తమిళ స్టార్ హీరో విజయ్ కష్టాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఆయన సినిమా ‘జననాయగన్’ రిలీజ్ కు కోర్టులు బ్రేకులు వేస్తున్నాయి. సినిమా ఆలస్యం అయ్యే కొద్దీ… దానిపై క్రేజ్ తగ్గుతూ వస్తోంది. మరోవైపు విజయ్ కూడా ఈ సినిమాని పట్టించుకోవడం మానేశాడని టాక్. ఆయన రాజకీయాలపై దృష్టి పెట్టిన సంగతి తెలిసిందే. రాబోయే ఎన్నికల్లో తన పార్టీని ఎలా గెలిపించుకోవాలి? అనే ఆలోచనల్లోనే ఉన్నాయి. దాంతో ఈ సినిమా రిలీజ్ అవుతుందా, లేదా? అనే విషయాన్ని ఆయన కూడా గాలికి వదిలేయాల్సిన పరిస్థితి వచ్చింది.
తాజాగా… ఓటీటీ సంస్థ అమేజాన్ ప్రైమ్ ‘జన నాయగన్’ సినిమాకు గట్టి షాక్ ఇచ్చింది. సినిమా రిలీజ్ ఆలస్యం అవుతుండడంతో తమ ఓటీటీ డీల్ కాన్సిల్ చేసుకొందని సమాచారం. జనవరికి విడుదల కావాల్సిన సినిమా ఇది. ఆ తరవాత వాయిదాలు పడుతూ వెళ్లింది. రిలీజ్ డేట్ విషయంలో అమేజాన్ నిర్మాతలపై ఒత్తిడి తీసుకొచ్చింది. కానీ.. రిలీజ్ డేట్ నిర్మాతల చేతుల్లో కూడా లేకుండా పోయింది. నెలకు ఇంత అంటూ.. ఓటీటీ డీల్ పై కోత విధించుకొంటూ వెళ్తోంది అమేజాన్. ఇప్పటికే సినిమా మూడు నెలలు ఆలస్యమైంది. ఇప్పటికీ రిలీజ్ డేట్ పై ఓ స్పష్టత లేకపోవడంతో అమేజాన్ పూర్తిగా ఓటీటీ డీల్ వదులుకొందని తెలుస్తోంది. అమేజాన్ తప్పుకోవడంతో ఇప్పుడు నెట్ ఫ్లిక్స్ దగ్గరకు వెళ్లనున్నారు నిర్మాతలు. నెట్ ఫ్లిక్స్ ఈ సినిమా ను కొంటుందా, లేదా? అనేది పక్కన పెడితే… సినిమా ఆలస్యం అయ్యే కొద్దీ ఓటీటీ రేటు తగ్గుతూ వెళ్తుంది. చివరికి ఈ సినిమాని ఎవరైనా కొంటారా, కొనరా అనే అనుమానాలూ ఉన్నాయి. సౌత్ సినిమాల్ని ఇంతింత రేటు పెట్టి కొనేది నెట్ ఫ్లిక్స్, అమేజాన్ మాత్రమే. అమేజాన్ పక్కకు తప్పుకొంటే ఇప్పుడు నెట్ ఫ్లిక్స్ ఆడిందే ఆట. వాళ్లు రేటు ఎంత ఫిక్స్ చేస్తే అంతకు నిర్మాతలు ఒప్పుకోవాలి. ఆ మేరకు నిర్మాతలు నష్టపోవాల్సిందే.