ఆంధ్రప్రదేశ్ కు రాజధాని ఏది అన్న ప్రశ్న ఎప్పుడూ లేదు. అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించిన రాజధానిగా అమరావతిని ఖరారు చేశారు. కానీ వైసీపీ చేసిన మూడు ముక్కలాట రాజకీయంతో ఏపీ భవిష్యత్ ఆగమ్యగోచరంగా మారింది. ఏపీ రాజధాని ఏది అన్నదానిపై సెటైర్లు, జోకులు వెల్లువెత్తాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు తమకు జరిగిన అవమానానికి బుద్ది చెప్పారు. తమ రాజధాని అమరావతే అని ఏకపక్షంగా తీర్పు చెప్పేశారు.
వైసీపీ చేసిన రాజధాని రాజకీయం వల్ల ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ ఏ మాత్రం ముందడుగు వేయలేకపోయింది. అస్తవ్యస్థ ఆర్థిక విధానాలతో గ్రోత్ లేకుండా చేసేశారు. కానీ ఇప్పుడు మళ్లీ తప్పు దిద్దుకునే అవకాశం లభించింది. అధికారంలోకి వచ్చినప్పటి నుండి కూటమి ప్రభుత్వం అదే పనిలో ఉంది. వీలైనంత వరకూ నిధుల సమస్య లేకుండా చేశారు. దాదాపుగా లక్ష కోట్ల రూపాయలు నిధులు వివిధ రూపాల్లో వచ్చే ఏర్పాట్లు చేశారు. అంటే పనులు జరిగినంత కాలం సమస్య రాదు.
అమరావతి పనులను రెండో తేదీన అంటే శుక్రవారం రీస్టార్ట్ చేయబోతున్నారు. ఇప్పటికే పనులు ప్రారంభించడానికి కాంట్రాక్ట్ పొందిన సంస్థలన్నీ తమ పనులు తాము చేస్తున్నాయి. ఆ తర్వాత ఒక్క రోజు కూడా పనులు పెండింగ్ లో ఉండే అవకాశం లేదు. అమరాతి ఊపందుకుంటే.. ప్రైవేటు పెట్టుబడులు పెద్ద ఎత్తున వస్తాయి. ఏపీలో ఎవరు ఎలాంటి ఖర్చు పెట్టినా ప్రభుత్వానికి వివిధ రకాల పన్నుల రూపంలో ముఫ్పై నుంచి నలభై శాతం తిరిగి వస్తుంది. ఈ ఖర్చు పెట్టేది రీ సైకిల్ కాకుండా బయట నుంచి వచ్చే పెట్టుబడులు అయితే ఆర్థిక వ్యవస్థ పరుగులు పెడుతుంది. గతంలో పథకాల పేరుతో ఇక్కడి డబ్బులు ఇక్కడే రీసైకిల్ చేయడం వల్ల ఎలాంటి ఉపయోగం కలగలేదు.
అమరావతి నిర్మాణం అనుకున్నట్లుగా సాగితే మూడేళ్లలో ఏపీ ఆర్థిక వ్యవస్థ భారీగా పుంజుకుంటుంది. ఉపాధి అవకాశాల గనిగా మారుతుంది. అదే జరిగితే…. ఏపీకి తిరుగులేని ఆర్థిక బలం చేకూరుతుంది.