ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అభివృద్ధిలో మరో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. రాజధాని నిర్మాణానికి అవసరమైన భూమిని సమకూర్చుకునే క్రమంలో రెండో దశ భూ సమీకరణ అధికారికంగా ప్రారంభమైంది. రాజధాని అమరావతిని అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించాలనే పట్టుదలతో ఉన్న కూటమి ప్రభుత్వం, రెండో విడత భూ సమీకరణ ప్రక్రియను వేగవంతం చేసింది. ఇందులో భాగంగా నేడు వడ్డమాను, యండ్రాయి గ్రామాల్లో మొదటి రోజు భూ సమీకరణ కార్యక్రమాలు మొదలయ్యాయి.
రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ స్వయంగా ఈ కార్యక్రమంలో పాల్గొని, రైతులతో ముఖాముఖి చర్చించి రైతుల సందేహాలకు సమాధానాలు ఇచ్చారు. గ్రామసభల ద్వారా రైతులకు భూ సమీకరణ ప్రయోజనాలను వివరిస్తూ, వారిని ఈ భాగస్వామ్యంలోకి ఆహ్వానించాలని సీఆర్డీఏ అధికారులకు ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. రైతులు తమ సందేహాలను నివృతి చేసుకుని భూసమీకరణలో భూములు ఇవ్వాలా లేదా అన్నది డిసైడ్ చేసుకుంటారు.
రెండో విడతలో భాగంగా మొత్తం 16,666 ఎకరాల పట్టా , అసైన్డ్ భూములతో పాటు, ప్రభుత్వ భూమిని కలిపి మొత్తం 20,495 ఎకరాలను అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. తొలి దశలో 29 గ్రామాల నుంచి సేకరించిన 34,400 ఎకరాల భూమికి ఏ రకమైన ప్యాకేజీ అమలు చేశారో, అదే తరహా ప్రయోజనాలను రెండో దశలో ఇచ్చే రైతులకు కూడా వర్తింపజేయనున్నారు. భూ సమీకరణ కోసం సీఆర్డీఏ ఇప్పటికే ఏడు గ్రామాల్లో తొమ్మిది యూనిట్ కార్యాలయాలను ఏర్పాటు చేసింది. ప్రతి యూనిట్లో ఒక స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్, తహశీల్దార్ , సర్వేయర్ అందుబాటులో ఉండి రైతుల దరఖాస్తులను స్వీకరిస్తున్నారు.
