కర్నూలులో కట్టమంచి రామలింగారెడ్డి స్కూల్లో పదో తరగతి విద్యార్థిని సుగాలి ప్రతీ 2017లో ఆత్మహత్య చేసుకున్నారు. ఆమె తల్లిదండ్రులు ఆందోళన చేయడంతో అనుమానాస్పద కేసుగా మార్చారు. విచారణ చేశారు. ఆ పాప తల్లిదండ్రులు చెబుతున్నట్లుగా ఘోరం జరిగినట్లుగా ఆధారాలు లభించలేదు. కానీ ఆత్మహత్యకు కారణమైన స్కూల్ యజమానులపై కేసులు పెట్టి జైలుకు పంపారు. కానీ తమ పాపపై ఘోరం జరిగిందని ఆమె తల్లిదండ్రులు ఊరూవాడా ఆందోళనలు చేస్తూనే ఉన్నారు.
అండగా నిలబడిన పవన్ కల్యాణ్
సుగాలి ప్రీతి తల్లి ఆవేదన చూసి పవన్ కల్యాణ్ అండగా నిలబడ్డారు. లక్షల మందితో కర్నూలు నడిబొడ్డుకు వెళ్లి బలంగా గళం వినిపించారు. ఈ కారణంగా ఆ కేసును సి.బి.ఐ.కి అప్పగిస్తూ అప్పటి ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. కానీ విచారణ ముందుకు సాగలేదు. సీబీఐ తమ వద్ద వనరులు లేవన్న కారణంగా కేసును తీసుకోలేదు. సుగాలి ప్రీతి కుటుంబానికి చట్టప్రకారం వారికి ప్రభుత్వం నుంచి అందాల్సిన పరిహారాలు అందేలా చేయడంలో జనసేన అధినేత పాత్ర కీలకం. అయిదు ఎకరాల వ్యవసాయ భూమి ఇచ్చారు. ఆ భూమి మార్కెట్ విలువ దాదాపుగా రూ. పది కోట్లు. కల్లూరు దగ్గర 5 సెంట్ల ఇండ్ల స్థలం, సుగాలీ ప్రీతి తండ్రికి రెవెన్యూ శాఖలో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగం ఇచ్చారు. జనసేన పోరాటాల వల్లనే అవి జరిగాయి.
సీఐడీ విచారణలో సరిపోలని డీఎన్ఏలు
ప్రభుత్వం మారగానే డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కల్యాణ్ సుగాలి ప్రీతి కేసుపై సీఐడీ ఛీఫ్ తో మాట్లాడి త్వరగా న్యాయం చేయాలని సూచించారు. డీజీపీ తో, హోంమంత్రి తో కూడా మాట్లాడారు. సీఐడీ విచారణ కూడా చేసింది. దర్యాప్తులో అన్ని పరిశీలించిన అనుమానితుల డీఎన్ఏలు సరిపోలడం లేదని సీఐడీ గుర్తించింది. గత ప్రభుత్వం చేసిన తప్పుల కారణంగానే కేసు విచారణకు ఇబ్బందులు కలుగుతున్నాయి. అయినా సుగాలి ప్రీతి కేసులో దోషులకు శిక్ష పడేందుకు పోలీసు శాఖ పని చేస్తోంది. ఇదంతా సుగాలి ప్రీతి తల్లికి తెలుసని జనసేన వర్గాలంటున్నాయి.
రాజకీయ పార్టీలకు ఆయుధంగా మారకూడదు !
సుగాలి ప్రీతీ తల్లి తమ కూతుర్ని ఖచ్చితంగా అత్యాచారం చేసి.. హత్యచేశారని వాదిస్తున్నారు. కానీ పోలీసుల దర్యాప్తులో భిన్నమైన అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. అందుకే ఆ కేసులో ముందుకు వెళ్లలేకపోతున్నారు. ఆమె ఎందుకు అలా పదే పదే ఇలా రాజకీయ పరంగా విమర్శలు చేస్తున్నారో .. ఏ ఉద్దేశంతో చేస్తున్నారో జనసేన వర్గాలకూ అర్థం కావడం లేదు. అండగా నిలబడిన వారిపై నిందలు వేసి.. రాజకీయ ప్రత్యర్థులకు మేలు చేయవచ్చు కానీ.. అది మంచి పద్దతి కాదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సీబీఐ కేసు తీసుకోకపోయినా.. సీఐడీతో విచారణ చేయిస్తున్నందుకా ఈ రాళ్ల దెబ్బలని పవన్ కూడా ఆవేదన చెందుతున్నారు.