“ సంకల్పంలో నిజాయితీ ఉంటే ఎన్ని కష్టాలు పడినా చివరికి విజయం దక్కుతుంది” . ఈ విషయం వ్యక్తులు, సంస్థలు, ప్రభుత్వాలు, దేశాలు ఇలా ఎవరి కోణంలో తీసుకున్నా స్పష్టంగా కనిపించే జీవిత సత్యం ఇది. అలాగే ఏదైనా విజయం గొప్పగా ఉండాలంటే…దాని కోసం పడే కష్టం కూడా ఆ రేంజ్ లోనే ఉంటుంది. కష్టపడకుండా వచ్చే విజయం ఏదీ నిలబడదు. అంత విలువ కూడా ఉండదు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి, అమరావతి రైతుల విషయంలో మరోసారి ఇదే జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి సంకల్పం ఉన్న నిజాయితి ఇప్పుడు మరోసారి రాజధాని పనులు రీస్టార్ట్ అయ్యేలా చేస్తోంది. అమరాతి రైతుల కష్టాలు.. వారికి చరిత్రలో నిలిచిపోయే చారిత్రక ఘట్టంలో భాగస్వాములుగా చేస్తున్నాయి.
ఏపీకి అతి పెద్ద ఆర్థిక వనరుగా మారనున్న అమరావతి
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత రాజధాని ఏది అంటే.. 99 శాతం మంది చెప్పిన మాట విజయవాడ. ఎందుకు అంటే.. అది రాష్ట్రం మధ్యలో ఉంది. అందరికీ అందుబాటులో ఉంటుంది. ఎంతో కొంత అభివృద్ధి చెందింది. కృష్ణానది చెంతనే ఉంది. అయితే ఆంధ్రప్రదేశ్ రాజధాని అనే బోర్డు మాత్రమే కాకుండా విద్యా, ఉపాధి అవకాశాల గనిగా మార్చాలన్న ఉద్దేశం, గుంటూరు, విజయవాడను కలిపేలా రాజధాని ఏర్పాటు చేస్తే మహా నగరం ఏర్పడుతుందన్న ఆశయంతో 2014లో ప్రభుత్వం రాజధానిగా అమరావతిని నిర్ణయించింది. ఆనాడు పార్టీలన్నీ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపాయి. నీతి లేని నాయకులు తర్వాత మాట తప్పారు అది వేరే విషయం. అమరావతి, కృష్ణా నది తీరంలో ఉన్న ఆధునిక నగరంగా, విశాలమైన భూ వనరులు, వ్యూహాత్మక భౌగోళిక స్థానంతో ఉన్న ప్రాంతం. 2014లో రాష్ట్ర విభజన తర్వాత, రైతులు స్వచ్ఛందంగా 33,000 ఎకరాల భూమిని అందించారు, ఇది సామాజిక సహకారానికి నిదర్శనం. ఈ భూమి ప్రభుత్వ కార్యాలయాలు, అంతర్జాతీయ మౌలిక సదుపాయాలు, ఆర్థిక కేంద్రాలను నిర్మించడానికి ఉపయోగపడుతుంది. ప్రభుత్వం ఇప్పుడు అదే పనిలో ఉంది. అమరాతిని ప్రపంచస్థాయి రాజధానిగా మార్చేందుకు రాజధాని వనరులతోనే ప్రయత్నాలు చేస్తున్నారు. ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అమరావతి నిర్మాణాన్ని సెల్ఫ్-ఫైనాన్స్ మోడల్‌తో ప్రారంభించి, రైతుల స్వచ్ఛంద భూమి దానం, ఆర్థిక స్వావలంబన ద్వారా భారతదేశానికి రోల్ మోడల్‌గా నిలిచారు. ఈ నమూనా, రాజధాని నిర్మాణంలో సామాజిక, ఆర్థిక సమన్వయానికి ఒక ఉదాహరణ. భారతదేశ దక్షిణ ద్వారం అనే ఆలోచన సఫలమైతే, అమరావతి – ఆధునికత, సాంస్కృతిక వారసత్వం, ఇన్ క్లూజివ్ గ్రోత్ లకు చిహ్నంగా నిలుస్తుంది. ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఐక్యత, ఆత్మవిశ్వాసాన్ని రేకెత్తిస్తుందని నిపుణులు నమ్మకంతో ఉన్నారు.
