తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో దళపతి విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం అడుగులు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లో 2024 ఎన్నికల్లో పవన్ కల్యాణ్ అనుసరించిన జనసేన వ్యూహాన్ని విజయ్ ఇప్పుడు తమిళనాట అమలు చేయబోతున్నారనే సంకేతాలు బలంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఎన్డీఏ కూటమిలో చేరడం, తక్కువ సీట్లకు సర్దుబాటు కావడం , ఉప ముఖ్యమంత్రి పదవి లక్ష్యంగా సాగుతున్న ఈ ప్రచారం తమిళ రాజకీయ ముఖచిత్రాన్ని మార్చేలా ఉంది.
విజయ్ కోసం సీట్ల పంపకాల చర్చలు ఆపేసిన ఎన్డీఏ
ప్రస్తుత సమాచారం ప్రకారం ఎన్డీఏ కూటమిలోని పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు చర్చలు తాత్కాలికంగా నిలిచిపోయాయి. దీనికి ప్రధాన కారణం విజయ్ పార్టీని కూటమిలోకి తీసుకువచ్చేందుకు జరుగుతున్న తెరవెనుక ప్రయత్నాలే అని తెలుస్తోంది. డీఎంకే వ్యతిరేక ఓటు చీలకుండా ఉండాలంటే బలమైన శక్తులన్నీ ఏకం కావాలని బీజేపీ భావిస్తోంది. ఈ క్రమంలోనే విజయ్ కూడా పట్టువిడుపులకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. పవన్ కల్యాణ్ ఏ విధంగానైతే తన సొంత బలం కంటే కూటమి గెలుపే ప్రధానమని భావించి తక్కువ సీట్లకు మొగ్గు చూపారో, విజయ్ కూడా అదే బాటలో నడిచే అవకాశం ఉందని ప్రచారం ఊపందుకుంది.
డిప్యూటీ సీఎం పదవికి ఫిక్స్ అవుతారా?
తమిళ మీడియాలో వినిపిస్తున్న కథనాల ప్రకారం విజయ్ పార్టీకి సుమారు 50 నుంచి 60 సీట్లు కేటాయించి, అధికారంలోకి వస్తే ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చేలా ఒప్పందం కుదిరే అవకాశం ఉంది. సొంతంగా ముఖ్యమంత్రి కావాలనే ఆశయం ఉన్నప్పటికీ, క్షేత్రస్థాయిలో పార్టీ యంత్రాంగం ఇంకా పూర్తిస్థాయిలో విస్తరించని తరుణంలో పవన్ కల్యాణ్ ఫార్ములానే మేలని విజయ్ భావిస్తున్నట్లు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇలా చేయడం వల్ల అటు సినీ గ్లామర్ అండతో ఓట్లు రాబట్టవచ్చు, ఇటు పరిపాలనలో భాగస్వామి అయి ప్రజలకు దగ్గరవ్వచ్చు అనేది వారి వ్యూహం.
విజయ్ ఎన్డీఏలో చేరితే డీఎంకేకు కష్టమే
ఒకవేళ ఇదే జరిగితే తమిళనాడులో ఎన్డీఏ కూటమి అత్యంత శక్తివంతంగా మారే అవకాశం ఉంది. డీఎంకే కోటను బద్దలు కొట్టడానికి విజయ్ యువత ఓట్లు, బీజేపీ జాతీయ భావజాలం , అన్నాడీఎంకే కేడర్ బలం తోడైతే ఫలితాలు తారుమారయ్యే అవకాశం ఉంది. పవన్ కల్యాణ్ ఆంధ్రప్రదేశ్లో కింగ్ మేకర్ పాత్ర పోషించి ఏ విధంగా విజయవంతమయ్యారో, విజయ్ కూడా తమిళనాట అదే మ్యాజిక్ రిపీట్ చేస్తారని భావిస్తున్నారు. అయితే విజయ్ మాత్రం.. ఎంజీఆర్ లా సంచలనం సృష్టిస్తానని గట్టి నమ్మకంతో ఉన్నారు. కానీ చుట్టుముడుడుతున్న సమస్యలు ఆయనలో నమ్మకాన్ని తగ్గిస్తున్నయాని అంటున్నారు.


