బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ రాజ్యసభకు వెళ్తున్నారు. వయసు… ఇతర రాజకీయ కారణాలతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు ఎక్కువగా చంద్రబాబు గురించి చర్చ జరుగుతోంది. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కూడా ఢిల్లీకి ఆహ్వానించి, ఆయనకు ఉప ప్రధాని, ఎన్డీయే కన్వీనర్ వంటి కీలక బాధ్యతలు అప్పగించాలని బీజేపీ అగ్రనాయకత్వం భావిస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో బలమైన ప్రచారం ఉంది. గతంలో కింగ్ మేకర్‌గా చక్రం తిప్పిన బాబు అనుభవాన్ని జాతీయ స్థాయిలో వాడుకోవాలని అనుకుంటున్నారని చెబుతున్నారు. ఈ మార్పు ద్వారా ఏపీలో నారా లోకేష్‌కు ముఖ్యమంత్రిగా బాధ్యతలు అప్పగించే వెసులుబాటు కలుగుతుందని కూడా చెబుతున్నారు. కానీ సాధ్యాసాధ్యాలను విశ్లేషిస్తే అది ఇప్పుడల్లా జరిగే పరిణామం కాదని అనుకోవచ్చు.
ఏపీ, బీహార్లలో భిన్నమైన పరిస్థితులు
నితీష్ కుమార్ , చంద్రబాబుల పరిస్థితులు పూర్తిగా భిన్నమైనవి. నితీష్ కుమార్ బీహార్‌లో సుదీర్ఘ కాలం పాలించారు. ఆయన ఆరోగ్యంపై ఇటీవల రకరకాల ప్రచారం జరుగుతోంది. విచిత్రంగా ప్రవర్తిస్తున్నారు. ఎన్నికలకు ముందే ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు మళ్లీ చేపట్టబోరని అనుకున్నారు. కానీ ప్రజల్లో ఉన్న ఆదరణతో ఆయనతోనే ప్రమాణం చేయించారు. అదే సమయంలో బీజేపీ కూడా సరైన సమయం కోసం చూస్తూ ఉంది. ఇప్పుడు నితీష్ ను ఒప్పించారు. నితీష్ కుమారుడికి రాజకీయ భవిష్యత్ భరోసా ఇచ్చి బీహార్‌లో బీజేపీ పట్టు సాధించాలని ప్రయత్నిస్తోంది. దీనికి భిన్నమైన పరిస్థితులు ఏపీలో ఉన్నాయి. బీజేపీ ఏపీలో చాలా మైనర్ భాగస్వామిగా ఉంది.
చంద్రబాబు టార్గెట్ అమరావతి, పోలవరం
ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు నాయకత్వంపై ప్రజల్లో ఇప్పటికీ గట్టి నమ్మకం ఉంది. ఇటువంటి సమయంలో ఆయనను రాష్ట్ర రాజకీయాల నుండి దూరం చేయడం బీజేపీకి కూడా రాజకీయంగా అంత లాభదాయకం కాదు. అదే సమయంలో అమరావతి, పోలవరం రెండింటిని చంద్రబాబు లక్ష్యంగా పెట్టుకున్నారు. రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌కు ఒక శాశ్వత రాజధానిని నిర్మించాలనేది ఆయన జీవితకాల ఆశయం. అమరావతి పనులు ఒక కొలిక్కి రాకుండా, పోలవరం వంటి కీలక ప్రాజెక్టులు పూర్తి కాకుండా ఆయన ఏపీని వదిలి ఢిల్లీకి వెళ్లే సాహసం చేయరg. పైగా, ప్రస్తుతం రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం బలంగా ఉన్న తరుణంలో, పాలనను వదిలి వెళ్లడం పార్టీ శ్రేణుల్లో అయోమయానికి దారితీసే ప్రమాదం ఉందన్న భావన ఉంది.
రాజకీయాల్లో ఏదీ అసాధ్యం కాదు !
అయినప్పటికీ, జాతీయ రాజకీయాల్లో ఏదైనా అసాధ్యం కాదు. ఒకవేళ భవిష్యత్తులో కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వానికి ఇతర పార్టీలను సమన్వయం చేసే బలమైన నేత అవసరమైతే, మోదీ-షా ద్వయం చంద్రబాబుపై ఒత్తిడి తెచ్చే అవకాశం ఉంది. చంద్రబాబు కూడా తన వారసుడైన లోకేష్‌కు లైన్ క్లియర్ చేయాలని భావిస్తే, రాష్ట్రంలో లోకేష్‌ను సీఎంను చేసి తాను కేంద్రంలో చక్రం తిప్పే వ్యూహాన్ని అమలు చేయవచ్చు. చంద్రబాబు ఢిల్లీకి వెళ్లడం అనేది ప్రస్తుతానికి కేవలం ఒక రాజకీయ ఊహాగానం మాత్రమే. కేంద్రం నుంచి ఒత్తిడి ఉన్నప్పటికీ, బాబు తన సొంత వ్యూహంతోనే ముందుకు వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
