Anaganaga Oka Raju Movie Telugu Review
Telugu360 Rating: 3/5
సంక్రాంతికి వున్న భారీ పోటీ నడుమ తమది కూడా సిసలైన సంక్రాంతి సినిమానే అంటూ ‘అనగనగా ఒక రాజు’తో వచ్చాడు నవీన్ పొలిశెట్టి. తన సక్సెస్ ట్రాక్ బావుంది. ప్రచారాన్ని కూడా స్వయంగా ముందుండి నడిపించాడు. ట్రైలర్ లో వినోదం, పండుగ ఫీల్ కనిపించింది. మరి సినిమా ప్రేక్షకులను మెప్పించిందా? సంక్రాంతి సినిమా విందులో ఇది ఎంత స్పెషల్గా నిలిచింది?
గౌరవపురం జమీందారు గోపరాజు మనవడు రాజు(నవీన్ పొలిశెట్టి). పేరుకే జమీందారు. గోపరాజు రసికుడు, కళాపోషకుడు కావడంతో ఆస్తిపాస్తులన్నీ మహిళా అభివృద్ధికి రాసిచ్చేస్తాడు. తాత మిగిల్చిన జమీందారు ట్యాగ్ ని మోస్తూ ఇంట్లో పని వాళ్ళకి సరిగ్గా జీతం కూడా ఇవ్వలేని పరిస్థితి రాజుది. చాలా కష్టంగా జమీందారి దర్పాన్ని కవర్ చేస్తూ కాలం గడుపుతున్న రాజుకి ఓ పెళ్లిలో అవమానం జరుగుతుంది. ఆ పెళ్లి కంటే ఘనంగా పెళ్లి చేసుకుంటానని సవాల్ విరిసిన రాజు.. ఓ వేడుకలో చారులత( మీనాక్షి చౌదరి)ని చూస్తాడు. తను పక్కూరి జమీందారు రావు రమేష్ ఏకైక కూతురు. చారులతని పెళ్లి చేసుకుంటే తన కష్టాలన్ని తొలగిపోతాయని, చారు ఆస్తి మొత్తం తనకే సొంతమౌతుందని భావిస్తాడు రాజు. అయితే అప్పటికే చారుని ఆ గ్రామ ప్రెసిడెంట్ ఎర్రబాబు(తారక్ పొన్నప్ప) వివాహం చేసుకోవాలని ప్రయత్నిస్తుంటాడు. చారు మనసులో చోటు దక్కించుకోవాలని ‘ఆపరేషన్ చారులత’ని మొదలుపెతాడు రాజు. ఈ ఆపరేషన్ సక్సెస్ అయ్యిందా? చారు రాజును వరించిందా? చారు ఆస్తి రాజు సొంతమైయిందా? ఇదంతా తెరపై చూడాలి.
నిజమైన సంతోషం డబ్బులో కాదు, తనని నమ్ముకున్న ప్రజల ఆనందంలో వుందని తెలుసుకున్న ఒక రాజు కథ ఇది. ఇలా చెప్తే కాస్త హెవీగా అనిపిస్తుంది కానీ.. ఈ కథకు ఆధారం చందమామ, బాలమిత్రలో కనిపించే ఓ నీతికథ లాంటిదే. ఈ కథకి టైటిల్ ‘అనగనగా ఒక రాజు’ పర్ఫెక్ట్ యాప్ట్. ఇలాంటి కథని కమర్షియల్ సినిమా ఫార్మెట్ లో అన్ని హంగులు మేళవించి ఒక వినోదాత్మక చిత్రంగా అందించడంలో దర్శకుడు మారి పైచేయి సాధించాడు.
క్రీజ్ లోకి వచ్చిన బ్యాట్స్ మ్యాన్ కుదురుకోవడానికి కాస్త సమయం తీసుకునట్లు.. ఈ సినిమాలో వినోదం ప్రేక్షకులని అందుకోవడానికి దాదాపు ఒక ఇరవై నిముషాల సమయం తీసుకుంటుంది. తొలి ఇరవై నిమిషాల్లో వచ్చే సన్నివేశాలు ఏమంత అలరించేలా సాగవు. మామలు డైలాగులు, ఒక రొటీన్ ఫన్ లా అనిపిస్తుంది. అయితే పిచ్ పై పట్టుసాధించిన బ్యాట్స్ మ్యాన్ తర్వాత ప్రతిబంతిని మంచి టైమింగ్ తో బాదేసినట్లు రాజు పాత్ర కూడా ఆడియన్స్ కనెక్ట్ అయిపోతుంది.
రాజు పగటి కలతో కథ మొదలుపెట్టిన దర్శకుడు.. రాజు పాత్రని, తన చుట్టూ వున్న పరిస్థితులని పరిచయం చేయడానికి కాస్త ఎక్కువ సమయం తీసుకున్నాడు. రాజుకి పెళ్లిలో అవమానం జరిగే సన్నివేశం కథలో ఒక మలుపు తీసుకొస్తుంది. ఆ తర్వాత వరుస పెళ్లి చూపులతో కొన్ని నవ్వులు పండుతాయి. ఎప్పుడైతే రాజు గుడిలో చారుతలని చూస్తాడో అక్కడి నుంచి ఫన్ డబుల్ అవుతుంది. గుడిలో పాడిన పేరడీ పాటకి థియేటర్లో నవ్వులు పూస్తాయి.
