మేము అడ్డు పడితే ప్రజాస్వామ్యం- మీరైతే అపరాధం

వాస్తవాలు కల్పన కంటే చిత్రంగా వుంటాయంటారు.(ప్యాక్ట్స్‌ ఆర్‌ స్ట్రేంజర్‌ దేన్‌ ఫిక్షన్‌) ఆ సంగతి బాగా తెలిసిన పెద్ద మనిషి పేద్ద నాయకుడు ప్రధాని నరేంద్ర మోడీ..ప్రతిపక్షాలు అభివృద్ధి కార్యక్రమాలకు అడ్డుతగులుతున్నందుకు ఆవేదన చెందిన మెడీజీ గురువారం నాడు ఒక పూట నిరశన(అంటే అన్నం మానేయడం. అశనం అంటే అన్నం.) దీక్ష చేస్తారట. ప్రత్యేకత ఏమంటే మోడీజీ ఒకచోట కూచోరు. తన పనులన్నీ షరా మామూలుగానే చేసుకుంటారు. తను సెలవు తీసుకోరుగాని తిండికి మాత్రమే సెలవిస్తారట. ఆయనకు వత్తాసుగా దేశమంతటా కూడా బిజెపి ఎంపిలు తమ తమ నియోజకవర్గాల్లో(మరోచోటనైతే ఎన్నికల లబ్ది వుండదు కదా) నిరాహారదీక్షలకు కూచుంటారట. కాంగ్రెస్‌ నాయకత్వంలో ప్రతిపక్షాలు కావాలని సభకు అడ్డుతగిలి గత పద్దెనిమిదేళ్లలో ఎన్నడూ లేనట్టు సభా సమయం పూర్తిగా వృథా చేశారని మోడీజీ ఇదై పోతున్నారట. ప్రస్తుతం కర్ణాటక ఎన్నికల ప్రచారంలో తలమునకలై వున్న మోడీజీ జిగ్రీదోస్తుడైన అమిత్‌ షా మహాశయుడు కూడా సేమ్‌ టు సేమ్‌ ఫీలైనా మధుమేహం కారణంగా తిండి మానేయలేక రెండు గంటలు ధర్నా చేసి ధామంతం తీర్చుకుంటారట.

