టాలీవుడ్‌కి ఓ గ్లామర్ తుఫాన్‌లా దూసుకొచ్చింది శ్రీలీల. రెండో సినిమా ధమాకాతోనే డ్యాన్సింగ్ క్వీన్ అనే పేరు తెచ్చుకుంది. నిజానికి ఆ సినిమాకి శ్రీలీల డ్యాన్సులు చాలా ప్లస్ అయ్యాయి. అక్కడ నుంచి వరుసపెట్టి అవకాశాలు వచ్చాయి. విచిత్రం ఏమిటంటే.. ఆ సినిమా తర్వాత హీరోయిన్ గా మరో విజయం అందుకోలేకపోయింది లీల. స్కంద, ఆదికేశవ, ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్, గుంటూరు కారం, రాబిన్‌హుడ్, మొన్న వచ్చిన జూనియర్ వరకూ అన్నీ ఫ్లాపులే. ఇప్పుడు శ్రీలీల ఒక సినిమాలో హీరోయిన్గా వుందంటే.. ఇక అంతే సంగతులు అనేదాక వచ్చింది పరిస్థితి.
నిజానికి శ్రీలీల చాలా లక్కీ. వరుసగా ఇన్ని ఫ్లాపులు వస్తే.. దర్శక నిర్మాతలు కాస్త జంకుతారు. కానీ శ్రీలీలకి ఇంకా ఆ పరిస్థితి రాలేదు. ఇంకా పెద్ద అవకాశాలు వస్తూనే వున్నాయి. డ్యాన్స్ ఆమెకు ప్లస్ పాయింట్. అయితే అదొక్కటే సరిపోదు. మంచి పాత్రలు పడాలి. శ్రీలీల విషయంలో అదే జరగడం లేదు.
శ్రీలీలకి వస్తున్న పాత్రల్ని చూస్తుంటే అసలు రైటర్స్ ఆమెని సీరియస్‌గా తీసుకుంటున్నట్లు అనిపించడం లేదు. కమర్షియల్ సినిమాల్లో హీరోయిన్స్‌ని ఎందుకు సీరియస్‌గా తీసుకుంటారని అనుకోవచ్చు. అది సరైన అభిప్రాయం కాదు. అనుష్క, తమన్నా, కాజల్, సమంత.. వీళ్ళంతా కమర్షియల్‌గా ఆదరగొట్టిన హీరోయిన్సే. వాళ్ల కెరీర్లో గుర్తుపెట్టుకునే పాత్రలు, కథకు బలం చేకూర్చిన పాత్రలు వున్నాయి. కానీ శ్రీలీలకి ఇప్పటివరకూ అలాంటి ఒక్క పాత్ర దొరకలేదు. ధమాకాలో డ్యాన్సులు బాగా చేసిందని అంటారేకానీ అందులో ఆమె క్యారెక్టర్ ఎవరికీ గుర్తుండదు. అంత వీక్‌గా ఉంటున్నాయి ఆమెకు వచ్చే పాత్రలు.
శ్రీలీల వైపు నుంచి కూడా కొన్ని తప్పిదాలు జరుగుతున్నాయి. దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలనే వైఖరి ఏమో కానీ… ఒకే తరహా పాత్రల్ని అంగీకరిస్తుంది లీల. కంపెనీ సీఈవో, లేదా గొప్పింటి బిడ్డ.. ఇదే మూస. పైగా ఒకటే తరహా డైలాగ్ డిక్షన్. ఒక దశలో క్రింజ్ అనిపించే చేష్టలు. అన్నటికి కంటే ముఖ్యం.. శ్రీలీల తెరపై పాత్రలా కనిపించడం. ఆ కథ తాలూకు వరల్డ్ బిల్డింగ్‌లో ఏ మాత్రం ఇమడటం లేదు.
ఇక్కడే ఆమెకు ఒక సినిమా అవకాశం కంటే.. రైటర్ అవసరం వుంది. కథ తన పాత్రని డిమాండ్ చేస్తుందా లేదా? రచయిత నిజంగానే కథకి అవసరం వుండే తన పాత్రని సృష్టించాడా? ఈ జడ్జ్‌మెంట్‌పై ఖచ్చితంగా శ్రీలీల పట్టు సాధించాలి. కమర్షియల్ సినిమాల్లో హీరోయిన్స్ ప్రాధాన్యత తక్కువని సర్ది చెప్పుకోవడం ఓ సాకు మాత్రమే. ఇలా మరీ తీసేపారేసే పాత్రలు చేయడం వలన పేరు మసకబారడం తప్పితే ప్రయోజనం వుండదు.