“నా గుండె పగిలింది” అని రాజకీయాల్లో అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న తమిళ సూపర్ స్టార్, టీవీకే చీఫ్ విజయ్ కరూర్‌లో జరిగిన తొక్కిసలాట ఘటనపై స్పందించారు. తన ప్రచారసభలో తన కళ్ల ముందు అంత మంది చనిపోవడం ఏ నాయకుడికైనా తట్టుకోలేని బాధను కలిగిస్తుంది. కొత్తగా రాజకీయాల్లోకి వచ్చి..తన అభిమానుల్నే నమ్ముకున్న విజయ్ లాంటివారికి ఇంకా ఎక్కువ బాధ కలిగిస్తుంది. కానీ ఘటనకు..తప్పిదానికి ఆయనే బాధ్యత తీసుకోవాల్సి ఉంది.
హైప్ కోసం భారీ జన సమీకరణకు విజయ్ ప్లాన్స్
విజయ్ వారాంతాల్లో జిల్లాలు పర్యటిస్తున్నారు. ప్రశాంత్ కిషోర్ ఆయన కోసం పని చేయడం లేదు కానీ.. ఆయన వ్యూహాలను మాత్రం ఫాలో అవుతున్నారు. తన సభలకు జనం తండోపతండాలుగా వస్తున్నారని అనిపించేందుకు ఏ సభకైనా పెద్ద ఎత్తున జన సమీకరణ చేస్తున్నారు. విజయ్ సినిమా హీరో కావడంతో సహజంగానే చూసేందుకు వచ్చే ఫ్యాన్స్ కు ఈ జన సమీకరణ తోడవడంతో భారీగా సభలు కనిపిస్తున్నాయి. ఇది విజయ్ లో మరింత ఆత్మవిశ్వాసానికి కారణం అవుతోంది. కానీ ఎంత ప్రమాదమో అంచనా వేయలేకపోయారు.
చనిపోయిన వారిలో మహిళలు, పిల్లలే అధికం
తమిళనాట సినీ హీరోలకు ఎక్కువ ఆదరణ ఉంటుంది. విజయ్ చాలా ముందు నుంచి రాజకీయ ఆలోచనలతో ఉన్నారు కాబట్టి ఊరూరా ఫ్యాన్ క్లబ్‌లను ప్రోత్సహించారు. అలాంటివి వేలు ఉన్నాయి. ఇప్పుడు రాజకీయంగా అడుగు పెట్టిన తర్వాత ఇలాంటి ఫ్యాన్ క్లబ్‌ల ద్వారా జన సమీకరణ చేస్తున్నారు. మహిళలు, పిల్లలను కూడా రాజకీయ సభకు పెద్ద ఎత్తున తీసుకు రావడమే దీనికి నిదర్శనం. తొక్కిసలాటలో అత్యధిక మంది చనిపోయింది కూడా మహిళలు, పిల్లలే. సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడంతో తీరని నష్టం జరిగింది.
నిందలు వేరే వాళ్లపై వేసి విజయ్ రాజకీయం చేయలేరు !
తన లాంటి సూపర్ స్టార్ రాజకీయ పర్యటనకు వస్తున్నా ప్రభుత్వం ఏర్పాట్లు సరిగ్గా చేయలేదని..భద్రత ఏర్పాటు చేయలేదని.. కరెంట్ తీశారని రకరకాలుగా విజయ్ ఫ్యాన్స్ ప్రభుత్వంపై నిందలేయవచ్చు కానీ.. ఇక్కడ ప్రధానంగా హైలెట్ అయ్యేది విజయ్ నిర్లక్ష్యమే. అధికార పార్టీపై రాజకీయం చేయవచ్చు కానీ ఆయన నిర్లక్ష్యాన్ని కాదనలేరు. ఇప్పుడు తమిళనాడులో ఆ మృతుల కేంద్రంగా జరగబోయే రాజకీయం ఊహించలేనిది.