“ జగన్ రెడ్డి తన చిన్నాన్న ఇక లేరని తెల్లవారుజామున నాలుగు గంటలకే మాకు చెప్పారు “ అని సీఎస్‌గా రిటైర్ అయిన తర్వాత జగన్ రెడ్డి దగ్గర జీతానికి పని చేసిన కల్లాం అజేయరెడ్డి అనే పెద్ద మనిషి సీబీఐకి వాంగ్మూలం ఇచ్చారు. తర్వాత ఖండించినా రికార్డెడ్ సాక్ష్యాలు ఉండటంతో సైలెంటుగా ఉండిపోయారు. తెలంగాణ హైకోర్టులో ఈ వాంగ్మూలం రికార్డు సమర్పించింది. కోర్టుకు కూడా చెప్పింది. కానీ వివేకా హత్య జరిగినట్లుగా మొదట పీఏ చూశారని ఆ తర్వాతే బయట ప్రపంచానికి తెలిసిందని అసలు కథ. అంత కంటే ముందే జగన్‌కు ఎలా తెలిసింది ?. జగన్ కు చెప్పిన ఆయన బార్యకు ఎలా తెలిసింది? ఆయన భార్యకు ఫోన్ చేసిన వారికి ఎలా తెలిసింది ?. ఈ మిస్టరీ గుట్టు విప్పేదెవరు ?
వివేకా హత్య కేసు – వ్యవస్థలకు సవాల్
చిన్న వేలిముద్ర ఆధారంగా చాలా హత్య కేసుల్ని చేధించి ఉంటారు. కానీ బహిరంగంగా జరిగిన.. హత్య చేసి గుండెపోటు అని, రక్తపు వాంతులు అని నమ్మించాలనుకున్నవారు, సాక్ష్యాలను తుడిచేసే ప్రయత్నం చేసిన వారు ఎదురుగా ఉన్నా ఎలాంటి చర్యలు తీసుకోలేకపోయారు. లైవ్ లో చూసినట్లుగా వివేకానందరెడ్డిని ఎలా నరికి చంపారో కూడా జగన్ రెడ్డి వివరించారు. సునీతను తప్పుదోవ పట్టించించి పోస్ట్ మార్టం లేకుండా అంత్యక్రియలు చేయాలనుకున్నారు. చివరికి హత్య అని తప్పనిసరిగా చెప్పాల్సిన పరిస్థితుల్లో చంద్రబాబు చేశాడని రాగం అందుకున్నారు. ఇక్కడే అసలు హంతకులు ఎవరో.. కుట్రదారులెవరో తెలిసిపోతుంది. కానీ ఏళ్లు గడుస్తున్న కేసు మాత్రం ముందుకు సాగడం లేదు.
పక్కా ప్లాన్ తోనే హత్య – పక్క వాళ్ల మీదకు తోసేసే కుట్రలు
వైఎస్ వివేకానందరెడ్డిని పక్కా ప్లాన్ తోనే హత్య చేశారు. అయితే గుండెపోటుగా నమ్మించాలనుకున్న ప్రయత్నంలోనే ఫెయిలయ్యారు. ఆయనను హత్య చేసిన విషయం కృష్ణారెడ్డి ద్వారానే బయట ప్రపంచానికి తెలిసిందిని నమ్మించే ప్రయత్నం చేశారు. కానీ తాము అనుకున్న పని పూర్తి చేశామని .. ముందుగానే సమాచారం ఇచ్చుకున్నారు. అలా ఇచ్చుకున్న సమాచారంలో సమన్యయ లోపం తలెత్తడంతో.. జగన్ రెడ్డి ముందుగానే బయట పెట్టారు.ఇప్పుడు ఆ కోణంలో దర్యాప్తు ఎందుకు చేయరని.. దర్యాప్తు పూర్తయిందని ఎలా చెబుతారని… వివేకా కుమార్తె సునీత ప్రశ్నిస్తున్నారు. వ్యవస్థలు సమాధానం చెప్పాల్సిన ప్రశ్నే ఇది.
నిందితుల ఆటలు చూసి ఎందుకు ఉపేక్షిస్తున్నారు ?
వివేకా హత్య కేసులో నిందితులు అత్యంత ఘోరంగా ప్రవర్తించారు. చంద్రబాబు చేతిలో కత్తి పెట్టి నారాసుర చరిత్ర అని నిందలు వేయడమే కాదు.. విచారణకు వచ్చిన సీబీఐ అధికారులపై కేసులు పెట్టడం, అవినాష్ రెడ్డిని అరెస్టు చేయకుండా అడ్డుపడటం వంటివి చాలా చేశారు. ఇవన్నీ బహిరంగంగా జరిగినవే. ఇంకా లోపాయికారీగా వారు చేసిన ప్రయత్నాలపై వినిపించే గుసగుసలు గురించి తెలిస్తే.. ప్రజలు ఆశ్చర్యపోతారు. ఇలాంటి వారిని వదిలేస్తే.. వ్యవస్థల పనితీరుపై ప్రజలకు ఎలా నమ్మకం ఉంటుందని అనుకుంటారు. హత్యల కేసుల్లోనూ నిందితులకు ఇలాంటి ఊరట లభిస్తూంటే ప్రజలు మాత్రం ఏమనుకుంటారు?