కాంగ్రెస్ ను ఎవరూ ఓడించాల్సిన పని లేదు. కాంగ్రెస్ను కాంగ్రెస్సే ఓడించుకుటుంది అని గతంలో ఓ ప్రచారం ఉంది. తెలుగు రాష్ట్రాల్లో అది నిజమవుతూ ఉంటుంది. ఇప్పుడు దేశమంతటా అదే జరుగుతోంది. ఐదు రాష్ట్రాల ఎన్నికలు ముంచుకొస్తున్న సమయంలో .. కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు గోతులు తవ్వడం ప్రారంభించారు.
మణిశంకర్ అయ్యర్ సెల్ఫ్ గోల్
కాంగ్రెస్ సీనియర్ నేత మణిశంకర్ అయ్యర్ మరోసారి తన వివాదాస్పద వ్యాఖ్యలతో కాంగ్రెస్ పార్టీని ఇరకాటంలో పెట్టారు. కేరళ అసెంబ్లీ ఎన్నికల వేళ, అధికార ఎల్డీఎఫ్ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వస్తుందని, ముఖ్యమంత్రి పినరయి విజయన్ బాధ్యతాయుతమైన నాయకుడు ఆయన కొనియాడారు. సొంత కూటమి గెలుపు కోసం పోరాడుతున్న తరుణంలో అయ్యర్ చేసిన ఈ వ్యాఖ్యలు కాంగ్రెస్ కు ఇబ్బందికరంగా మారాయి. కేరళలో స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ మంచి విజయాలు సాధించి ప్రభుత్వం ఏర్పాటు చేస్తామన్న ధీమాతో ఉంది. ఈ సమయంలో కాంగ్రెస్ కే చెందిన అయ్యర్ నిప్పులు పోసే ప్రయత్నం చేశాడు.
అస్సాంలో భూపేన్ బోరా రాజీనామా డ్రామా
అస్సాం కాంగ్రెస్ అధ్యక్షుడు భూపేన్ బోరా సోమవారం ఉదయం హఠాత్తుగా పార్టీకి రాజీనామా చేస్తూ ఆత్మగౌరవం దెబ్బతిందని ప్రకటిచేశారు. రాహుల్ గాంధీ , ఇతర కేంద్ర నాయకత్వం జోక్యం చేసుకుని చర్చలు జరపడంతో కొన్ని గంటల్లోనే ఆయన తన రాజీనామాను వెనక్కి తీసుకున్నారు. ఇలా పార్టీలో ఒకదాని వెనుక ఒకటి సంక్షోభాలు ఎదురవుతున్నా, వాటిని అదుపు చేసే కెప్టెన్ ఎవరనేది ఇప్పుడు ప్రధాన ప్రశ్నగా మారింది. పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ డ్యామేజ్ కంట్రోల్ చర్యలు చేపడుతున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో ఉన్న అసంతృప్తిని చల్లార్చలేకపోతున్నారు. అస్సాంలో గౌరవ్ గొగోయ్, రాకిబుల్ హుస్సేన్ వంటి నేతల మధ్య ఆధిపత్య పోరు, కేరళలో సీనియర్ల మధ్య సమన్వయ లోపం పార్టీ నావను ముంచేలా ఉన్నాయన్న ఆందోళన వ్యక్తమవుతోంది.
ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో తేడా వస్తే గండమే
మరో మూడు నాలుగు నెలల్లో జరగనున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నాటికి కాంగ్రెస్ తన అంతర్గత కలహాలను పరిష్కరించుకోకపోతే పరిస్థితులు మరింత దిగజారే ప్రమాదం ఉంది. అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ ఇప్పటికే కాంగ్రెస్ భవిష్యత్తు అంధకారమని, మరిన్ని రాజీనామాలు వస్తాయని జోస్యం చెబుతున్నారు. కేవలం ఎన్నికల వ్యూహాల మీద కాకుండా, నాయకత్వ బాధ్యతలు , క్రమశిక్షణపై దృష్టి సారించకపోతే పార్టీ తన ఉనికిని కోల్పోయే ప్రమాదం ఉందని స్పష్టమవుతోంది. రాహుల్ గాంధీకి ఇలాంటి రాజకీయాలు చేయడం చేతకాదు. ట్రబుల్ షూటర్లు ఎవరూ ఆయన టీంలో ఉండరు. అందుకే కాంగ్రెస్ పార్టీ పరిస్థితి గెలిచే రాష్ట్రాల్లోనూ ఓడిపోవడం అన్నట్లుగా మారిపోతోంది.
