భారత రాష్ట్ర సమితిలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఓ వైపు సీఎం రేవంత్ రెడ్డి ప్రణాళికబద్దంగా చేస్తున్న పొలిటికల్ ఎటాక్‌లకు సమాధానం వెదుక్కోలేకపోతున్నారు. అదే సమయంలో కవిత మరో వైపు ఎటాక్ చేస్తున్నారు. పార్టీ ఉంటే ఎంత..పోతే ఎంత అని అసువుగా అనేస్తున్నారు. రెండు వైపుల నుంచి జరుగుతున్న దాడులను ఎలా ఎదుర్కోవాలో బీఆర్ఎస్కు అర్థం కావడం లేదు. వీలైనంత మేర సైలెన్స్ పాటిస్తున్నారు. కాలమే అన్నింటికీ సమాధానం చెబుతుందన్నట్లుగా వ్యవహరిస్తున్నారు.
కవిత సమస్యకు పరిష్కారం ఏమిటి ?
పార్టీలో తనకు ప్రాధాన్యం దక్కడం లేదని.. పక్కన పెట్టేశారని ఎమ్మెల్సీ కవిత సొంత రాజకీయ బాట ఎంచుకున్నారు. పార్టీకి రాజీనామా చేయడం లాంటిది చేయలేదు కానీ తనకు ఎలాంటి పాత్ర లేకపోవడంతో తెలంగాణ జాగృతిని బలోపేతం చేసుకుంటున్నారు. రాజకీయంగా ఎదగడానికి అవసరమైన ప్రయత్నాలు చేసుకుంటున్నారు. అయితే తరచూ ఆమె బీఆర్ఎస్ ముఖ్యనేతల్ని టార్గెట్ చేస్తున్నారు. నిన్నామొన్నటిదాకా పరోక్షంగా కేటీఆర్ ను టార్గెట్ చేశారు. ఇప్పుడు హరీష్, సంతోష్ రావులపై ఆరోపణలు చేశారు. ఇలా చేసినప్పుడల్లా ఇదిగో కవితపై సస్పెన్షన్ వేటు అని లీకులు ఇస్తున్నారు…కానీ చర్యలు మాత్రం తీసుకోవడం లేదు.
హరీష్ , సంతోష్ రావులపై వ్యూహత్మక దాడి ?
సంతోష్ రావుపై గతంలో చాలా ఆరోపణలు వచ్చాయి. ఆ సమయంలో ఆయనకు కొన్నాళ్ల పాటు ప్రగతి భవన్ లోకి ఎంట్రీ దొరకలేదని చెబుతారు. తర్వాత మళ్లీ ఆయనదే రాజ్యం. తన పక్కనే ఉంటారన్న కారణంతో కేసీఆర్ ఆయనకు రాజ్యసభ చాన్స్ కూడా ఇచ్చారు. అయితే కేసీఆర్ కుమార్తెను అయిన తనకు కూడా దక్కనంత ప్రాధాన్యం వారికి దక్కడం, పార్టీలో తనను పక్కన పెట్టడంతో.. కవిత వారిపై వ్యూహాత్మక దాడి చేస్తున్నారని బీఆర్ఎస్ వర్గాలు అనుమానిస్తున్నాయి. అయితే కవిత ఇలా ఆరోపణలు చేయడం వెనుక లోతైన రాజకీయం ఉంటుందని.. ఇదంతా ఓ పద్దతి ప్రకారం జరుగుతోదంన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.
బీఆర్ఎస్ ఏ సమస్యతో పోరాడాలనుకుంటోంది ?
బీఆర్ఎస్ ఇప్పుడు అంతర్గత సమస్యలతో పాటు సీబీఐ కేసులను కూడా ఎదుర్కోవాల్సి ఉంది. సీబీఐ విచారణ ప్రారంభిస్తే బీఆర్ఎస్ నేతలు , అధికారులు చాలా సమస్యలు ఎదుర్కొంటారు. అదే సమయంలో పార్టీలో ఇలాంటి పరిస్థితులు ఉండటంతో దానిపైనా దృష్టి పెట్టాల్సి వస్తుది. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి అంతర్గత సమస్యలను పరిష్కరించుకోవడం అత్యవసరం. అది ఎలా అనేది వారే డిసైడర్ చేసుకోవాలి. లేకపోతే.. అన్ని సమస్యలూ మీదపడిపోతాయి. అన్ని సార్లూ మౌనం విజయం సూత్రం కాదు. మరి కేసీఆర్ ఏం చేయబోతున్నారు?