మీరే రద్దు చేసిన సీఆర్డీఏ చట్టం ప్రకారం భూపంపిణీనా..? హౌ..? ఎలా..?

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాజధానికి రైతులు ఇచ్చిన భూముల్లో 1250 ఎకరాలను.. ఇళ్ల స్థలాలుగా మార్చి పంపిణీ చేయాలని నిర్ణయించుకుంది. దీనికి ప్రభుత్వం చెప్పిన ప్రాతిపదిక సీఆర్డీఏ చట్టంలోని సెక్షన్ 53(డి).  దీని ప్రకారం.. భూ సమీకరణ కింద సేకరించిన భూమిలో 5 శాతం పేదలకు గృహ వసతి కల్పించేందుకు ఉపయోగించాలి. అందుకే 1251 ఎకరాలు కేటాయిస్తున్నామని ప్రభుత్వం చెబుతోంది. సీఆర్డీఏ చట్టాన్ని ఇంత బాగా.. గౌరవిస్తున్న ప్రభుత్వం.. ఆ చట్టంలోని మిగతా అంశాలను కూడా.. పాటించడానికి సిద్ధంగా ఉందా..? అందులో పేర్కొన్న విధంగా అమరావతిని నిర్మించబోతోందా..? ఇది ఇప్పుడు సామాన్యుల్లో వస్తున్న ప్రశ్నలు.

సీఆర్డీఏ చట్టాన్ని ప్రభుత్వం అమలు చేయడానికి సిద్ధపడినట్లేనా..?

రాజధాని నిర్మాణం కోసమే..  క్యాపిటల్ రీజియన్ డెవలప్‌మెంట్ అధారిటీ.. సీఆర్డీఏను.. గత ప్రభుత్వం ఏర్పాటు చేసింది. రాజధానిని ఎలా నిర్మించాలి..? నిధుల సేకరణ ఎలా జరగాలి..? ప్రజారాజధానిగా ఎలా మార్చుకోవాలి..? అక్కడ నివసించే పేదల్ని ఎలా కాపాడుకోవాలి..? రాజధాని కోసం భూములిచ్చిన రైతులకు.. ఎలా ప్రయోజనం కల్పించాలి.? ఇలా ప్రతి అంశంపై సమగ్రమైన విషయాలతో చట్టం రూపొందిందింది. ఇందులో రాజధానికి భూములిచ్చిన రైతులతో పాటు ప్రభుత్వానికీ హక్కులు, బాధ్యతలు ఉన్నాయి. రైతులు మధ్యలో భూమి వెనక్కి అడగకూడదు.. అలాగే ప్రభుత్వమూ ఒప్పందం నుంచి వెనక్కి పోకూడదు. ప్రభుత్వం వెనక్కి పోతే… 2013 భూసేకరణ చట్టం ప్రకారం.. పరిహారం చెల్లించాలి.

సీఆర్డీఏ రద్దు బిల్లు అసెంబ్లీలో పాస్..! ప్రభుత్వమే లెక్కలోకి తీసుకోవడం లేదా..?

గత ప్రభుత్వమే సీఆర్డీయే చట్టాన్ని చేసింది కాబట్టి… ఎక్కడా అమలులో లోటుపాట్లు రానీయలేదు. కానీ ప్రభుత్వం మారిన తర్వాతే సమస్య వచ్చింది. సీఆర్డీఏ చట్టాన్ని అమలు చేయడం పూర్తిగా నిలిపివేశారు. ఆ చట్టాన్ని రద్దు చేయడానికి సిద్ధమయ్యారు. ఈ మేరకు అసెంబ్లీలో బిల్లు పాస్ చేశారు. ప్రస్తుతానికి ఈ బిల్లు శాసనమండలి సెలక్ట్ కమిటీలో ఉంది. అక్కడి వ్యవహారం తేలిన తర్వాత సీఆర్డీఏ చట్టం రద్దయిపోతుంది. దీనిపై రైతులు న్యాయపోరాటం చేస్తున్నారు.. అది వేరే విషయం. కానీ.. అసలు ప్రభుత్వమే సీఆర్డీఏ చట్టాన్ని రద్దు చేయాలని.. అసెంబ్లీలో బిల్లు పాస్ చేసినప్పుడు.. అదే చట్టంలోని అంశాలతో ఇళ్ల స్థలాలుగా పంపిణీ చేయడానికి నిర్ణయం తీసుకోవడం అధికారవర్గాలను సైతం ఆశ్చర్య పరుస్తోంది. ప్రభుత్వం తాను తీసుకున్న నిర్ణయంపైనే.. తనకు నమ్మకం లేనట్లుగా వ్యవహరిస్తోందన్న అభిప్రాయం దీని ద్వారా కలుగుతోందంటున్నారు.

ఆ చట్టాన్ని తప్పనిసరిగా అమలు చేయాల్సిన పరిస్థితిలోకి ప్రభుత్వం..!?

సీఆర్డీఏ చట్టంలో ఐదు శాతం ప్రాంతాన్ని స్థలాలుగా పంపిణీ చేయాలని లేదు. ఇళ్లు లేని వారికి ఆవాసం కోసం వినియోగించాలని ఉంది. గత ప్రభుత్వం కొన్ని ప్రాంతాల్లో ప్రత్యేకంగా అలాంటి వారి కోసం అపార్టుమెంట్లు నిర్మించింది. వాటిని లబ్దిదారులకు పంపిణీ చేయాల్సి ఉంది. కానీ ఈ ప్రభుత్వం మాత్రం.. భూముల్నే పంపిణీ చేయాలని నిర్ణయంచుకుంది. ఇప్పుడు.. ఆ చట్టం ప్రకారం.. భూపంపిణీ చేస్తే.. అందులో ఉన్న మిగతా అంశాలను కూడా.. అమలు చేయక తప్పని పరిస్థితి ప్రభుత్వానికి ఏర్పడుతుందంటున్నారు. అదే జరిగితే.. రాజధానిలో నిర్మాణాలన్నీ పూర్తి చేసి.. రైతులకు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాల్సి ఉంటుంది. అది ప్రభుత్వ ఆలోచనకు విరుద్ధం అవుతుంది. ఈ విషయంలో ప్రభుత్వం వ్యూహం లేకుండా పోతోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com