ఈరోజుల్లో, బస్ స్టాప్ సినిమాలతో చిన్న సినిమాల కలరింగే మార్చేశాడు మారుతి. యూత్ ఫుల్ సినిమాలకు కొత్త మీనింగు ఇచ్చాడు. ఆ ప్రభావంతో చాలా సినిమాలు వచ్చి సందడి చేశాయి. అయితే.. ఏదీ నిర్మాతకు గిట్టుబాటు కలిగించలేదు. యూత్ ఫుల్ కాలేజీ లవ్ స్టోరీలూ, ఆ బ్యాక్ డ్రాప్‌లోని కథలు ఆ తరవాత చాలా వరకూ తగ్గిపోయాయి. ఒక్కమాటలో చెప్పాలంటే… ఆ తరహా కథల్ని ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. అయితే చాలా కాలం తరవాత ఓ చిన్న సినిమా.. టైటిల్, ప్రచార చిత్రం ఆకట్టుకొనేలా తయారైంది. అదే.. అమీర్ పేట్లో! హైదరాబాద్‌లోని అమీర్ పేట్ అంటే.. కుర్రకారుకి అడ్డా. ఇక్కడ ఉన్నత లక్ష్యాల కోసం వచ్చినా.. ఆ తరవాత క్రమంగా చెడు అలవాట్లకు బానిసై.. జీవితాన్ని పాడుచేసుకొన్నవాళ్లే ఎక్కువగా కనిపిస్తుంటారు. అమీర్ పేట కథ కూడా ఇంచుమించు అలాంటిదే.
ట్రైలర్ కట్ చేసిన విధానం, అందులోని డైలాగులు (ఆఖరి పంచ్‌లో బూతు ధ్వనిస్తున్నా) యూత్‌ని ఎట్రాక్ట్ చేసేలానే ఉన్నాయి. శ్రీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో తనే హీరో! సాధారణంగా ఇలాంటి సినిమాల్ని చూసీ చూడనట్టు వదిలేయొచ్చు. కానీ ప్రతిష్టాత్మక మైన మయూరి సంస్థ ఈ చిత్రాన్ని పంపిణీ చేస్తోంది. విషయమున్న కథల్ని మాత్రమే ఎంకరేజ్ చేసే మయూరి ఈ సినిమాని ప్రమోట్ చేయాలనుకోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. అమెరికాలోనూ ఈ సినిమాని మయూరి సంస్థే విడుదల చేస్తోంది. ఇటీవల బిచ్చగాడు సినిమాని రిలీజ్ చేసి మంచి లాభాల్ని అందుకొంది మయూరి సంస్థ. అదే ఊపులో ఈ చిన్న సినిమానీ ప్రోత్సహిస్తోందన్నమాట. మరో విశేషం ఏమిటంటే ఈ సినిమాలోని హీరోయిన్.. పవన్ కల్యాణ్ సర్దార్ గబ్బర్ సింగ్‌లో ఓ చిన్న పాత్రలో మెరిసింది. పవన్‌కి బీటేసిన అమ్మాయి గ్యాంగులో అమీర్ పేట కథానాయిక కూడా ఉంది. మరి హీరోయిన్గా ప్రమోషన్ పొందిన ఆ అమ్మాయి జాతకం ఎలా ఉంటుందో చూడాలి. ఈనెల 16న ఈచిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ రోజులు, బస్ స్టాప్ స్థాయిలో అమీర్ పేట్లో కూడా ఆడితే… చిన్న సినిమాలు మరిన్ని సెట్స్‌పైకి వెళ్లిపోతాయనడంలో ఎలాంటి సందేహం లేదు.