Anaganaga Movie Review
బోడి చదువులు వేస్టు – మీ బుర్రంతా భోంచేస్తూ.. అని సీతారామశాస్త్రి ఎప్పుడో వార్నింగ్ ఇచ్చారు. బట్టీపట్టడం, మార్కులు తెచ్చుకోవడం మాత్రమే చదువు, ర్యాంకులే తెలివి తేటల్ని నిర్ణయిస్తాయి అనే అజ్ఞానపు లోకంలోనే ఇంకా బతుకుతున్నాం. కార్పొరేట్ స్కూళ్లల్లో విద్యాబోధన మరీ యాంత్రికంగా తయారైపోయింది. పసి మనసుల్ని మార్కులు తెచ్చుకొనే యంత్రాల్లా చూస్తున్నారు. ఇదంతా మారాలి అని చాలా సినిమాలు తెరలు చించుకొన్నాయి. అలాంటి సినిమానే ‘అనగనగ’. ఈటీవీ విన్లో వచ్చిన సినిమా ఇది. సుమంత్ కథానాయకుడిగా నటించాడు. మరి ఈ సినిమా ఎలా వుంది? విద్యావ్యవస్థ గురించి ఇందులో ఏం చెప్పారు?
వ్యాస్ (సుమంత్) కార్పొరేట్ స్కూల్ లో టీచర్. వ్యాస్ భార్య భాగ్యలక్ష్మి (కాజల్ చౌదరి) అదే స్కూల్ కి ప్రిన్సిపల్. వీరిద్దరి కొడుకు రామ్ (మాస్టర్ విహార్ష్). పిల్లలకు చదువు చెప్పడంలో వ్యాస్కంటూ ఓ పద్ధతి ఉంది. ఎలాంటి పాఠమైనా కథలా చెబితే… సులభంగా అర్థం అవుతుందని నమ్ముతాడు. వ్యాస్ చేసే పనులు, పిల్లల్ని తీర్చిదిద్దుతున్న విధానం యాజమాన్యానికి నచ్చదు. అందుకే అవమానాలు ఎదురవుతుంటాయి. రామ్ చదువులో వెనుకబడతాడు. పరీక్షల్లో ఆఖరి ర్యాంక్ తనదే. ప్రిన్సిపల్ కొడుకే ఫెయిల్ అయితే అంతకంటే అవమానం ఏముంటుంది? అని యాజమాన్యం కూడా భాగ్యలక్ష్మిని ప్రశ్నిస్తుంది. దాంతో రామ్‌పై భాగ్య ఒత్తిడి పెంచుతుంది. కానీ పిల్లలకు చదువు చెప్పే విధానం ఇది కాదని, యావరేజ్ స్టూడెంట్లతో మంచి ఫలితాలు సాధించి చూపిస్తానని వ్యాస్ ప్రత్యేకంగా ఓ స్కూల్ ఏర్పాటు చేస్తాడు. ఆ తరవాత ఏమైంది? వ్యాస్ స్కూల్లో చదువుకొన్న విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధించారా, లేదా? ఈలోగా వ్యాస్ జీవితంలో జరిగిన కీలకమైన పరిణామమేంటి? అనేది మిగిలిన కథ.
‘అనగనగ’ టీజర్, ట్రైలర్ చూస్తే, ఈ సినిమా కథేమిటో అర్థమైపోతుంది. ఓరకంగా విద్యావ్యవస్థని నిలదీసే సినిమా ఇది. కార్పొరేట్ స్కూళ్లు, వాటి పరుగులు, విద్యార్థులు మార్కులు తెచ్చుకొనే యంత్రాల్లా చూడడం.. వీటిపై చర్చించిన సినిమా ఇది. ఇది వరకే ‘తారే జమీన్పర్’, ‘త్రీ ఈడియట్స్’ లాంటి సినిమాల్లో వీటి గురించి వివరంగా మాట్లాడారు. మన తెలుగులో వచ్చిన ’35 – చిన్న కథ కాదు’ కూడా ఈ కోవకు చెందిన సినిమానే. కొత్త కథేం కాకపోయినా ఓ మంచి విషయాన్ని చెప్పడానికి చేసిన ప్రయత్నాన్ని అభినందించాలి.
