కేంద్రానికి ఆంధ్రాపై సవతి తల్లి ప్రేమ ఉన్నట్టుంది! రాష్ట్రం విడగొట్టిన దగ్గర నుంచి అన్నీ ఇచ్చేస్తున్నామని చెబుతూ ఉంటారు. కానీ, వాస్తవంలో ఏవీ కార్యరూపం దాల్చడం లేదు. ఈ వాస్తవం ఇప్పుడిప్పుడే కేంద్ర పెద్దలకు కూడా అర్థమౌతోందనే చెప్పాలి. రైళ్ల విషయమే తీసుకుంటే… ఎన్నికలైన కొత్తలో ఏపీకి రైల్వే జోన్ వచ్చేస్తుందని చెప్పారు. అంతేకాదు, విశాఖ, విజయవాడల్లో మెట్రో రైలు పరుగులు తీస్తుందని ఊహా చిత్రాలు గీసేశారు. ఢిల్లీ మెట్రో మాదిరిగానే మన నగరాల్లో కూడా రైళ్లూ దూసుకుపోతాయని చెప్పుకుంటూ వచ్చారు.
కానీ, ఇప్పుడు పరిస్థితి ఏమైంది.. బడ్జెట్లో విశాఖ రైల్వే జోన్ ఊసెత్తలేదు! ఇకపై దాన్ని మరచిపోవాల్సిందే అనేది అర్థమౌతోంది. నిజానికి, గతంలో ఇది కేంద్రం ఇచ్చిన హామీయే.. అయినా మరచిపోవాల్సిందే. ఎందుకంటే, చంద్రబాబు సర్కారు కేంద్రాన్ని డిమాండ్ చేస్తుందంటే ఎవ్వరూ నమ్మే పరిస్థితిలో లేరు. సో… జోన్ ప్రస్థావన వచ్చే ఎన్నికల మేనిఫెస్టోలో ఉండే అవకాశం కనిపిస్తోంది. ఇక, మెట్రో కలలపై కూడా కేంద్రం నీళ్లు చల్లేసింది. మెట్రో నిర్మాణాలకు సంబంధించి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇకపై పబ్లిక్, ప్రైవేట్ భాగస్వామ్యంలో మెట్రో నిర్మాణాలు ఉండవు. మొత్తంగా ప్రైవేటు సంస్థల అధీనంలో మెట్రో ప్రాజెక్టుల నిర్మాణం జరుగుతుందని చెబుతున్నారు. కొత్త విధివిధానాలకు సంబంధించిన నియమావళి ఇంకా రూపొందించాల్సి ఉంది. దానికి ఇంకాస్త సమయం పట్టొచ్చు.
అంటే, ఇప్పట్టో కొత్త మెట్రోరైల్వే ప్రాజెక్టులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చే పరిస్థితి కనిపించడం లేదు. కొత్త గైడ్ లైన్స్ వచ్చాక… వాటికి అనుగుణంగా మరోసారి చంద్రబాబు సర్కారు ప్రయత్నాలు చేయాల్సి రావొచ్చు. నిజానికి, ఏపీలో రెండు నగరాల్లో మెట్రోల ఏర్పాటుకు ప్లాన్ చేసినా… ఒకేసారి నిర్మాణ వ్యయం చాలా అవుతుందని విశాఖను ముందుగానే పక్కనబెట్టారు. విజయవాడ మెట్రో నిర్మాణం సాధ్యాలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమౌతూ వచ్చాయి. ముఖ్యంగా స్థల సేకరణ అనేది అంత సులువైన పనేం కాదు. పైగా, ఇన్ని వ్యయప్రయాసలకు ఓర్చి నిర్మించినా… మెట్రో రైలు లాభాల్లో నడుస్తుందా అనే అనుమానం మొదట్నుంచీ ఉన్నదే. ఏదైతేనేం… ఆంధ్రాలో అనుకున్న రెండు మెట్రోలూ, ఒక రైల్వే జోనుపై పూర్తి స్పష్టత వచ్చేసినట్టే కదా! రైల్వే జోన్‌పై ఇంకా కొన ఆశలు ఉన్నా… దాన్ని పోరాడి నిలబెట్టాల్సిన బాధ్యత ఆంధ్రప్రదేశ్ సర్కారుది. మరి, ఆ బాధ్యతను ఇప్పుడైనా గుర్తిస్తుందా.. కేంద్రంతో బంధుత్వానికే ప్రాధాన్యత ఇస్తుందో వేచి చూడాలి.