ఎడిటర్స్ కామెంట్ : పాతది పనికి రాదు – కొత్తది కొరగాదు..!

ఏదైనా మంచి జరిగితే మాది లేకపోతే గత ప్రభుత్వాలది..!. ఇది దేశాన్ని పాలించే బాధ‌్యతను నెత్తికెత్తికున్న వాళ్లు చెబుతున్న కుంటి సాకులు. పెట్రోల్ ధర దగ్గర్నుంచి ప్రతీ విషయంలోనూ అప్పటి ప్రభుత్వాలు చేసిన తప్పులేనని.. చెప్పి ప్రజలను మోసం చేయడానికి ప్రయత్నించడమే తప్ప… తమకు ప్రజలు అధికారం ఇచ్చారని.. ఆ తప్పులు దిద్ది తాము చేయాలనుకున్న మేలు చేయాలని ఎందుకు అనుకోవడం లేదో ఎవరికీ తెలియదు. అది కేంద్ర ప్రభుత్వమైనా.. రాష్ట్ర ప్రభుత్వాలైనా తమ చేతకాని తనాన్ని గత పాలకులపై నెట్టేసి.. తాము మాత్రం రాజకీయం చేస్తున్నారు. ప్రజల్ని ఎన్ని ఇబ్బందులు పెట్టాలో అన్నీ ఇబ్బందులు పెడుతున్నారు.

“సూపర్ మేన్ మోడీ” కూడా ఇప్పటికీ గత ప్రభుత్వాలనే చూపిస్తున్నారు..!

మోడీ అంటే ఎవరు..? సూపర్ మేన్. ఆయన ప్రధాని అవడం ఆవలస్యం అమెరికా డాలర్ కూడా.. రూపాయి కన్నా దిగువకు వచ్చేస్తుందని ప్రచారం చేశారు. ఇప్పటికే ఏడేళ్లయింది. అమెరికా డాలర్ సంగతేమో కానీ.. భారత రూపాయి ప్రజలకు అపురూపం అయిపోతోంది. ప్రజల జీవన ప్రమాణాలు అత్యంత దారుణ స్థితిలో పడిపోయాయి. రూ. 30రూపాయల పెట్రోల్‌పై రూ.70 పన్నలు బాదేసి ప్రజల్ని నిలువు దోపిడీ చేస్తున్నారు. ఈ దోపిడితో అన్ని నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతున్నాయి. పాల ధర ఏకంగా రూ. పన్నెండు పెంచుతామని ఇప్పటికే పాలఉత్పత్తి దారులు చెప్పడం ప్రారంభించారు. వంటింట్లో ధరల మంట దెబ్బకు మధ్యతరగతి జనం మాడిపోతున్నారు. లాక్ డౌన్ ఎత్తేసిన ఆరు నెలల వ్యవధిలో ధరలన్నీ రెట్టింపు అయ్యాయంటే పరిస్థితి ఎంతదారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఓ వైపు అడ్డగోలుగా టాక్సులు పెంచి దోచుకుంటున్న విషయం కళ్ల ముందు కనిపిస్తూంటే… గత ప్రభుత్వాల పాపమేనని మోడీ నిస్సంకోచంగా నిందిస్తున్నారు. ఒక వేళ వారిదితప్పే అయితే ఏడేళ్ల కాలం సరిపోలేదా దిద్దడానికి. అంతర్జాతీయ మార్కెట్లోక్రూడాయిల్ ధరలు అత్యంత కనిష్టానికి వెళ్లినప్పుడు కూడా రేట్లు తగ్గించకుండా ప్రజల్ని బాదేసిన సర్కార్… గత ప్రభుత్వాలదే పాపమని చెప్పి తప్పించుకుంటే సరిపోతుందా..? ప్రజల బాధల్ని పట్టించుకునేదెప్పుడు..?

ఏడేళ్ల తర్వాత గత పాలకులపై నెపం వేస్తే ప్రజల్లో చులకన అవ్వరా..!?