సినిమాని చాలా నిదానంగా ప్రారంభించాడు దర్శకుడు. ఓ పిల్లాడు స్కూల్ అంటే భయపడిపోవడం, అతన్ని తల్లిదండ్రులు ఓ డాక్టర్ దగ్గరకు తీసుకు రావడం, ఆ డాక్టర్… ఆ పిల్లాడికి వ్యాస్ కథ చెప్పడం – ఇలా రొటీన్ టెంప్లెట్ లో ఈ కథని మొదలెట్టారు. ఇలాంటి స్క్రీన్ ప్లే ప్రేక్షకులు చూసీ చూసీ బోర్ ఫీలవుతున్నారు. ఈ తరహా కథల్ని స్ట్రయిట్ నేరేషన్ లో చెప్పినా బాగానే ఉంటుంది. కార్పొరేట్ స్కూల్స్ పద్ధతి మనకు బాగా అర్థమైపోయింది. దాంతో వాళ్ల వ్యవహారాలు, ఆరాటాలు కూడా కొత్తగా అనిపించవు. ‘అన్ని స్కూల్స్‌లోనూ ఇవి మామూలే కదా’ అనిపిస్తుంది. వ్యాస్ పాత్ర ఇంజెక్ట్ అవ్వడానికి కాస్త టైమ్ పడుతుంది. ఆ తరవాత ఆ పాత్రతో ప్రయాణం చేస్తాం.
ఈ కథని రెండు భాగాలుగా చూడాలి. తొలి భాగంలోనే దర్శకుడు చెప్పాలనుకొన్నది చెప్పేశాడు. ఇంట్రవెల్ బ్యాంగ్ కి వ్యాస్ లక్ష్యం పూర్తయిపోతుంది. మిగిలిన సగం సినిమాలో దర్శకుడు ఏం చూపించాలనుకొంటున్నాడు? అనే ప్రశ్న ఎదురవుతుంది. అక్కడ ఈ కథని వ్యాస్ వ్యక్తిగత జీవితం, తనకొచ్చిన సమస్య పై టర్న్ చేశాడు. దాంతో కథాగమనం మారిపోతుంది. అక్కడ్నుంచి ఎమోషన్ డ్రామా మొదలవుతుంది. ఇలాంటి మెలోడ్రామా సన్నివేశాలు చాలా సినిమాల్లో చూసి ఉండడం వల్ల పెద్దగా ఇంపాక్ట్ ఇవ్వదు. కానీ క్రమక్రమంగా వ్యాస్ పాత్రని ప్రేమించడం మొదలెడతాడు ప్రేక్షకుడు. దాంతో క్లైమాక్స్ హార్ట్ టచింగ్ గా సాగుతుంది. ఆడిటోరియంలో రామ్ చెప్పిన కథ… దానికి సమాంతరంగా వ్యాస్ ప్రయాణం.. ఇవన్నీ కదిలిస్తాయి. రామ్ తో వ్యాస్ చేసే ప్రయాణం, రామ్ లోపాల్ని సరిదిద్దే విధానం ఇవన్నీ ఎమోషనల్‌గా సాగుతాయి. అక్కడక్కడ కళ్లు చమరుస్తాయి.
సుమంత్ కి సరిగ్గా సరిపోయిన పాత్ర వ్యాస్. తొలి సన్నివేశాల్లో సుమంత్ నటన కాస్త కృత్రిమంగా కనిపిస్తుంటుంది. క్రమక్రమంగా ఆ పాత్రని ఫాలో అవుతాం. ఎమోషనల్ సీన్స్ లో తన నటన బాగుంది. కాజల్ చౌదరి కి ఇదే తొలి సినిమా. తన నటనను డబ్బింగ్ డామినేట్ చేసింది. మాస్టర్ విహార్ష్ బాగా చేశాడు. ముఖ్యంగా పతాక సన్నివేశాల్లో తన నటన మరింత రక్తికట్టింది. సాంకేతికంగా చూస్తే పాటలు అర్థవంతంగా సాగాయి. కథని సాహిత్యం ఫాలో అయ్యింది. సెకండాఫ్ ఒకే ఎమోషన్ చుట్టూ తిరగడం వల్ల కథ సాగదీసినట్టు అనిపిస్తుంది. మాటల్లో మెరుపులేం కనిపించలేదు. ఈటీవీ అనగానే సంస్కారవంతమైన సినిమాలే గుర్తొస్తాయి. అదే కోవలో ‘అనగనగ’ చేరుతుంది. ఇది ఓటీటీ సినిమా కాబట్టి, క్వాలిటీ విషయంలో రాజీ పడ్డారనిపిస్తుంది. సమాజానికి అవసరమైన కథ ఇది. ఓటీటీలోనే ఉంది కాబట్టి వీలున్నప్పుడు ఓ లుక్ వేయొచ్చు.