అధికారపక్షంగా సభా నాయకుడుగా సభను సక్రమంగా నిర్వహించాల్సిన బాధ్యత తమపౖౖె వుంటే మోడీ మరెవరికి వ్యతిరేకంగా నిరశన చేపడుతున్నారు? ఆంధ్ర ప్రదేశ్‌ ప్రత్యేక హౌదానిరాకరణపై వచ్చిన అవిశ్వాసం నోటీసుకు కావలసినంత మద్దతు వున్నా చర్చకు తిరస్కరించారు గాని అనుమతించి వుంటే ఒకటి రెండు రోజుల్లో అంతా అయిపోయేది కదా! దాన్ని చర్చకు అనుమతించకపోవడం మోడీ మదిలో గూడు కట్టుకున్న అభద్రతే గాని అవతలిపక్షం కాదు కదా! పోనీ ఆ ప్రతిష్టంభన జరిగిన సమయంలో ఒక్కరోజైనా ప్రధాని సర్దుబాటుకు సమన్వయానికి ప్రయత్నించారా? సంభాషణలకు ఆహ్వానించారా అంటే లేనేలేదు. అన్నా డిఎంకె అనే ఒక ప్రాంతీయ పార్టీ సభ్యులు మాత్రమే నిరసన తెల్పుతుంటే దాన్ని సాకుగా చూపి క్షణాల మీద వాయిదాలు వేస్తూ ప్రజాస్వామాన్ని సహా నియమావళిని అపహాస్యం చేశారు. కాబట్టి ఇందుకు పూర్తి బాధ్యత మోడీ సర్కారుదే తప్ప ప్రతిపక్షాల బాధ్యత లేదు. అన్నాడిఎంకె అక్షరాలా తమ చేతుల్లోనే వుందని, అనుకుంటే ఆందోళన కట్టిపెడుతుందని వేరే చెప్పనవసరం లేదు. మరి ఆ ఒక్క ఆటంకాన్ని ప్రతిఫక్షాలన్నిటికీ ఆపాదించడమంటే వారే మొత్తం ప్రతిపక్షమని భావిస్తున్నారా ప్రధాని గారు?
నిజానికి పార్లమెంటు జరక్కుండా అడ్డుకోవడంలో ప్రతిష్టంభనను అస్త్రంగా కొనసాగించడంలో బిజెపి చరిత్ర చాలా దారుణంగా వుంది. 1990ల నుంచి ప్రధాన ప్రతిపక్షం వారే గనక చిన్న చిన్న సాకులతో ఆరోపణలతో వారు వారాల తరబడి సభను అడ్డుకునేవారు. ఉదాహరణకు యుపిఎ 1 హయాలంలో ఏడుసార్లు సభను జరగకుండా ఆపేశారు. కుంభకోణాలను సాకుగా చూపుతూ రోజుల తరబడి నిలిపేసేవారు. అప్పుడు మిగిలిన ప్రతిపక్షాలు కొంతైనా వాస్తవికంగా వెళదామని ప్రతిపాదిస్తే ససేమిరా అన్నారు.ఇప్పుడు రాజ్యసభ చైర్మన్‌గా వుండి సభ జరగలేదని రోజూ నిట్టూర్పులు విడిచే శ్రీమాన్‌ వెంకయ్యనాయుడు గారు అప్పట్లో అక్కడ సీనియర్‌ సభ్యుడుగా వుంటూనే సభను స్తంభింపచేయడం ఒక ప్రజాస్వామిక రూపమని సెలవిచ్చారు. 2012 సెప్టెంబరు 1న ఆయన మాట్లాడింది చూస్తే సభను జరక్కుండా చేయడం తప్పేనని ఒప్పుకుంటాను గాని అది ప్రజాస్వామ్యాన్ని పరిపుష్టం చేస్తుందన్నారు. అప్పటి ప్రతిపక్ష నాయకుడు ప్రస్తుత ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ వెంకయ్య కన్నా ముందే 2012 ఆగష్టులో ఒక పత్రికలో వ్యాసం రాస్తూ సభను అడ్డుకోవడం ద్వారా తాము ప్రజాస్వామ్య పరిరక్షణ సంకేతాలు పంపిస్తున్నామని ప్రవచించారు! మరో ఏడాది తర్వాత వీరిద్దరే సభలో ఎపి పునర్వ్యవస్థీకరణ చట్టం చర్చలో ప్రత్యేకహౌదాపై పోరాడి సాధించామన్నారు. అధికారంలోకి వచ్చాక దానికే పిండిపదానం చేశారు. ఇన్ని వికృత వాస్తవాలు విపరీత పోకడలు చరిత్రలో నమోదై వుంటే మోడీ అమిత్‌ షా జోడీ సభల స్తంభన సమయం గురించి గగ్గోలు పెట్టడం ఎదురుదాడికి అతి తెలివికి అద్బుత ఉదాహరణ అవుతుంది. ఏప్రిల్‌ 12వ తేదీని ఎంచుకోవడమంటే మరో రెండు రోజుల తర్వాత అంబేడ్కర్‌ జయంతినాడు ఎదురయ్యే నిజమైన నిరసనలపై ముందస్తు అస్త్రంగా చూడవలసి వస్తుంది. స్వంతపార్టీ ఎంపిలే దళిత సమస్యలపై ఆగ్రహంతో రగిలిపోతుండగా గోముఖ వ్యాఘ్రాల్లా ి గోసాయి చిట్కాలతో సరిపెట్టడం కుదరదు గాక కుదరదు. కదిలిపోతున్న మోడీత్వ పునాది నిలవనూ నిలవదు. .

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.