వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తన వేసవి విడిది కోసం లండన్ పయనమయ్యారు. రాజకీయాల వేడి నుంచి ఉపశమనం పొందేందుకు చల్లని ప్రదేశాలకు వెళ్లడం ఆయనకు అలవాటే. అయితే, ఈసారి ఆయన పర్యటన కంటే, ఆయన వేసుకున్న బ్లూ డెనిమ్ డ్రెస్సుపై వైసీపీ సోషల్ మీడియా చేస్తున్న హడావుడే ఇప్పుడు నెటిజన్లకు పెద్ద వినోదంగా మారింది. బెంగళూరు విమానాశ్రయంలో దిగిన ఆ ఫోటోలను పట్టుకుని, కూల్ లుక్ , స్టైలిష్ సీఎం అంటూ ఎలివేషన్లు ఇస్తున్నారు.
వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలు ఎంత కష్టపడి ఆ లుక్‌ని కొత్తగా ప్రొజెక్ట్ చేద్దామని చూస్తున్నా.. షార్ప్ ఐ ఉన్న నెటిజన్లు మాత్రం అసలు గుట్టు కనిపెట్టేశారు. జగన్ రెడ్డి వేసుకున్న ఆ డెనిమ్ షర్ట్, ప్యాంటు కొత్తవేమీ కావు. సరిగ్గా గత ఏడాది లండన్ టూర్ వెళ్లినప్పుడు కూడా ఆయన ఇవే బట్టల్లో దర్శనమిచ్చారు. పాత ఫోటోలను తీసి పక్కన పెడితే, డ్రెస్సింగ్ స్టైల్ లో ఇసుమంతైనా మార్పు లేదని తేలిపోయింది. బహుశా ఆయనకు ఆ బ్రాండ్ మీద ఉన్న మక్కువో లేక సింప్లిసిటీ అనిపించుకోవాలనే తాపత్రయమో కానీ, కొత్తగా ఏదో జరిగిపోయిందని బిల్డప్ ఇవ్వడం మాత్రం అతిగా అనిపిస్తోంది.
గతంలో సంక్షేమ పథకాలు, బటన్ నొక్కుడు గురించి గప్పాలు కొట్టుకునేవారు. ఇప్పుడు చెప్పడానికి అవేమీ లేకపోవడంతో, చివరకు తమ నాయకుడి ఇటాలియన్ బ్రాండ్ షూలు, పాత డెనిమ్ డ్రెస్సుల మీద కూడా విశ్లేషణలు చేయాల్సి వస్తోంది. మా నాయకుడు బ్లూ డ్రెస్సులో అదిరిపోయాడు అని పోస్టులు పెట్టడం చూస్తుంటే, వైసీపీ దగ్గర అసలు రాజకీయ అజెండా ఖాళీ అయిపోయిందని, అందుకే ఇలాంటి డ్రెస్సింగ్ ఎలివేషన్ల మీద ఆధారపడుతున్నారని విశ్లేషకులు సెటైర్లు వేస్తున్నారు.
లండన్‌లో దిగే ఫోటోలను కూడా వైసీపీ ఐటీ వింగ్ హాలీవుడ్ హీరో రేంజ్ అని భజన చేయడానికి సిద్ధంగా ఉండి ఉంటారని అనుకోవచ్చు.