అభివృద్ధికి పిల్లర్‌గా అమరావతి
సింగపూర్ గతంలో మాస్టర్ ప్లాన్ ఇచ్చింది. భారీగా పెట్టుబడులు పెట్టేందుకు కూడా రెడీ అయింది. కానీ సొంత కాళ్లను నరుక్కునే పాలకుడు అయిన జగన్ రెడ్డి మొత్తం రద్దు చేసేశారు. సింగపూర్ ఆధారిత మాస్టర్ ప్లాన్‌తో రూపొందిన అమరావతి, స్మార్ట్ టెక్నాలజీ, పర్యావరణ సమతుల్యతను కలిగిన గ్రీన్‌ఫీల్డ్ సిటీగా రాజధానిగా నిర్మించడానికి ఏర్పాట్లు చేశారు. ఏపీకి అమరావతి మధ్యలో ఉంటుంది. ఇది ఓ గ్రోత్ ఇంజిన్‌గా మారుతుంది. ఆంధ్రప్రదేశ్‌కు 974 కిలోమీటర్ల సముద్రతీరం, తొమ్మిది ఓడరేవులు ఉన్నాయి, ఇవి అమరావతిని వాణిజ్య కేంద్రంగా మార్చేందుకు ఉపయోగపడతాయి. విశాఖపట్నం వంటి ఓడరేవులు తూర్పు ఆసియా దేశాలైన సింగపూర్, జపాన్, దక్షిణ కొరియాతో నౌకా కనెక్టివిటీని బలోపేతం చేస్తాయి. ఈ ఓడరేవులు ఉక్కు, వ్యవసాయ ఉత్పత్తులు, సీఫుడ్ ఎగుమతులను పెంచుతూ, భారతదేశ “ఏక్ట్ ఈస్ట్” విధానానికి దోహదపడతాయి. విజయవాడ, గుంటూరు వంటి సమీప నగరాలు రవాణా, వాణిజ్య కేంద్రాలుగా అమరావతిని దేశంతో అనుసంధానం చేస్తాయి. రాష్ట్రంలోని ఐటీ, బయోటెక్, ఫార్మా రంగాలు అమరావతిని ఆవిష్కరణ కేంద్రంగా రూపొందించగలవు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే అమరావతికి ప్రైవేటు పెట్టుబడులను ఆకర్షించేందుకు అందుబాటులో ఉన్న అన్ని ప్రయత్నాలనూ చేస్తోంది. చంద్రబాబునాయుడు త్వరలో సింగపూర్ వెళ్లనున్నారు. మరోసారి పెట్టుబడుల ప్రతిపాదనలు చేయనున్నారు. అయితే జగన్ అనే వ్యక్తిని చూసి గతంలో బాధలు పడిన వారు భయపడే అవకాశం ఉంది. వారు ఎంతగా నమ్మకాన్ని పెంచుకుంటారా అన్నదాన్ని బట్టి అమరావతికి పెట్టుబడులు వస్తాయి.
