ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణంలో అత్యంత కీలకమైన రెండో దశ ల్యాండ్ పూలింగ్‌పై రైతులు ఎంతో నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. నిజానికి రెండో దశ ల్యాండ్ పూలింగ్ విజయవంతం కాదేమోనని చాలా మంది అనుమానాలు వ్యక్తం చేశారు. దీనికి కారణం ముందుగా మొదటి దశను పూర్తి చేసిన తర్వాతనే రెండో దశ పూలింగ్ చేయాలన్న డిమాండ్లు రావడమే. అయితే ప్రభుత్వం ప్రపంచ స్థాయి రాజధాని నిర్మాణం కోసం మరిన్ని మౌలిక వసతులు కల్పించేందుకు భూములు అవసరం అని.. ల్యాండ్ పూలింగ్ ప్రారంభించారు. అనూహ్యంగా రైతులు భూములు పూలింగ్‌కు ఇచ్చేందుకు స్వచ్చందంగా ఆసక్తి చూపిస్తున్నారు.
భయం కాదు నమ్మకం పెంచుకున్న రైతులు
వైసీపీ అధికారంలో ఐదేళ్ల కాలంలో రాజధాని మార్పుపై జరిగిన రగడ, జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని గత ప్రభుత్వం రైతులకు చేసిన అన్యాయం కళ్ల ముందే ఉన్నా.. ప్రస్తుతం రెండో దశ ల్యాండ్ పూలింగ్‌లో రైతులు స్వచ్ఛందంగా భూములు ఇస్తున్నారు. ల్యాండ్ పూలింగ్ను ప్రభావితం చేసేందుకు జగన్ రాజధాని నిర్మాణంపై తీవ్రమైన ఆరోపణలు కూడా చేశారు. పూలింగ్ ప్రారంభించిన రెండు రోజుల్లోనే సుమారు 1,200 ఎకరాలకు పైగా భూమిని రైతులు రెండో విడతలో రాజధాని కోసం అప్పగించేందుకు ముందుకు రావడం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజన్ , ఆయన మాటపై రైతులకు ఉన్న అచంచలమైన నమ్మకానికి నిదర్శనంగా నిలుస్తోంది.
అభివృద్ధి జరిగితేనే రైతులకు మేలు – చంద్రబాబుపై అంత నమ్మకం
సాధారణంగా దేశంలో ఎక్కడైనా సరే, ఒక పరిశ్రమ కోసమో లేదా ప్రాజెక్టు కోసమో ఒక్క ఎకరం భూమిని సేకరించాలన్నా ప్రభుత్వాలు నానా తంటాలు పడాల్సి వస్తుంది. పశ్చిమ బెంగాల్‌లోని సింగూరులో టాటా నానో ప్రాజెక్టు కోసం భూసేకరణ చేయబోతే చెలరేగిన హింసాత్మక ఆందోళనలు ఆ ప్రాజెక్టునే అక్కడి నుండి తరలించేలా చేశాయి. అలాగే మహారాష్ట్రలోని రత్నగిరి రిఫైనరీ ప్రాజెక్టు లేదా తమిళనాడులోని సేలం ఎనిమిది వరుసల రహదారి విషయంలో భూసేకరణకు వ్యతిరేకత ఏ స్థాయిలో ఉందో మనం చూశాం. చట్టబద్ధమైన పరిహారం ఇస్తామన్నా ప్రజలు భయపడే ఇలాంటి పరిస్థితుల మధ్య, అమరావతిలో మాత్రం వేల ఎకరాలను పూలింగ్ కింద వాటా పద్ధతిలో ఇవ్వడానికి రైతులు సిద్ధమవ్వడం ఒక అరుదైన రికార్డు.
అమరావతి పూలింగ్ ఓ చరిత్ర
చంద్రబాబు నాయుడు గతంలో చెప్పినట్లుగా, అమరావతి కేవలం ఒక నగరం కాదు, అది ఒక సంపద సృష్టి కేంద్రమని రైతులు బలంగా నమ్ముతున్నారు. ఐదేళ్లపాటు రాజధాని పనులు నిలిచిపోయినా, జగన్ ప్రభుత్వం మూడు రాజధానుల పేరుతో ఎన్ని అడ్డంకులు సృష్టించినా, తమ భూమికి భవిష్యత్తు ఉంటుందని రైతులు ఆశను వదలుకోలేదు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం రాగానే, ఎలాంటి బలవంతం లేకుండానే తాము నమ్మిన నాయకుడి కోసం మళ్లీ భూములు ఇవ్వడానికి క్యూ కట్టడం చూస్తుంటే, ప్రజల నమ్మకం ముందు రాజకీయ వ్యతిరేకత వీగిపోయిందని స్పష్టమవుతోంది. భూమిని అమ్మడం కాకుండా, అభివృద్ధిలో భాగస్వాములు కావడం అనే అమరావతి మోడల్ నేడు ప్రపంచ స్థాయి అధ్యయనాలకు వేదికైంది.