కేంద్ర ప్రభుత్వం తిరుగులేని మెజార్టీతో ఉంది. నేరుగా ప్రజా జీవితాన్ని ప్రభావితం చేయని అనేక అంశాలకు ఈ ఏడేళ్ల కాలంలో పరిష్కారం చూపారు. అయోధ్య రామ మందిరాన్ని కడుతున్నారు. కశ్మీర్‌లో ఆర్టికల్360ని డిమోలిష్ చేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే.. చాలా సమస్యల్ని పరిష్కరించారు. కానీ అవన్నీ.. భావోద్వేగాల పరంగా చెప్పుకోవడానికే పనికి వస్తాయి. భారత దేశ ప్రజల జీవన ప్రమాణాలు పెంచడానికి ఏ మాత్రం ఉపయోగపడవు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ప్రజల కోసం.. దేశం కోసం ఏం చేసిందనేది ప్రశ్న. వాజ్‌పేయి గట్టిగా ఐదేళ్లు కూడా ప్రధానమంత్రిగాలేరు. కానీ ఆయన హయాంలో దేశంలో మౌలిక సదుపాయాల పరంగా ఎంతో అభివృద్ధి సాధించింది. స్వర్ణ చతుర్భుజి కావొచ్చు… మరో రంగం కావొచ్చు… అద్భుతమైన ప్రగతిని చూసింది. అదే సమయంలో అణుపరీక్షలు జరిపి.. దేశభక్తికి సరైన అర్థం కూడా చెప్పింది. కానీ ఇప్పటి బీజేపీ ప్రభుత్వం ఏం చేస్తోంది. ఏడేళ్ల కాలంలో కేంద్రం చేపట్టిన ఏదైనా ఒక్క మౌలిక సదుపాయాల ప్రాజెక్టు పట్టాలెక్కిన దాన్ని వివరించగలరా..?.గుర్తు చేసుకున్నా సాధ్యం కాదు. గత ప్రభుత్వాలు చివరి వరకూ తీసుకొచ్చినవి.. ఓపెనింగ్ చేయడానికి మాత్రమే ఏడేళ్లు సమయం పట్టింది. ఈ ప్రభుత్వం దూరదృష్టితో చేసిన ఓ ప్రాజెక్టు అయినా కనీసం సగం వరకూ అయినా పూర్తయిందో లేదో చెప్పడం కష్టం. అయినా ఇప్పటికీ గత పాలకులపై నిందలేసి రాజకీయం చేయడంలో మాత్ం చాలా పెద్ద నోరుంది. ప్రజల్ని భావోద్వేగంలో ముంచి.. తమ రాజకీయం తాము చేసుకుంటున్నారు. కానీ దేశానికి మేలు మాత్రం చేయడం లేదు.

అమ్ముకుంటున్న ఆస్తులు కూడా గత పాలకులు సృష్టించినవేగా..!