ఆపరేషన్ చారులత పేరు చేసిన రెండు స్టేజులు భలే నవ్వులు పంచాయి. ‘డాగ్’ ఎపిసోడ్ హిలేరియస్ గా వచ్చింది. నాన్ స్టాప్ గా పది నిమిషాల పాటు నవ్వులు వుంటాయి. ఆ తర్వాత ‘గోవా బ్రాంచ్ పెదపాలెం’ ఎపిసోడ్ ఆ నవ్వులని రెట్టింపు చేసింది. ఆ ఎపిసోడ్ మొత్తం భలే వర్క్ అవుట్ అయ్యింది. ఫస్ట్ హాఫ్ లోని కాలేజ్ లో రౌడీల ఫైట్ ఆలోచన చాలా బావుంది.’ రౌడీలు చీప్ గా అమ్మాయిల వెంటపడి రౌడీ అనే బ్యాడ్ నేమ్ కి బ్యాడ్ నేమ్ తీసుకురావద్దు’ అని రాజు చెప్పే డైలాగులు వింటే.. త్రివిక్రమ్ మార్క్ గుర్తొస్తుంది. మంచి ఇంపాక్ట్ వున్న సీన్ అది. అమ్మాయిల వెంటపడే రౌడీలకి ఇదొక కనువిప్పు. ఇంటర్వెల్ వచ్చే ట్విస్ట్ భలే గమ్మత్తుగా వుంటుంది. నిజంగా రాజు పాత్రకి అది షాకే.
సెకండ్ హాఫ్ లో ఈ కథ విలేజ్ పాలిటిక్స్ టర్న్ తీసుకుంటుంది. ఈ ట్రాక్ గురించి ట్రైలర్ లో ఏ మాత్రం హింట్ ఇవ్వకపోవడంతో ఒక్కసారి కథ వేరే జానర్ లోకి మారిపోయిన ఫీలింగ్ కలుగుతుంది. కాకపోతే ఇదొక ‘రాజు’ కథ. రాజు అంటేనే రాజకీయం, ప్రజలు. ఈ సినిమా అసలు కథ ఇదే. ఈ కథలోకి వెళ్ళడానికి ప్రేక్షకుడికి కాస్త సమయం పడుతుంది. ఎప్పుడైతే రాజు పాదయాత్రకి దిగాడో అక్కడి నుంచి మళ్ళీ నవ్వులు అందుకుంటాయి. ఎన్నికల ప్రచారం, దీపం గుర్తు బ్యాక్ డ్రాప్ లో వచ్చే సీన్, వైరల్ సాంగ్ ఇవన్నీ సరదాగా సాగిపోతాయి. ఈ కథకు ఒక ఎమోషన క్లైమాక్స్ రాసుకున్నారు. అది సరిగ్గా పని చేసింది. ఎక్కువ డ్రామా కాకుండా క్లైమాక్స్ బ్లాక్ ని డిజైన్ చేసిన తీరు బాగా కుదిరింది.
ఇది నవీన్ పొలిశెట్టి వన్ మ్యాన్ షో. సినిమా అంతా కెమరా తనపైనే వుంటుంది. రాజు పాత్రకి ఒక సాలిడ్ ఎనర్జీ వుంటుంది. ఆ ఎనర్జీని సినిమా అంతా మోయడం అంటే మాటలు కాదు. తను చెప్పే డైలాగులు, ఇచ్చే రియాక్షన్స్, డ్యాన్సులు.. అన్నిట్లో వినోదం కుదిరింది. నిజంగా తనకి స్టార్ ఎంటర్ టైనర్ అనే ట్యాగ్ పర్ఫెక్ట్. చారులతగా మీనాక్షి పాత్ర కథలో కీలకమే. సెకండ్ హాఫ్ లో ఆ పాత్రని కథకు తగ్గట్టుగా ఉపయోగించిన తీరు బావుంది. రావు రమేష్ కి నటించే స్కోప్ లేదు కానీ ఇంటర్వెల్ లో ఆ పాత్రే కీలకం. చమ్మక్ చంద్ర, మహేశ్ కొన్ని చోట్ల నవ్విస్తారు. బుల్లిరాజు పాత్ర కూడా బాగా కుదిరింది. ఫారియా ఓ చిన్న అతిధి పాత్రలో మెరిసింది.
టెక్నికల్ గా సినిమాకి తిరుగులేదు. మిక్కీ జె.మేయర్ పాటలు, నేపథ్య సంగీతం సినిమాకి మరింత బలాన్ని ఇచ్చాయి. యువరాజ్ కెమెరా వర్క్ కథకు తగ్గట్టుగా కుదిరింది. డైలాగులు బాగా రాసుకున్నారు. ప్రొడక్షన్ కు చాలా కాలం పట్టిన సినిమా ఇది. అయితే ఆ ప్రభావం సినిమాపై కనిపించలేదు. నిర్మాణ విలువలకు వంకపెట్టలేం. టికెట్ కొని థియేటర్ లో అడుగుపెట్టిన ఆడియన్స్ కి కావాల్సిన వినోదం, ఆనందం పంచడంలో ఈ రాజు గారు.. రాజుగారే.
Telugu360 Rating: 3/5
