యుద్ధాల్లో వచ్చిపడే డ్రోన్లు, మిస్సైళ్లను గాల్లోనే పేల్చివేసేందుకు దేశాలు ఏర్పాటు చేసుకుంటున్న అత్యాధునిక రక్షణ వ్యవస్థల గురించి ఇటీవల బాగా ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు అమరావతిపై వ్యతిరేకత శక్తులు అదే తరహాలో కుట్రలకు పాల్పడుతున్నాయి. ఈ కుట్రలు కనీసం ఫలించకుండా నిర్వీర్యం చేయడానికి ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు కావాల్సి ఉంది. అమరావతి రాజధాని నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్న అక్కడ జరుగుతున్న వరుస అగ్నిప్రమాదాలు కేవలం యాదృచ్ఛికం కావని, దీని వెనుక లోతైన రాజకీయ కుట్ర దాగి ఉందనే అనుమానాలు బలపడుతున్నాయి. రాజధానిగా ప్రకటించినప్పటి నుండి అమరావతిపై జరుగుతున్న పరిణామాలు గమనిస్తే ఈ కుట్రలు ఇంతటితో ఆగవని కూడా అర్థం చేసుకోవచ్చు.
పైసలకు నిప్పులు ఓ టెస్టింగ్ ప్లాన్
రాజధాని ప్రాంతంలో జరిగిన పైపుల దహనం ఘటన అమరావతి వ్యతిరేక శక్తుల టెస్టింగ్ వ్యూహంలో భాగమని అనుకోవచ్చు. కోట్ల రూపాయల నిర్మాణ సామాగ్రి బూడిదవుతున్నా, క్షేత్రస్థాయిలో నిఘా లోపించడం విస్మయానికి గురిచేస్తోంది. గతంలో రాజధాని పనులను అడ్డుకోవడానికి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ మొదలుకొని కోర్టుల వరకు పిటిషన్ల వర్షం కురిపించిన శక్తులు, ఇప్పుడు భౌతిక దాడుల ద్వారా పనులను స్తంభింపజేయాలని చూస్తున్నట్లు కనిపిస్తోంది. ఇది కేవలం చిల్లర కుట్ర మాత్రమే కాదని, రాబోయే రోజుల్లో జరగబోయే పెద్ద విద్రోహ చర్యలకు ఇదొక సంకేతమని రాజకీయ వర్గాల్లో అనుమానాలు బలపడుతున్నాయి.
కుల ముద్ర నుంచి కుట్రల వరకు
అమరావతిని కేవలం ఒక సామాజిక వర్గానికి పరిమితం చేస్తూ కుల ముద్ర వేయడం ద్వారా ప్రజల్లో విభజన తెచ్చే ప్రయత్నం చాలా కాలంజరిగింది. రాజధానిని గ్రాఫిక్స్ అని, శ్మశానం అని ఈసడించుకున్న వారు.. ఇప్పుడు అమరావతి మళ్లీ పరుగులు పెడుతుంటే తట్టుకోలేకపోతున్నారు. ఒకవైపు ప్రభుత్వం కేంద్రం నుంచి నిధులు, చట్టబద్ధత తెచ్చుకుంటూ ముందుకెళ్తుంటే, మరోవైపు ఇక్కడ మౌలిక సదుపాయాలను దెబ్బతీయడం ద్వారా ఇన్వెస్టర్లలో అభద్రతా భావాన్ని నింపడమే ఈ కుట్రదారుల ప్రధాన అజెండాగా కనిపిస్తోంది.
అన్ని కోణాల్లోనూ అమరావతిపై దాడులు
వలం భౌతిక దాడులే కాకుండా, అమరావతికి వచ్చే నిధులను అడ్డుకోవడానికి ఢిల్లీ స్థాయిలో కూడా తెరవెనుక పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. గతంలో ప్రపంచ బ్యాంకు రుణాలను అడ్డుకోవడంలో విజయం సాధించిన శక్తులు, ఇప్పుడు కూడా అదే పంథాను అనుసరిస్తూ కేంద్రానికి తప్పుడు ఫిర్యాదులు పంపడం, పర్యావరణ అనుమతులపై మళ్లీ వివాదాలు సృష్టించడం వంటివి చేసే అవకాశం ఉంది. ప్రత్యర్థుల లక్ష్యం ఒక్కటే.. ఎలాగైనా సరే అమరావతి పనులు మందగించేలా చేసి, కూటమి ప్రభుత్వంపై ‘చేతకానితనం’ అనే ముద్ర వేయడం.
ప్రభుత్వానికి సవాలు
అమరావతి వ్యతిరేక మనస్తత్వం ఉన్న రాజకీయ నేతలు తమ స్వార్థం కోసం రాష్ట్ర భవిష్యత్తును పణంగా పెడుతున్నారు. ఈ కుట్రలను ఎదుర్కోవడంలో ప్రభుత్వం విఫలమైతే, అది అడ్డుకునే శక్తులకే పైచేయి అవుతుంది. అమరావతిని కేవలం ఒక నిర్మాణ ప్రాజెక్టుగా కాకుండా, రాష్ట్ర అస్తిత్వంగా భావించి ప్రభుత్వం అప్రమత్తమవ్వాలి. ప్రతి అగ్నిప్రమాదాన్ని క్షుణ్ణంగా విచారించి, దాని వెనుక ఉన్న సూత్రధారులను బహిరంగపరచాలి. క్షేత్రస్థాయిలో హైటెక్ నిఘా, డ్రోన్ పెట్రోలింగ్ , ఇంటెలిజెన్స్ నెట్వర్క్ను బలోపేతం చేయకపోతే, ఈ చిన్నపాటి నిప్పులు రేపు రాజధాని ఆశయాలనే దహించివేసే ప్రమాదం ఉంది.


