ఇప్పుడు కార్పొరేట్ ప్రపంచంలో ఎక్కడ చూసినా లేఆఫ్స్ అనే మాటే వినిపిస్తోంది. ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ అందుబాటులోకి వచ్చాక మొత్తం వాటితోనేపనులు చేయిస్తూ ఉద్యోగులను పనుల నుంచి తీసేస్తున్నారు. ఇటీవల తమ వేర్ హౌస్‌లలో పూర్తిగా రోబోలను వాడి.. మనుషుల్ని ఉద్యోగాల నుంచి తీసేయాలనుకున్న అమెజాన్.. ఇప్పుడు వైట్ కాలర్ జాబ్స్ పై కూడా పడింది. మొత్తం తమ వర్క్ ఫోర్స్ లో పది శాతం ఉద్యోగులను తగ్గించుకుంటున్నామని అమెజాన్ తెలిపింది.
ఉద్యోగులకు పంపిన మెయిల్ తమ ఆలోచనలు వివరించారు. ఏఐ కారణం అని చెప్పలేదు కానీ.. తాము ఏఐ, మెషిన్ లెర్నింగ్ లో ఎక్కువ పెట్టుబడులు పెడుతున్నామని అందుకే ఖర్చులు తగ్గించుకుంటున్నామని చెప్పుకొచ్చింది. మరి తీసేసే ఉద్యోగుల స్థానంలో ఎవరు పని చేస్తారు అంటే.. ఏఐ అని చెప్పక తప్పదు. డేటాకు మైండ్ అప్లయ్ చేసే తెలివితేటలతో.. అమెజాన్ డబ్బుల్ని మిగుల్చుకుంటోందని అర్థం చేసుకోవచ్చు.
అయితే ఏఐ వల్ల వచ్చే సమస్యలేమిటో.. ముందు ముందు కంపెనీలకు తెలిసి వస్తాయని టెక్ నిపుణులు చెబుతున్నారు. ఖర్చులు తగ్గించుకునే నెపంతో ఏఐని .. మనుషులకు ప్రత్యామ్నాయంగా వినియోగించడం వికటిస్తుందని చెబుతున్నారు. అయితే ఈ లేఆఫ్‌ల ప్రక్రియ ఇతర బడా సంస్థల్లోనూ జోరుగా సాగే అవకాశాలు ఉన్నాయని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.