చంపేసే ప్రయత్నం పోసినా ఊపిరి పోసుకున్న ఆంధ్రుల రాజధాని
అమరావతిపై కుట్రలు అంటే సొంత రాష్ట్రంపై కుట్రలు చేసుకున్నట్లే. అసెంబ్లీ సాక్షిగా అమరావతిని రాజధానిగా అంగీకరించిన జగన్ రెడ్డి గెలిచేందుకు కూడా అదే రాజధానిగా అభివృద్ది చేస్తామని చెప్పి కుట్రలు చేశారు. అమరావతిపై ఐదేళ్ల పాటు వరుసగా దాడులు చేశారు. అమరావతి రైతుల కడుపుల మీద తన్నారు. మాస్టర్ ప్లాన్ దగ్గర నుంచి పేదలకు ఇళ్ల స్థలాల పేరుతో ప్రతి ఒక్క అంశాన్ని అమరావతిపైనే ఎక్కు పెట్టి ఊపిరి తీయాలనుకున్నారు. ప్రజలు ఒక్క సారి మోసపోతారు. ప్రతీ సారి మోసపోరు కదా. వైజాగ్ ను రాజధాని చేస్తామని ఉత్తరాంధ్ర అభివృద్ధి అని జగన్ చెప్పిన మాటల్ని ఎవరూ నమ్మలేదు. పోనీ కర్నూలు అయినా పరువు దక్కిందా అంటే అదీ లేదు. అక్కడి ప్రజల్లో ఉన్న ఆగ్రహాన్ని గుర్తించలేదు. అమరావతి స్వాప్నికుడు చంద్రబాబు ఐదేళ్లలో ఏపీకి మహత్తరమైన రాజధానిని అందించాలన్న పట్టుదలతో ఉన్నారు. ఆయన వరుసగా రెండో సారి గెలిచి ఉంటే.. ఈ ఐదేళ్లలో అమరావతి ఓ అద్భుతమైన నగరంగా రూపుదిద్దుకుని ఉండేది. రెండు వందలకుపైగా సంస్థలకు భూములు కేటాయించారు. అవన్నీ శరవేగంగా నిర్మాణాలు పూర్తి చేసుకుని ఉండేవి. అంతర్జాతీయ సంస్థలు వచ్చేవి. ఏపీ యువతకు ఉద్యోగావకాశాలు వచ్చేవి . ఈ విషయాన్ని గుర్తు చేసుకుని చంద్రబాబు అప్పుడప్పుడూ బాధపడుతూ ఉంటారు. అయినా ఆయన నిరాశకు గురి కాలేదు. 75 ఏళ్ల వయసులో ఆయన శక్తి వంచన లేకుండా ఏపీకి .. ప్రపంచ స్థాయి రాజధానిని అందించేందకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు అంతా బాధ్యత చంద్రబాబుపై ఉంది. ఆయన విజన్ మొదటి నుంచి సుస్పష్టం. తాను శాశ్వతం కాదని..రాష్ట్రం శాశ్వతమని.. పోలవరం, అమరావతి శాశ్వతమని ఆయన పదే పదే చెబుతూ వస్తున్నారు. అమరావతిని, పోలవరాన్ని ప్రజలకు అంకింత చేయాలన్నది ఆయన పట్టుదల. వయసు కారణంగా రాను రాను తనలో శక్తి కూడా ఉడిగిపోతుదంని ఆయనకూ తెలుసు.కానీ ఆయన మనోబలం మాత్రం చెక్కు చెదరదు. అదే ఇప్పుడు ప్రజల నమ్మకం.
అమరావతి రైతుల త్యాగం వెలకట్టలేనిది !
ప్రపంచంలోనే ఎవరూ చేయని సాహసాన్ని అమరావతి రైతులు చేశారు. రోడ్డు విస్తరణకు అర ఎకరం భూసేకరణ చేయడానికి తంటాలు పడే దేశంలో.. 35 వేల ఎకరాలు స్వచ్చందంగా ఇచ్చారు. అమరావతితో పాటు తాము కూడా ఎదుగుతామని ఆశపడ్డారు. రాష్ట్ర ఆర్థిక ఆయువు పట్టుకు తాము కొంత ధారబోశామని అనుకున్నారు. అంతే కాదు వారు రక్తాన్ని కూడా చిందించాల్సి వచ్చింది. ఐదేళ్లు మహాపోరాటం చేయాల్సి వచ్చింది. ఇప్పుడు ఆ పోరాటం ఫలించింది. విజేతలుగా నిలిచారు. అమరావతి అనే నగరం ఏదో ఆషామాషీగా నిర్మితమై ఉంటే ఎవరూ పట్టించుకునేవారు కాదు. ఇప్పుడు అమరావతిలో జరిగే ప్రతి పని అద్భుతమే. రెండున్నరేళ్లలో అమరావతి మొదటి దశను పూర్తి చేస్తే.. ఆటోమేటిక్‌గా ప్రభుత్వ, ప్రైవేట సంస్థల కార్యాలయాలు రాజధానికి క్యూ కడతాయి. విద్య, ఉపాధి నగరంగా మారుతుంది. ఒక్క సారి ఊపందుకుంటే.. జగన్ లాంటి మరే ఉత్పాతమూ రాజధానిని ఏమీ చేయలేదు. అయితే అమరావతిపై నిరంతరం దాడులు చేయగలరు. ఇప్పుడు అదే చేస్తున్నారు. అడ్డగోలు అవినీతి ద్వారా సంపాదించుకుని పెట్టిన మీడియాలు, సోషల్ మీడియాలతో ఏపీ రాష్ట్రంపైనే కుట్రలు చేస్తున్నారు.
