ఆంధ్ర ప్రదేశ్ బీజేపీలో విబేధాలు రచ్చకెక్కుతూ పార్టీ పటిష్ఠతకు ఎవ్వరూ పనిచేయలేని పరిస్థితులు నెలకొన్న సమయంలో బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తాడేపల్లి గూడెంలో పార్టీ నిర్వహించే రైతుల సదస్సులో లు శుక్రవారం సాయంత్రం పాల్గొనబోతున్నారు. ఆయన సమక్షంలోనే ఈ విబేధాల గురించి పలుసార్లు సమాలోచనలు జరిగినా వాటిని కట్టడి చేయడంలో ఆయన సహితం నిస్సాహయంగా ఉంటున్నట్లు కనిపిస్తున్నది.
పార్టీ అధ్యక్ష పదవి చేపట్టిన తరువాత ఆయన రాష్ట్ర పర్యటనకు రావడం ఇది మూడోసారి. గత మార్చ్ లో రాజముండ్రి లో బహిరంగ సభకు హారాజైన సందర్భంగా పార్టీలో ఒక వర్గం బల ప్రదర్శనకు ప్రయత్నం చేసింది. ఇప్పుడు మరో వర్గం బలప్రదర్శనకు పూనుకున్నట్లు కనిపిస్తున్నది. పార్టీ నాయకులూ కులాలవారీగా విడిపోయి, ఒకరిపై మరొకరు అవకాశం దొరికినప్పుడు అల్లా రచ్చకు దిగుతూ ఉండడంతో దేశం మొత్తం మీద రాష్ట్ర అధ్యక్షుడి నియామకం కేవలం ఇక్కడనే అమిత్ షా చేయలేక పోయారు.
దానితో విశాఖపట్నం యం పి డా కె హరిబాబు తన పదవీకాలం పూర్తయి సంవత్సరం దాటుతున్నా ఇంకా ఆ పదవిలో కొనసాగుతున్నారు. అయితే తనను ఈ పదవిలో కొనసాగించటమో, మరొకరిని నియమించటమో తేలే వరకు తనకేమి పని అంటూ ఆయన ఏమీ పట్టన్నట్లు వ్యవహరిస్తున్నారు. రాష్ట్ర విభజన జరుగుగాక ముందు ఉమ్మడి రాష్ట్రాల్లో పార్టీ అధ్యక్షుడిగా ఉన్న జి కిషన్ రెడ్డి కార్యవర్గంలో వారే ఇప్పుడూ పదవులలో ఉండటం తప్ప పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి చేపట్టిన తరువాత హరిబాబు ఇంతవరకు కార్యవర్గం ఏర్పాటు చేయలేక పోయారు. అందుకు సంస్థాగతంగా ఎదురవుతున్న సవాళ్ళే కారణం అని తెలుస్తున్నది.
తెలుగు దేశంతో తెగతెంపులు చేసుకొని, 2019 ఎన్నికల నాటికి సొంతంగా అన్ని సీట్లకు పోటీ చేయాలని వాదిస్తున్న వర్గం పార్టీ యం ఎల్ సి సోము వీర్రాజును పార్టీ రాష్త్ర అధ్యక్షుడిగా నియమించామని సంవత్సర కాలంగా వత్తిడి తెస్తున్నది. రాజమండ్రిలో బహిరంగసభ జరిపిన ఈ వర్గం అక్కడనే అమిత్ షా అయన నియామకాన్ని ప్రకటిస్తారని భావించింది. అయితే ఆ ప్రకటన చేయక పోవడమే కాకుండా, ఆ తరువాత ఢిల్లీ లో రాష్ట్ర నాయకులతో జరిగిన సమావేశంలో చంద్ర బాబు నాయుడు తో తెగతెంపులు సిద్ధంగా లేమని ఆయన స్పష్టం చేయడంతో ఈ వర్గం నీరసపడింది.
వీర్రాజుకు మద్దతు తెలిపిన వారిలో మాజీ కాంగ్రెస్ నాయకులైన కావూరు సాంబశివరావు, కన్నా లక్ష్మీనారాయణ లతో పాటు బిజెపి జాతీయ ప్రధానకార్యదర్శి రాంమాధవ్, నరసాపురం యంపీ గోకరాజు రంగరాజు, కేంద్రమంత్రి నిర్మల సీతారామన్, పార్టీ రాష్ట్ర సంఘటన కార్యదర్శి రవీంద్రరాజు ఉన్నారు. ఆర్ యస్ యస్ నాయకత్వం కూడా వీర్రాజుకె మద్దతు తెలిపింది.
అయితే ఈ నియామకాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన కేంద్రమంత్రి యం వెంకయ్యనాయుడు అమిత్ షాను రాజముండ్రి రాకుండా చేయలేక పోయినా వీర్రాజు నియామకం జరుపకుండా చేయగలిగారు. ప్రస్తుతం తాడేపల్లిగూడెంలో సదస్సు నిర్వహిస్తున్న రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి మాణిక్యాలరావు వాస్తవానికి వీర్రాజు అనుచరుడే అయినా ప్రస్తుతం వెంకయ్యనాయుడు శిబిరంలో చేరారు. ఆయనకు మరో మంత్రి కామినేని శ్రీనివాస్, రాష్ట్ర అధ్యక్షుడు హరిబాబు తదితరులు అండగా ఉన్నారు. హరిబాబు నే ఆ పదవిలో కొనసాగించాలని కోరుతున్న వెంకయ్యనాయుడు, ఆయనను మార్చవలసి వస్తే మాణిక్యాలరావు ను రాష్ట్ర అధ్యక్షుడిగా చేయాలని సూచిస్తున్నట్లు తెలిసింది.
రాష్ట్రంలో పార్టీ పటిష్టత తన ప్రాధాన్యతలలో ఉన్నట్లు చెబుతూ వస్తున్న అమిత్ షా ఇక్కడ పార్టీలో నెలకొన్న విబేధాలను పరిష్కరించే ప్రయత్నం మాత్రం చేయక పోవడం పార్టీ నాయకులకు విస్మయం కలిగిస్తున్నది. అక్కడక్కడా సదస్సులు జరపటం, తరచూ పత్రికా సమావేశాలు జరపటం మినహా రాష్ట్రంలో పార్టీని పటిష్ట పరచే ప్రయత్నాలు జరగటం లేదని పార్టీ కార్యకర్తలు నిరుత్సాహానికి గురవుతున్నారు.