తమిళనాడు రాజకీయాలు ఒకప్పుడు కక్ష సాధింపులకు కేంద్రంగా ఉండేవి. కానీ ఇప్పుడు పరస్పర గౌరవానికి చిహ్నాలుగా మారుతున్నాయి. ఎన్నికల ప్రచారంలో స్టాలిన్ను విజయ్ ముసలోడు.. ఎప్పుడు పోతాడో తెలియదు అనలేదు.. అంకుల్ అని గౌరవ ప్రదంగా సంభోదిస్తూ..రాజకీయ విమర్శలు చేశారు. స్టాలిన్ కూడా . .. అంతే విజయ్ కు ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించారు. సుస్థిర ప్రభుతవం కోసం సహకరించారు. ఒకప్పుడు ఏపీలో కూడా ఇలాగే ఉండేది. కానీ జగన్ రెడ్డి అనే వింత రాజకీయ జీవి రాజకీయాల్లోకి వచ్చాక మొత్తం మారిపోయింది.
విజయ్ గౌరవప్రదమైన అంకుల్ సంబోధన
ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత విజయ్ .. స్టాలిన్ ఇంటికి వెళ్లి కలిశారు. ఆయనతో పాటు ఇతర సీనియర్ నేతలను కలిశారు. అప్పుడే రాజకీయాల్లోకి వచ్చి సీఎం అయిన యువ ముఖ్యమంత్రిగా ఆయన మంచి సంప్రదాయం పాటించారు. అదే సమయంలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలోనూ ఆయన అదే హుందాతనం పాటించారు. తనకంటే వయసులో, అనుభవంలో పెద్దవారైన ఎం.కె. స్టాలిన్ను ఎక్కడా వ్యక్తిగతంగా కించపరచకుండా, స్టాలిన్ అంకుల్ అని గౌరవంగా సంబోధిస్తూనే ప్రభుత్వ వైఫల్యాలపై రాజకీయ యుద్ధం చేశారు. వయసు అయిపోయింది.. ఎప్పుడు పోతాడో తెలియదు వంటి దిగజారుడు వ్యాఖ్యలకు తావివ్వకుండా, కేవలం విజన్, అడ్మినిస్ట్రేషన్ ప్రాతిపదికన విమర్శలు చేశారు. దీనివల్ల రాజకీయాల్లో ఒక హుందాతనం ఉట్టిపడింది.
ఏపీ రాజకీయాల్లో ఒక్క జగన్ వల్లే తేడా!
దురదృష్టవశాత్తూ, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఈ నాగరికత మచ్చుకైనా కనిపించడం లేదు. ముఖ్యంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాజకీయ అరంగేట్రం తర్వాత ఏపీ రాజకీయాల్లో ఒక వింత పోకడ మొదలైంది. రాజకీయం అంటే కేవలం అధికారమే కాకుండా, ప్రత్యర్థులను శారీరకంగా, మానసికగా క్రుంగదీయడమే లక్ష్యంగా మారింది. ప్రత్యర్థులను రాజకీయంగా ఎదుర్కోలేక, వారి కుటుంబ సభ్యులను, ముఖ్యంగా మహిళలను అసెంబ్లీ వేదికగా , సోషల్ మీడియా వేదికగా దూషించడం వంటి ఘోరాలు జగన్ హయాంలో మనం చూశాం. రాజకీయం అంటే శత్రుత్వం అన్నట్లుగా మార్చివేసిన ఘనత ఆయనదే.
వ్యక్తిగత ద్వేషం.. రాష్ట్రానికి శాపం
జగన్ రెడ్డికి రాజకీయ ప్రత్యర్థులు అంటే అభివృద్ధిలో పోటీపడే వారు కాదు, వారు అంతం కావాల్సిన శత్రువులనే భావన ఉంటుంది. విపక్ష నాయకుల చావులను కోరుకోవడం, వారిని జైళ్లకు పంపడమే లక్ష్యంగా ఐదేళ్లు పాలన సాగింది. ఓడిపోయిన తర్వాత కూడా అదే మనస్తత్వం కొనసాగుతుండటం రాష్ట్రానికి తీరని నష్టం కలిగిస్తోంది. అసెంబ్లీలో సబ్జెక్ట్ మీద మాట్లాడటం కంటే, వ్యక్తిగత దూషణలకు ప్రాధాన్యత ఇవ్వడం వల్ల ప్రజా సమస్యలు పక్కదారి పడుతున్నాయి. రాజకీయాల్లో వ్యక్తిగత కక్షలు ఉన్నంత కాలం రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకు వెళ్లడం కష్టమే.
నేర్చుకోవడం ఇంటా ఏటా ఉండదు!
రాజకీయ నాయకులు పగ, ప్రతీకారాలను పక్కన పెట్టి, ప్రజా ప్రయోజనాలే పరమావధిగా పని చేసినప్పుడే రాష్ట్రం బాగుపడుతుంది. జగన్ వంటి నేతలు తమ మనస్తత్వాన్ని మార్చుకోకపోతే, అది ఏపీ పౌర సమాజానికి ఒక శాపంగానే మిగిలిపోతుంది. కానీ నేర్చుకోవడం అనేది ఇంటా వంటా ఉండదని ఆయన ఎప్పటికప్పుడు నిరూపిస్తూనే ఉన్నారు.
