అమరావతిలో పాలనాభవనాల శంకుస్థాపన వేడుక వూహించినట్టే ఒక ప్రశంసల తతంగంగా మారింది. వెంకయ్య నాయుడు, అరుణ్‌జైట్లీ, చంద్రబాబు నాయుడు పరస్పర ప్రశంసలు, ఇద్దరూ కలసి మూడో వారిని పొగడ్డం, గత ఏడాదిగా వింటున్న విషయాలే వివరంగా ఏకరువు పెట్టడం అంతా మొక్కుబడిగానే నడిచింది. మర్యాదకోసమైన ఆరుణ్‌జైట్లీ కొత్త విషయం చెప్పింది లేదు. 2లక్షల కోట్లకు పైగా ఇస్తున్నామని సాధారణ కేటాయింపులనే మళ్లీ మళ్లీ చెప్పారు. దానికే చంద్రబాబు నాయుడు అమితానందం వ్యక్తం చేశారు. ప్రత్యేక హొదా కంటే ఇదే ప్రయోజనమని అధికారికంగా ప్రకటించి వినయంగా కృతజ్ఞతలు చెప్పి తనవైపు నుంచి శాశ్వతంగా ఆ కథను ముగించే ప్రయత్నం చేశారు. ఇక వెంకయ్య షరా మామూలుగా విమర్శకులపై చిందులు తొక్కారు. ప్రత్యేక హోదా రానందుకు బాధపడే వారిని అసూయాగ్రస్తులుగా నిత్యశంకితులుగా ఏవేవో వర్ణనలు చేశారు. అసలు ఇది అధికారిక కార్యక్రమమనే మాటే మర్చిపోయి కాంగ్రెస్‌ను దుయ్యబట్టారు. చంద్రబాబు నాయుడు ఇచ్చిన వాటికి ధన్యవాదాలు చెప్పి ధన్యమవడం తప్ప నిర్దిష్టంగా ఎలాటి కోర్కెనూ ముందుకు తేలేదు.
మామూలుగా కొంత సూటిగా మాట్లాడే ఎంపి గల్లా అరుణ్‌కుమార్ మాత్రం రాజధానిలో భూములిచ్చిన రైతులకు క్యాపిటల్ గైన్స్ టాక్స్ మినహాయించాలని వినతిపత్రం ఇచ్చారు. దాన్ని పరిశీలిస్తామని జైట్లీ చెప్పారు. అయితే ఈ రాయితీ రైతుల పేరిట భూములు సేకరించిపెట్టుకున్నవారికి దక్కుతుందా అనేది సందేహంగానే వుంటుంది. అసలు నిర్మాణ ప్లాన్ లేకుండా కాంట్రాక్టర్లు ఖరారు కాకుండా ఈ నాల్గవ శంకుస్థాపన ఎందుకు చేశారన్నది మాత్రం ఎవరూ చెప్పలేదు. మాలాటి వాళ్లం వేసిన ప్రశ్నలను కూడా దాటేసి వూరికే పొగడుకుని ముగించారు. ఇప్పటి వరకూ వెంకయ్యకే పరిమితమైన సన్మానాలను జైట్లీకి కూడా చేయాలన్న ఆలోచనతోనే ప్రభుత్వం ఈ తతంగం చేసినట్టు కనిపిస్తుంది.