మాజీమంత్రి ,వైసీపీ నేత అంబటి రాంబాబు తన అరెస్ట్ పై పోలీసులకు ఓపెన్ ఆఫర్ ఇచ్చేశారు. తనను అర్ధరాత్రి అరెస్ట్ చేయవద్దని , రాత్రి సమయంలో వచ్చి డోర్లు కొట్టవద్దని కోరారు. పలానా కేసు ఉంది.. మీరు స్టేషన్ కు రావాలని ఫోన్ చేస్తే బట్టలు సర్దుకొని ఎంచక్కా వచ్చేస్తానంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
అంబటి రాంబాబు చేసిన ఈ వ్యాఖ్యలు వైసీపీలో కలకలం రేపుతున్నాయి. ప్రస్తుతం ఏపీ రాజకీయాలు లిక్కర్ స్కామ్ చుట్టూ తిరుగుతున్నాయి. అందులో ప్రమేయం ఉన్న వారిని ఒక్కరొక్కరుగా అరెస్ట్ చేస్తున్నారు. ఇప్పటి వరకైతే ఈ కేసులో అంబటి పేరు ఎక్కడా వినిపించలేదు. కానీ ఏదైనా ఓ కేసులో తనను అరెస్ట్ చేయాలనుకుంటే కొన్ని మినహాయింపులు ఇవ్వండని పోలీసులను రిక్వెస్ట్ చేసుకుంటున్నారు.
ఇప్పటికే అంబటి రాంబాబుపై పలు కేసులు రెడీగా ఉన్నాయి. దీంతో తన అరెస్ట్ ఖాయమని అంబటి రాంబాబు ముందస్తుగా ప్రిపేర్ అవుతున్నట్టు కనిపిస్తున్నారు. అరెస్టు చేసి తీసుకెళ్తే పరువు పోతుందనేది ఆయన ఆందోళన కావొచ్చు. అందుకే ముందు జాగ్రత్తనో ఏమో, ఫోన్ చేస్తే పోలీసు స్టేషన్ మెట్లు ఎక్కుతానంటూ ఓపెన్ ఆఫర్ ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది.