ఏపీ రాజధాని అమరావతి ప్రాంతం ఇప్పుడు ఒక మహా నిర్మాణ క్షేత్రాన్ని తలపిస్తోంది. ఐదేళ్ల స్తబ్దతను వీడి, ఇప్పుడు ఊహించని వేగంతో పనులు పరుగులు పెడుతున్నాయి. ప్రస్తుతం అక్కడ రోజుకు మూడు షిఫ్టుల్లో కనీసం 15 వేల మంది కార్మికులు నిరంతరం శ్రమిస్తున్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అసెంబ్లీ, సచివాలయం వంటి పరిపాలనా భవనాలే కాకుండా, నివాస సముదాయాలు కూడా శరవేగంగా పూర్తి కావస్తున్నాయి. ముఖ్యంగా 2026 మార్చి నాటికి ప్రభుత్వ ఉద్యోగుల కోసం 4,000 ఇళ్లను పూర్తి చేసి అందజేయాలని ప్రభుత్వం డెడ్ లైన్ విధించింది.
ప్రవేటు సంస్థల నిర్మాణాలు కూడా !
ప్రభుత్వ భవనాలతో పాటు, గతంలో భూములు పొందిన ప్రైవేటు సంస్థలకు కూడా సర్కార్ గడువులను స్పష్టం చేసింది. దీంతో అమరావతిలో ప్రైవేటు రంగం కూడా భారీగా పెట్టుబడులతో ముందుకొస్తోంది. హోటళ్లు, కార్పొరేట్ ఆస్పత్రులు, అంతర్జాతీయ విద్యా సంస్థలు, వాణిజ్య సముదాయాల నిర్మాణాలు ఒకదాని వెనుక ఒకటి ప్రారంభమయ్యాయి. మారియట్, దస్పల్లా వంటి ప్రముఖ హోటల్ గ్రూపులు తమ నిర్మాణాలను వేగవంతం చేయగా, వీఐటీ, ఎస్ఆర్ఎం వంటి యూనివర్సిటీలు ఇప్పటికే తమ కార్యకలాపాలను విస్తరిస్తున్నాయి. రానున్న రెండేళ్లలో అమరావతి ఒక పరిపూర్ణ నగరంగా రూపుదిద్దుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.
అర్థరాత్రి కూడా తగ్గని హోరు..
అమరావతి రోడ్లపై ఇప్పుడు ఎటు చూసినా నిర్మాణ సామాగ్రిని మోసుకెళ్లే భారీ వాహనాలే కనిపిస్తున్నాయి. పండగలు, సెలవులు అనే తేడా లేకుండా పనులు సాగుతున్నాయి. రాత్రి వేళల్లో కూడా ఫ్లడ్ లైట్ల వెలుగులో వేల మంది కార్మికులు పనిచేస్తుండటం చూస్తుంటే, రాజధాని నిర్మాణంపై ప్రభుత్వం ఎంతటి దృఢ సంకల్పంతో ఉందో అర్థమవుతోంది. సీడ్ యాక్సెస్ రోడ్డు నుంచి అంతర్గత రహదారుల వరకు ప్రతిచోటా యంత్రాల సందడి కనిపిస్తోంది. గడువులోగా మౌలిక సదుపాయాల కల్పన పూర్తి చేయాలన్న పట్టుదలతో అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.
నిధుల ప్రవాహం.. పనులకు కొరత లేని వైనం
కేంద్ర ప్రభుత్వం నుంచి అందుతున్న ఆర్థిక సహకారంతో పాటు, ప్రపంచ బ్యాంక్ నిధులు కూడా తోడవడంతో అమరావతిలో పనులకు నిధుల కొరత లేకుండా పోయింది. దాదాపు 37,000 కోట్ల రూపాయల విలువైన టెండర్లకు ఆమోదం లభించి, అవి క్షేత్రస్థాయిలో అమలులోకి వచ్చాయి. వరద నివారణ కోసం డచ్ పరిజ్ఞానంతో కాల్వల డిజైన్లు సిద్ధం చేయడం, హైటెన్షన్ విద్యుత్ లైన్ల మార్పు వంటి క్లిష్టమైన పనులు కూడా సమాంతరంగా జరుగుతున్నాయి. ఇది కేవలం రాజధాని నిర్మాణం మాత్రమే కాదు, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు దిక్సూచిగా మారనుంది.
భవిష్యత్తుపై భరోసా.. పెరుగుతున్న పెట్టుబడులు
అమరావతి నిర్మాణ వేగం చూసి ఇన్వెస్టర్లలో కూడా కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. కేవలం ప్రభుత్వ కార్యాలయాలకే పరిమితం కాకుండా, ఐటీ కంపెనీలు, డేటా సెంటర్లు కూడా ఇక్కడ తమ కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు ఆసక్తి చూపుతున్నాయి. భూములు తీసుకున్న సంస్థలు వెనకడుగు వేయకుండా, త్వరితగతిన కార్యకలాపాలు ప్రారంభించేలా ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహకాలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. ఈ వేగం ఇలాగే కొనసాగితే, 2028 నాటికి అమరావతి దేశంలోనే అత్యుత్తమ నగరాలలో ఒకటిగా నిలుస్తుందనడంలో సందేహం లేదు.
