మధ్య ప్రాంతీయ చిచ్చు పెట్టడమే జగన్ రెడ్డి అసలు లక్ష్యంగా కనిపిస్తోంది.
సంపద సృష్టి కేంద్రంగా అమరావతి
ఒక రాష్ట్రానికి బలమైన రాజధాని అనేది కేవలం పరిపాలన కేంద్రం మాత్రమే కాదు, అది ఒక ఎకనామిక్ ఇంజిన్ . పొరుగు రాష్ట్రాలను గమనిస్తే.. చెన్నై తమిళనాడుకు, బెంగళూరు కర్ణాటకకు, హైదరాబాద్ తెలంగాణకు ఎలా ఆర్థిక వెన్నెముకగా నిలిచాయో అందరికీ తెలిసిందే. ఆయా నగరాల్లో సృష్టించే సంపద రాష్ట్రం మొత్తం మీద జరిగే అభివృద్ధికి, సంక్షేమ పథకాలకు నిధులు సమకూరుస్తుంది. అమరావతి కూడా అదే తరహాలో ఏపీకి ఒక పిల్లర్ లా నిలబడాలి. కానీ, అటువంటి బలమైన పునాది రాష్ట్రానికి లేకుండా చేయాలని చూడటం అంటే రాష్ట్ర భవిష్యత్తును అంధకారంలోకి నెట్టడమే అవుతుంది. విద్వేష కుట్రలతో జగన్ అదే చేస్తున్నారు.
విద్వేషం వెనుక రాజకీయ భయం
అమరావతి నిర్మాణం పూర్తయితే ఆ క్రెడిట్ అంతా చంద్రబాబు నాయుడు , కూటమి ప్రభుత్వానికి వెళ్తుందనే భయం జగన్ రెడ్డిలో స్పష్టంగా కనిపిస్తోంది. అందుకే, అభివృద్ధిని అడ్డుకోవడానికి ప్రాంతీయ అసమానతల పేరుతో విద్వేషాన్ని ఆయుధంగా చేసుకుంటున్నారు. అమరావతిలో నిర్మించే ఐకానిక్ భవనాలు, వచ్చే పరిశ్రమలు, ఐటీ హబ్‌లు కేవలం ఆ చుట్టుపక్కల ప్రాంతాలకే పరిమితం కావు. అక్కడ వచ్చే ఆదాయం ఉత్తరాంధ్రలోని వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి, రాయలసీమలోని సాగునీటి ప్రాజెక్టులకు వరంగా మారుతుంది. ఈ సత్యాన్ని మరుగున పరిచి, ప్రజల మధ్య గోడలు కట్టాలని చూడటం శోచనీయం.
ప్రజలు గ్రహించాల్సిన వాస్తవం
ప్రజలు ఇప్పుడు చాలా చైతన్యవంతులయ్యారు. ఐదేళ్లలో రాజధాని లేక రాష్ట్రం ఎంత నష్టపోయిందో అందరూ కళ్లారా చూశారు. యువత ఉపాధి కోసం పక్క రాష్ట్రాలకు వలస పోవడానికి ప్రధాన కారణం రాష్ట్రానికి ఒక కేంద్ర బిందువు లేకపోవడమే. రాజకీయ నేతలు తమ స్వార్థం కోసం చేసే ప్రసంగాలకు ప్రభావితం కాకుండా, అమరావతి అనేది రాష్ట్రం మొత్తానికి కలిగే మేలు అని గుర్తించాలి. విద్వేషపు విత్తనాలు నాటే వారిని తిప్పికొట్టి, అమరావతి నిర్మాణంలో భాగస్వాములు కావడమే నేటి అవసరం. రాష్ట్రం ఒక పిల్లర్ లా నిలబడాలంటే అమరావతి విజయం సాధించాలి.
