ఐదు రాష్ట్రాల ఎన్నికలకు నోటిఫికేషన్ వచ్చేసింది. ఈ ఐదురాష్ట్రాల ఎన్నికల్లో అస్సాంలో మాత్రమే కాంగ్రెస్, బీజేపీ ముఖాముఖి పోటీ పడుతున్నాయి. బెంగాల్ లో బీజేపీ టీఎంసీ, కేరళలో కాంగ్రెస్ , లెఫ్ట్ కూటములు.. తమిళనాడులో త్రిముఖ పోటీ ఉంది. కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించడంతో పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, అస్సాం , పుదుచ్చేరిలలో రాజకీయ సందడి పతాక స్థాయికి చేరింది. ఈ ఎన్నికలు కేవలం స్థానిక ప్రభుత్వాల మార్పుకే పరిమితం కాకుండా, కేంద్ర రాజకీయాల్లోనూ మార్పులు తీసుకురానున్నాయి.
ప్రాంతీయ పార్టీల ఆధిపత్యం చూపించే ఎన్నికలు
ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ఆధిపత్యం ఉన్న రాష్ట్రాల్లో జాతీయ పార్టీలు ఏ మేరకు పాగా వేస్తాయన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.పశ్చిమ బెంగాల్ పోరు మళ్ళీ దీదీ వర్సెస్ మోదీ గా మారింది. మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ తన పదేళ్ల సంక్షేమ పథకాలు ,బెంగాలీ అస్మితను నమ్ముకోగా, బీజేపీ అవినీతి , ప్రజల అసంతృప్తిని ప్రధాన అస్త్రాలుగా చేసుకుని బరిలోకి దిగుతోంది. గత ఎన్నికల కంటే ఈసారి బీజేపీ మరింత వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుండటంతో, బెంగాల్ గడ్డపై హోరాహోరీ పోరు తప్పేలా లేదు. ఇక్కడ చిన్నపాటి ఓట్ల చీలిక కూడా ఫలితాలను తలకిందులు చేసే అవకాశం ఉంది.
తమిళనాడు, పుదుచ్చేరిలో జాతీయ పార్టీలు నామమాత్రం
దక్షిణాది రాష్ట్రమైన తమిళనాడులో రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి. అధికార డీఎంకే కూటమి పటిష్టంగా ఉన్నట్లు కనిపిస్తున్నప్పటికీ, సూపర్ స్టార్ విజయ్ రాజకీయ ప్రవేశం తమిళగ వెట్రి కజగం రూపంలో కొత్త సవాలును విసిరింది. అన్నాడీఎంకే తన ఉనికిని కాపాడుకునే ప్రయత్నంలో ఉండగా, విజయ్ రాకతో ఇక్కడ ముక్కోణపు పోటీ నెలకొంది. విజయ్ వైపు మళ్లుతున్న యువత ఓట్లు ఎవరి గెలుపును అడ్డుకుంటాయో అన్నది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న. పుదుచ్చేరిలో కూడా ఇదే విధమైన కూటముల పోరు సాగుతోంది. డీఎంకే కూటమిలో కాంగ్రెస్, అన్నాడీఎంకే కూటమిలో బీజేపీ ఉన్నాయి.
చరిత్ర తిరగరాసే పట్టుదలలో ఎల్.డి.ఎఫ్
సాధారణంగా కేరళలో ఐదేళ్లకోసారి ప్రభుత్వం మారుతుంటుంది, కానీ గత ఎన్నికల్లో పినరయి విజయన్ ఆ సంప్రదాయాన్ని చెరిపివేశారు. ఎల్.డి.ఎఫ్ వరుసగా మూడోసారి అధికారంలోకి వచ్చి హ్యాట్రిక్ సాధించాలని చూస్తోంది. మరోవైపు కాంగ్రెస్ నేతృత్వంలోని యుడిఎఫ్ ఈసారి ఎలాగైనా అధికారం దక్కించుకోవాలని పట్టుదలతో ఉంది. బిజెపి ఇక్కడ బలమైన మూడో శక్తిగా ఎదగడానికి ప్రయత్నిస్తోంది. త్రిముఖ పోటీ జరిగే కొన్ని నియోజకవర్గాల్లో బిజెపి ఓట్లు ఎవరిని ముంచుతాయో అన్నది కీలకం.
అస్సాం లో బీజేపీ హ్యాట్రిక్ కొడుతుందా?
అస్సాంలో ప్రధాన పోటీ బిజెపి , కాంగ్రెస్ మధ్యే ఉంది. ముఖ్యమంత్రి హిమంత బిస్వ శర్మ సారథ్యంలో బిజెపి ధీమాగా ఉంది. మహాజోత్ కూటమి విచ్ఛిన్నం కావడం బిజెపికి కలిసి వచ్చే అంశం. కాంగ్రెస్ నాయకుడు గౌరవ్ గొగోయ్ తన వ్యక్తిగత చరిష్మాతో బిజెపికి గట్టి పోటీ ఇస్తున్నారు. అయితే, అభివృద్ధి మంత్రం , హిందూత్వ కార్డుతో బిజెపి పైచేయి సాధించే అవకాశాలు ఉన్నాయని ప్రాథమిక అంచనాలు చెబుతున్నాయి.
ప్రతి రాష్ట్రంలోనూ స్థానిక సమస్యలతో పాటు జాతీయ అంశాలు కూడా ఓటర్లపై ప్రభావం చూపుతున్నాయి. ఈ ఎన్నికల ఫలితాలు అటు అధికార పక్షానికి, ఇటు విపక్ష కూటమికి అత్యంత ప్రతిష్టాత్మకం కానున్నాయి. ఈ ఐదు రాష్ట్రాల తీర్పు భారత రాజకీయ ముఖచిత్రాన్ని మార్చే అవకాశం ఉంది. పశ్చిమ బెంగాల్, తమిళనాడులలో ప్రాంతీయ పార్టీల పట్టు నిలుస్తుందా? లేదా జాతీయ పార్టీలు తమ ప్రభావం చూపిస్తాయా? అన్నది మే నెలలో తేలనుంది.
