పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధం కేవలం ఇరాన్, ఇజ్రాయెల్ సరిహద్దులకే పరిమితం కాకుండా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పునాదులను కదిలిస్తున్నాయి. ఇరాన్ ప్రతీకార దాడులు , దానికి ప్రతిగా అమెరికా-ఇజ్రాయెల్ సాగిస్తున్న భీకర దాడుల ప్రభావం అంతర్జాతీయ ఇంధన మార్కెట్‌పై తీవ్రంగా పడింది. ప్రస్తుత పరిస్థితులు ఇలాగే మరో వారం కొనసాగితే ప్రపంచం ఒక మహా సంక్షోభం దిశగా వెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది.
పేలడానికి రెడీ అవుతున్న ఆయిల్ బాంబు
ప్రపంచ చమురు రవాణాలో అత్యంత కీలకమైన స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ పై ఇరాన్ పట్టు బిగించడం ఇప్పుడు అతిపెద్ద సమస్యగా మారింది. ప్రపంచంలోని మొత్తం చమురు సరఫరాలో దాదాపు 20 శాతం ఈ మార్గం నుంచే జరుగుతుంది. ఇరాన్ దాడుల కారణంగా ఈ మార్గంలో నౌకల రాకపోకలు నిలిచిపోవడంతో అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ ముడి చమురు ధర రికార్డు స్థాయికి చేరుకుంది. దీనివల్ల యూరప్ దేశాల్లో ఇప్పటికే విద్యుత్ , రవాణా ఛార్జీలు ఆకాశాన్ని తాకుతున్నాయి. నిత్యావసరాల ధరలు పెరిగి సామాన్యుడి బతుకు భారంగా మారింది.
బలహీన ఆర్థిక వ్యవస్థల విలవిల
ఈ చమురు సంక్షోభం ఇప్పటికే ఆర్థికంగా కునారిల్లుతున్న పాకిస్థాన్, శ్రీలంక వంటి దేశాలను పూర్తిగా అగాధంలోకి నెట్టేస్తోంది. విదేశీ మారక ద్రవ్య నిల్వలు లేక ఇంధనాన్ని దిగుమతి చేసుకోలేక పాకిస్థాన్ అంతటా అంధకారం అలుముకుంది. రవాణా వ్యవస్థ స్తంభించడంతో ఆహార ధాన్యాల కొరత ఏర్పడి అంతర్గత అల్లర్లు మొదలయ్యే ప్రమాదం పొంచి ఉంది. శ్రీలంకలో ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ఆర్థిక వ్యవస్థ ఈ యుద్ధ సెగతో మళ్ళీ పతనం అంచుకు చేరుకుంది. మరో వారం పాటు ఇదే పరిస్థితి కొనసాగితే ఈ దేశాల్లో ప్రభుత్వాలు కూలిపోయేంత తీవ్రమైన అరాచకం నెలకొనవచ్చు. కేవలం పేద దేశాలే కాదు, అమెరికా , యూరోపియన్ యూనియన్ దేశాలు కూడా ద్రవ్యోల్బణ సెగతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. చమురు ధరలు పెరగడం వల్ల ఉత్పత్తి వ్యయం పెరిగి, పరిశ్రమలు మూతపడే పరిస్థితి వస్తోంది. స్టాక్ మార్కెట్లు కుప్పకూలడంతో లక్షల కోట్ల సంపద ఆవిరవుతోంది. ఇంధన కొరత కారణంగా రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కంటే ఈ ఇరాన్ సంక్షోభం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై మూడు రెట్లు ఎక్కువ ప్రభావం చూపుతోంది.
మరో వారం ఇదే పరిస్థితి ఉంటే ఏమవుతుంది?
యుద్ధం మరో వారం రోజులు ఇలాగే కొనసాగితే, అది ప్రపంచవ్యాప్త ఆర్థిక మాంద్యం కు దారితీస్తుంది. విమానయాన రంగం పూర్తిగా కుప్పకూలడం, అంతర్జాతీయ వాణిజ్యం స్తంభించడం, ఇంధనం కోసం దేశాల మధ్య పెనుగులాట మొదలవుతుంది. ఇప్పటికే ఐక్యరాజ్యసమితి , ఇతర అగ్ర దేశాలు మధ్యవర్తిత్వం కోసం ప్రయత్నిస్తున్నప్పటికీ, ఇరాన్ , ఇజ్రాయెల్ పట్టువీడకపోవడం ప్రపంచాన్ని పెను ప్రమాదంలోకి నెడుతోంది. ఏం జరగబోతోందనేది ఎవరికీ అర్థం కావడం లేదు.