ప్రజల ఆకాంక్షల్ని నెరవేర్చాల్సిన అవసరం
రెండో సారి ప్రజలు అనూహ్యమైన తీర్పు ఇచ్చారు. ఎంతో పటిష్టమైన ప్రభుత్వం ఉండి.. ప్రతిపక్షం కూడా ఉండకూడదన్న రీతిలో తీర్పు ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా లేదు. ప్రజలు అమరావతి విషయంలో చాలా స్పష్టమైన తీర్పు ఇచ్చారు. ఇప్పుడు కేంద్రం కూడా సహకరిస్తోంది. అన్ని రకాలుగా యాభై వేల కోట్ల రూపాయల్ని సమకూర్చారు. దీని వల్ల అమరావతికి రానున్న రోజుల్లో నిధుల కొరత ఉండదు. అమరావతి నిర్మాణంలోనే ఆర్థిక కార్యకలాపాలు పుంజుకోనున్నాయి. ఇప్పటికే పనులు ప్రారంభించడానికి కాంట్రాక్ట్ పొందిన సంస్థలన్నీ తమ పనులు తాము చేస్తున్నాయి. ఆ తర్వాత ఒక్క రోజు కూడా పనులు పెండింగ్ లో ఉండే అవకాశం లేదు. అమరావతి ఊపందుకుంటే.. ప్రైవేటు పెట్టుబడులు పెద్ద ఎత్తున వస్తాయి. ఏపీలో ఎవరు ఎలాంటి ఖర్చు పెట్టినా ప్రభుత్వానికి వివిధ రకాల పన్నుల రూపంలో ముఫ్పై నుంచి నలభై శాతం తిరిగి వస్తుంది. ఈ ఖర్చు పెట్టేది రీ సైకిల్ కాకుండా బయట నుంచి వచ్చే పెట్టుబడులు అయితే ఆర్థిక వ్యవస్థ పరుగులు పెడుతుంది. గతంలో పథకాల పేరుతో ఇక్కడి డబ్బులు ఇక్కడే రీసైకిల్ చేయడం వల్ల ఎలాంటి ఉపయోగం కలగలేదు. అమరావతి నిర్మాణం అనుకున్నట్లుగా సాగితే మూడేళ్లలో ఏపీ ఆర్థిక వ్యవస్థ భారీగా పుంజుకుంటుంది. ఉపాధి అవకాశాల గనిగా మారుతుంది. అదే జరిగితే…. ఏపీకి తిరుగులేని ఆర్థిక బలం చేకూరుతుంది. ఏ సైతాన్లు కూడా అడ్డుకోలేవు.
ప్రధాని మోదీ గతంలో నీరు, మట్టి తీసుకు వచ్చారని సెటైర్లు వేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆయన యాభై వేల కోట్ల రూపాయల ఆర్థిక సాయం అందడంలో కీలక పాత్ర పోషించారు. ఈ సారి ఆయన చేతుల మీదుగా ప్రారంభమయ్యే అమరావతి.. అనతి కాలంలో ఎవరూ ఊహించని విధంగా ఎదుగుతుంది. అందులో సందేహమే ఉండదు. అమరావతికి ఆటంకాలు లేవు కానీ రాక్షసులు ఎలాంటి పనులు చేయినా చేయడానికి వెనుకాడరు. వారందర్నీ కంట్రోల్ చేసేలా.. ప్రకృతే బుద్ది చెబుతుంది. అమరావతి నిర్మాణం అవిఘ్నంగా సాగుతుంది. ప్రజలు తప్పుడు మాటలు వినకుండా.. అమరావతికి మద్దతుగా ఉంటే చాలు. అంతా సవ్యంగా జరిగిపోతుంది.