ప్రధానమంత్రి నరేంద్రమోడీ.. చాలా నిర్మోహమాటంగా చెబుతున్నారు.. ప్రభుత్వాలు చేయాల్సింది వ్యాపారం కాదని. అందుకే.. ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ తెగ నమ్ముతున్నామని అలా జస్టిఫై చేసుకుంటున్నారు. ప్రభుత్వాలు వ్యాపారాలు చేస్తాయా లేదా అన్నదాని సంగతి తర్వాత. కానీ.. ప్రభుత్వ రంగ సంస్థలు ఉండటం వల్ల.. ప్రైవేటు రంగంలో పోటీ పెరుగుతుందనేది నిజం.ఇప్పటికే ప్రజలకు సముచితంగా అందాల్సినఅనేక సేవలు ఖరీదుగా మారిపోయాయి. ప్రైవేటు రంగం రాకపోతే.. ప్రజలకు నిత్యావసర వస్తువుగా మారిన టెలికాంలో మౌలిక సదుపాయాలు పెరిగినా ధరలు మాత్రం ఎంత భారంగా మారుతున్నాయో కళ్ల ముందు కనిపిస్తోంది. అదే ప్రభుత్వ రంగ సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్ పోటీగా ఉండి ఉంటే.. ఆ ప్రైవేటు సంస్థలన్నీ ప్రజల్ని దోచుకోవడంలో వెనుకడుగు వేసేవే. కానీ బీఎస్‌ఎన్‌ఎల్‌ను ఉద్దేశపూర్వకంగా నిర్వీర్యం చేశారు. అనేక రకాల కేంద్ర ప్రభుత్వ సంస్థలది అదే పరిస్థితి. వాటికి నష్టాలు ఉద్యోగుల వల్లే వస్తున్నాయని ప్రచారం చేసి.. ప్రభుత్వ ఉద్యోగులంటే పని చేయరనే భావన సృష్టించి… మొత్తానికి పబ్బం గడుపుకుంటున్నారు. ప్రభుత్వ సంస్థలన్నింటీకీ.. లక్షల కోట్ల ఆస్తులు ఉంటాయి. ప్రభుత్వ సంస్థలను కొనుగోలు చేసే… ప్రైవేటు కంపెనీ.. మెల్లగా ఉత్పత్తి నిలిపివేసి.. భూములమ్ముకుని లాభపడుతున్నాయి. హిందూస్థాన్ జింక్ విషయంలో అదే జరిగింది. స్టీల్ ప్లాంట్ విషయంలనూ అదే జరుగుతుంది. మరో కంపెనీ విషయంలోనూ అదే జరుగుతుంది. ఇవన్నీ పాలకులకు తెలియనివి కావు. కానీ.. ప్రభుత్వం మాత్రం రూ. రెండున్నర లక్షల కోట్లను సమీకరించడానికి అన్నింటినీ తెగ నమ్మేస్తామని మరో మాట లేకుండా చెబుతోంది. ఇవన్ని జాతి సంపద. గత ప్రభుత్వాలు సృష్టించిన సంపద. ప్రభుత్వాలు సంపదను సృష్టించాలే కానీ అమ్ముకోకూడదు.

కేంద్రమే కాదు.,. తెలుగు రాష్ట్రాల్లోనూ అదే పరిస్థితి..!

ఏదైనా మంచి చేసినట్లుగా అనిపిస్తే తమ ఘనత లేకపోతే గత ప్రభుత్వాల తప్పిదం. జీఎస్టీని తెచ్చింది.. తామే అన్నట్లుగా మోడీ సర్కార్ ప్రచారం చేసుకుంది. రివర్స్ అయ్యే సరికి కాంగ్రెస్సే తెచ్చిందన్నారు. ఇప్పుడు.. వ్యవసాయ చట్టాలు కూడా అంతే. కాంగ్రెస్ హయాంలోనే వ్యవసాయ చట్టాల డ్రాఫ్ట్ తయారయిందంటున్నారు. కేంద్రం స్టైల్లోనే తెలుగు రాష్ట్రాల్లోనూ రాజకీయాలు నడుస్తున్నాయి. తెలంగాణ సీఎం కేసీఆర్.. ఓ రకంగా ఇలాంటి రాజకీయాలకు బ్రాండ్ అంబాసిడర్. ఏం జరిగినా.. జరగకపోయినా… తెలంగాణ రాక ముందు పరిపాలించిన కాంగ్రెస్, టీడీపీల తప్పని చెబుతూ ఉంటారు. ఆయన అధికారంలోకి వచ్చే ఏడేళ్లయింది. బంగారు తెలంగాణ చేసేశామని చెబుతూ ఉంటారు. కానీ .. మొన్నటి నాగార్జున సాగర్ ఎన్నికల ప్రచారసభలో… కాంగ్రెస్‌, టీడీపీల పాపమేనని… అనేక సార్లు నిందించారు. అలా చెప్పకపోతే.. ప్రజలు నమ్మరని అనుకుంటారేమో కానీ.. వారి పాపాల సంగతి సరే.. ఏడేళ్ల కాలంలో మీరేం చేశారన్న ప్రశ్న వస్తుందనే సంకోచం కూడా విమర్శలు చేసే పాలకులకు ఉండటం లేదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమూ ఈ విషయంలో ఏం తక్కువ తినలేదు. గత ప్రభుత్వం చేసిన పనులన్నింటినీ నిలిపివేసి…గత ప్రభుత్వం చేసిన తప్పుల్ని సరి చేస్తున్నామనే విచిత్రమైన వాదన వినిపిస్తోంది. తప్పులేంటో మాత్రం ఎవరూ చెప్పలేరు. సంపద సృష్టించడం మానేసి… గత ప్రభుత్వం చేసిన పనుల్ని… తప్పుల పేరుతో.. అప్పుల మీద అప్పుల చేసుకుంటూ టైం పాస్ చేస్తున్నారు. ప్రజల్ని మభ్య పెడుతున్నారు.

