మై బ్రిక్ కి ఇదిగో ఇదీ లింక్…

ఏపీ నూతన రాజధాని నిర్మాణంలో ప్రజలంతా భాగస్వాములుగా మారడంకోసం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఓ అద్భుతమైన వ్యూహరచన చేశారు. ఆన్ లైన్ ద్వారా ఇ-బ్రిక్స్ కొనుగోలుచేసుకునే అవకాశం కల్పించారు. తద్వారా వచ్చే మొత్తం రాజధాని నిర్మాణానికి వినియోగిస్తారు. చక్కటి ఆలోచనతో చంద్రబాబు దీనికి సంబంధించిన వెబ్ సైట్ ప్రారంభిస్తే, మీడియా సరైన వెబ్ సైట్ లింక్ ఇవ్వకుండా ఎంతసేపటికీ `మై బ్రిక్ మై అమరావతి’ అన్న వెబ్ సైట్ ప్రారంభించారంటూ నానా హడావుడిచేసిపారేసింది. అక్కడితో ఆగకుండా మై బ్రిక్ మై అమరావతి అన్న వెబ్ సైట్ ద్వారా ప్రపంచంలో ఎవరైనా ఎక్కడినుంచైనా ఇటుకలకు విరాళాలు ఇచ్చేవీలు కలుగుతుందని ఊదరగొట్టింది.అదే నిజమని నమ్మేసిన చాలామంది నెట్ జెన్ల్ శోధన మొదలుపెట్టారు. వార్త తెలియగానే మనదేశంలోని తెలుగువారేకాకుండా విదేశాల్లో ఉన్న తెలుగువారంతా ఈ వెబ్ సైట్ కు వెళ్ళాలనీ,వెంటనే విరాళాలు ఇవ్వాలని భావించారు. కానీ వారికి గూగుల్ వంటి సెర్చ్ ఇంజెన్స్ లో మై బ్రిక్ మై అమరావతి అంటూ టైప్ చేసి వెతికినా సదరు వెబ్ సైట్ (మై బ్రిక్ మై అమరావతి) కనిపించలేదు.

విజయవాడలో గురువారం జరిగిన వెబ్ సైట్ ఆవిష్కరణఉత్సవ సభలో ఈ వెబ్ సైట్ ఎలా ఉంటుందో కూడా మీడియావాళ్లకు చూపించారు. కానీ చాలామంది మీడియావాళ్లు యుఆర్ఎల్ పై శ్రద్ధపెట్టలేదు. సీఆర్ డిఏ ఉద్యోగులు ఒకరోజు జీతం బ్రిక్స్ కోసం ఇచ్చారు. ఛానెళ్లలో ఎంతసేపటికీ మై బ్రిక్ మై అమరావతి- అన్న వెబ్ సైట్ ఓపెన్ చేశారని చెప్పారు. బహుశా అక్కడి అధికారులకు కూడా అసలు లింక్ అప్పటికి తెలిసిఉండదు. దీంతో నిజమైన వెబ్ లింక్ చాలాసేపటివరకు బయటపడలేదు. ఈ వెబ్ సైట్ ని ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేతులమీదగా ప్రారంభించాలని ముందుగా అనుకున్నప్పటికీ, ఇప్పుడే ప్రారంభిస్తే ఆయన వచ్చినప్పుడు స్పందన తీరుకూడా గమనించే వీలవుతుందన్న ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి ముందుగానే వెబ్ సైట్ ని ఇవ్వాళే ఓపెన్ చేశారు. ఒక్కో ఇటుక ఖరీదును రూ. 10గా నిర్ణయించారు.

form

అసలు వెబ్ లింక్ ఇదే..

మీడియావాళ్లు న్యూస్ ఇచ్చే తొందర్లో అసలు వెబ్ సైట్ లింక్ గురించి పట్టించుకోలేదు. ఆ లింక్ ఏమిటంటే… http://amaravati.gov.in/ ఇలా సెర్చ్ ఇంజన్ లో టైప్ చేస్తే అందులో హోమ్ పేజీలోనే మైబ్రిక్ – మై అమరావతి అన్న పదాలు ఇంగ్లీష్, తెలుగులో కనబడతాయి. ఇదే పేజీలో ముఖ్యమంత్రి సందేశం కూడా ఉంది. ప్రతిష్టాత్మకమైన అమరావతి రాజధాని నిర్మాణానికి మీరంతా ఒక్కొక్క ఇటుక పేరుస్తూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఒక్కొక్క బ్రిక్ ఖరీదు పది రూపాయని అదే పేజీలో స్పష్టంగా ఉంది. మనం ఆ వెబ్ సైట్ ని ఓపెన్ చేసేసమయానికి స్పందన ఎలా ఉన్నదో కూడా తెలుసుకోవచ్చు. అక్కడే, ఈ ఉద్యమంలో ఎంతమంది భాగస్వాములయ్యారో, ఎన్ని ఇటుకల కొనుగోలు జరిగిందో తెలిపే అంకెలు కనిపిస్తాయి. `డొనేట్ ఫర్ అమరావతి’ అన్న బటన్ దగ్గర క్లిక్ చేసి ఆన్ లైన్ ద్వారా ఇటుకలను కొనవచ్చు. కొనుగోలుచేసిన ఇటుకల(డిజిటల్ ఇటుకల)ను మనం అమరావతి నిర్మాణానికి ఇచ్చినట్లవుతుంది. తద్వారా ఓ మంచి కార్యక్రమానికి తాముకూడా సాయం చేశామన్న తృప్తి మిగులుతుంది. బ్రిక్స్ కొనుగోలు చేసేటప్పుడు మన పేరు, ఈ-మెయిల్, పుట్టిన తేదీ, పాన్ ,ఆధార్ నెంబర్ వంటి వివరాలు పొందుపరుస్తూ ఫోటో కూడా జతచేయవచ్చు.

అమరావతి నిర్మాణం కోసం ఏ ఉద్దేశంతో వెబ్ సైట్ ప్రారంభించారో ఆ వెబ్ సైట్ వివరాలు, ఎలా విరాళాలు పంపించాలో అన్న విషయాలను పక్కనబెట్టి ఎంతసేపటికీ మై బ్రిక్ మై అమరావతి వెబ్ సైట్ లాంచ్ చేశారని చెప్పడంతో చాలామంది అదే పేరుతో నెట్ సెర్చ్ ఇంజన్లలో శోధించి చివరకు విసుగుచెందారు. అయితే వెబ్ సైట్ తయారీదారులు కూడా http://amaravati.gov.in అని కాకుండా My Brick my Amaravathi అన్న పేరిటే వెబ్ సైట్ సిద్దం చేసిఉంటే ఈ గందరగోళం వచ్చిఉండేదికాదు. ఇకనుంచైనా ఈ ఉద్యమాన్ని స్ప్రెడ్ చేసేటప్పుడు మీడియా ఛానెళ్లు అసలు వెబ్ సైట్ లింక్ వివరాలు స్పష్టంగా అందిస్తే బాగుంటుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com