“ధియేటర్లు మూసివేత” ఈ ఆలోచన ఎలా వచ్చిందో కానీ తమను తాము గొయ్యి తీసి పాతి పెట్టుకుంటున్నామని టాలీవుడ్ పెద్దలకు ఆలోచన రాకపోవడం విచిత్రమే అనుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే ధియేటర్లకు వచ్చి చూసేవారు తగ్గిపోయారు. సినిమాధియేటర్ స్థాయిలో విజువల్, సౌండ్ అందించే పరికరాలు ఇళ్లల్లోకి వచ్చేశాయి. ఇలాంటి సమయంలో ఏ మాత్రం నిర్వహణ సరిగా ఉండని ధియేటర్లలో సినిమాలు చూసేందుకు ప్రజలు ఆసక్తి చూపించడం లేదు. సింగిల్ స్క్రీన్ల వైపు అసలు రావడం లేదు. ఇలాంటి సమయంలో ఏదో , ఎవరినో బెదిరిద్దామని ధియేటర్ల మూసివేత అన్న పాచిక వేశారు. ఇప్పుడు రివర్స్ అయింది.
ధియేటర్ల మాఫియాతోనే అసలు సమస్య
టాలీవుడ్ కొంత మంది గుప్పిట్లో ఉందన్నది అందరికీ తెలిసిన విషయం. ఆ కొంత మంది ఎందుకు టాలీవుడ్ పై పట్టు పెంచుకుంటున్నారన్నది కూడా అందరికీ తెలుసు. సింగిల్ స్క్రీన్లను రెంటల్ విధానంలోకి తెచ్చి.. తాము రెంట్స్ కు తీసుకుని గుప్పిట్లో పెట్టుకున్నారు. పండగ సీజన్లలో సినిమాలు విడుదలవుతున్నాయంటే.. ఆ ధియేటర్లు ఎవరి గుప్పిట్లో ఉన్నాయో వారి సినిమాలకే ఎక్కువ ధియేటర్లు వస్తాయి. ఆ వ్యక్తి డబ్బింగ్ సినిమా రిలీజ్ చేయాలనుకుంటే దానికే అత్యధిక ధియేటర్లు దక్కుతాయి. పండగ సీజన్ లో తమిళనాడులో తెలుగు సినిమాకు రెండు ధియేటర్లు కూడా దొరకవు. కానీ ఇక్కడ వందల ధియేటర్లలో తమిళ డబ్బింగ్ రిలీజవుతుంది.
రాజకీయాల కోసం టాలీవుడ్ ను నాశనం చేస్తారా ?
ఇప్పుడీ ధియేటర్ మాఫియా రాజకీయ కుట్రలు చేయడానికి తమ నెత్తిమీద తాము చేయి పెట్టుకుంది. రాజకీయాలు అతీతం కాదు కానీ..తమ ఉనికి బలంగా చూపించే తమ వ్యాపారాన్నే పణంగా పెట్టిచేయాలను కోవడం ఆశ్చర్యమే. టాలీవుడ్ లో ఎంతటి ఘోర పరిస్థితులు ఉన్నాయో కళ్ల ముందు కనిపిస్తోంది. ఒకప్పుడు ధియేటర్ రెవిన్యూకు తగ్గట్లుగా మార్కెట్ జరిగేది. ఇప్పుడు బడ్జెట్ లో ధియేటరికల్ రైట్స్ సగం వాల్యూ చేస్తే చాలు అన్నట్లుగా మారిపోయింది. ఇంతగా దిగజారిపోతున్నా.. పరిశ్రమను గుప్పిట్లో పెట్టుకున్న పెద్దలు మారడం లేదు.
కూర్చున్న కొమ్మను నరుక్కుంటే ఏం జరుగుతుంది?
కొంత మంది గుప్పిట్లో టాలీవుడ్ ఉన్నంత కాలం మెరుగుపడే పరిస్థితి ఉండదు. రాజకీయాలతో కుళ్లిపోతుంది. ఈ నలుగురు అయినా బాగుపడతారన్న సూచనలు లేవు. ఓ సినిమా తీసి నిండా మునిగిపోయి.. మరో సినిమా హిట్ తో కోలుకున్నామని లేకపోతే దివాలా తీసేవాళ్లమని కన్నీరు పెట్టుకునే వాళ్లు.. టాలీవుడ్ భవిష్యత్ ను నిర్వీర్యం చేయడం విషాదమే. వారు కూడా దివాలా తీస్తారు.. వాళ్లతో పాటు టాలీవుడ్ నూ. ఈ పాపం వాళ్లదే.