కుల మతాల భావోద్వేగ రాజకీయం నడిచినంత కాలం దేశానికి ఇదేగతి..!

ప్రస్తుతం దేశంలో రాజకీయ పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది. రాజకీయం అంటే.. దేశానికి సేవ చేయడం. కానీ ఇప్పుడు అర్థం మారిపోయింది. రాజకీయం అంటే ప్రజల్ని కులమతాల పరంగా విభజించి మెజార్టీ ఓట్లు తెచ్చుకుని అధికారంసాధించడం…అది అందిన తర్వాత కూడా ఆ విభజన రాజకీయాల్ని మరింతగా ప్రోత్సహించి..అధికారాన్ని నిలుపుకోవడం. ప్రతిపక్ష పార్టీల్ని.. నేతల్ని కులాలు, మతాల ప్రకారం… విమర్శించి.. కొన్ని వర్గాలకే పరిమితమన్నట్లుగా ప్రచారం చేయడం. అవసరం అయితే.. దేశాన్ని ఉత్తర, దక్షిణాలుగా విడగొట్టి అయినా రాజకీయం చేయడం నేటి లక్షణం. ఇందులో ప్రజలకు చోటు లేదు. వారి భావోద్వేగాలతో ఆడుకోవడమే ఉంది. ఇది నడిచినంత కాలం దేశ రాజకీయ ఆరోగ్యం బాగుపడదు.

నడుస్తున్న ప్రభుత్వాలన్నీ ప్రజల కష్టాలను తీర్చాల్సింది పోయి.. మరింత పెంచుతున్నాయి. దానికి కారణాలను గత ప్రభుత్వాల మీద చెబుతున్నాయి. అందుకే… పాత ప్రభుత్వాలు పనికి రావు.. కొత్త ప్రభుత్వం కొరగాదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మంత్రి ఉత్తమ్ ఇలాకాలో విద్యార్ధినిలకు అస్వస్థత..రీజన్ అదేనా..?

ఉమ్మడి నల్గొండ జిల్లాలోని గురుకుల పాఠశాలలో విద్యార్థులు వరుసగా అస్వస్థతకు గురి అవుతుండటం కలకలం రేపుతోంది. యదాద్రి భువనగిరి జిల్లా గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కు గురై ఇటీవల ఓ విద్యార్ధి...

చిలుకూరుకు పోటెత్తిన భక్తులు…ఫుల్ ట్రాఫిక్ జామ్

కోరిన కోరికల్ని తీర్చే సుప్రసిద్ధ చిలుకూరు బాలాజీ బ్రహ్మోత్సవాలకు భక్తులు పోటెత్తారు. ఆలయ సిబ్బంది అంచనా వేసిన దానికంటే పది రేట్లు ఎక్కువగా రావడంతో క్యూలైన్లు అన్ని నిండిపోయాయి. ఆలయానికి...

అచ్చెన్నాయుడు అన్నీ అలా కలసి వస్తున్నాయంతే !

ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడుకు అన్నీ అలా కలసి వస్తున్నాయి. ఆయన ప్రత్యర్థి .. దువ్వాడ శ్రీనివాస్.. భార్య చేతిలోనే పదే పదే ఓడిపోతున్నారు. తాజాగా మరోసారి ఆయన భార్య రంగంలోకి దిగారు....

‘పారిజాత ప‌ర్వం’ రివ్యూ: సినిమా తీయ‌డం ఓ క‌ళ‌!

Parijatha Parvam movie review తెలుగు360 రేటింగ్: 1.5/5 'కిడ్నాప్ చేయ‌డం ఓ క‌ళ‌'... అనే కాన్సెప్ట్‌తో రూపొందించిన చిత్రం 'పారిజాత ప‌ర్వం'. దాన్ని బ‌ట్టి ఇదో కిడ్నాప్ క‌థ‌ అని ముందే అర్థం చేసుకోవొచ్చు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close