కుల ఉద్రేకాలు రెచ్చగొట్టారు.. తమ రాజకీయాలు చేశారు.. తను రాకపోతే రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేస్తానని భయపెట్టారు. చివరికి ఒక్క చాన్స్ అని అడుక్కున్నారు. ప్రజలు ఏ మూడ్ లో ఉన్నారో కానీ ఓట్లు వేశారు. అంతే జగన్ రెడ్డి ఐదు సంవత్సరాల పాటు నరకం అంటే ఏంటో చూపించారు. రాష్ట్ర ప్రజల్ని టేకిట్ గ్రాంట్ అన్నట్లుగా దోచుకున్నారు. హింసించారు. అసాంఘిక శక్తుల అడ్డాగా మార్చారు. తట్టుకోలేక ప్రజలు రాజకీయ సమాధి కట్టేశారు. అదే ప్రజాస్వామ్య గొప్పతనం. జగన్కు ప్రజలు రాజకీయ సమాధి కట్టి నేటి ఏడాది!
2024 జూన్ 4 ఏపీ రాజకీయ చరిత్రలో ఓ సంచలనం
2024 జూన్ 4 ఏపీ రాజకీయ చరిత్రలో ఓ సంచలనం. ఆ రోజు వరకూ జగన్ రెడ్డి అనే వ్యక్తి తాను ముఫ్పై ఏళ్లు సీఎంగా ఉంటానని చేయని అరాచకం లేదు. ప్రజాస్వామ్యంలో ప్రజలకు విలువ లేదని వాళ్లకు ఓ పదివేలు ఇస్తే చాలు బానిసల్లా పడి ఉంటారని అనుకున్నారు. కానీ ప్రజలను తక్కువగా అంచనా వేస్తే ఏం జరుగుతుందో ఆయనకు ఆ రోజున అర్థం అయింది. కనీసం ప్రతిపక్ష నేత హోదా కూడా రానంతగా ఓడిపోయారు. ఆయన పరాజయం ఎలాంటిదంటే.. ఆయనకు ఇక రాజకీయ భవిష్యత్ లేదని సమాధి కట్టేశామని సందేశం ఇచ్చినంత బలమైన తీర్పు ఇచ్చారు.
ప్రజాతీర్పుతో పాతాళంలోకి జగన్ – ఇప్పుడు తనే మట్టిపోసుకుంటున్న వైనం
ప్రజాతీర్పుతో ఎవరైనా మారతారు. కానీ జగన్ రెడ్డి మాత్రం ఇంకా ప్రజల్ని తక్కువ అంచనా వేయడం మానుకోలేదు. తప్పుడు ప్రచారాలు చేయడమే రాజకీయం.. రౌడీలను ప్రోత్సహించడమే మార్గం అన్నట్లుగా ఆయన రాజకీయాలు చేయడం చూసి ప్రజలు కూడా .. ఇలాంటి వాడినా ఐదు సంవత్సరాల పాటు సీఎంగా చేసిందని ఆశ్చర్యపోతున్నారు. రాజకీయాల్లో హత్యలు ఉండవు కానీ ఆత్మహత్యలు ఉంటాయని.. ఆపని జగన్ చేసుకుంటున్నాడని.. అంటున్నారు. ప్రజలు పాతాళంలోకి తొక్కేస్తే.. మళ్లీ లేవకుండా తానే మట్టి పోసుకుంటున్నాడని రాజకీయవర్గాలు విశ్లేషిస్తున్నాయి.
జగన్కు ప్రజా జీవితంలో కాదు బయట ఉండే అర్హత కూడా లేదు !
ప్రజల తరపున ప్రాతినిధ్యం వహిస్తున్నప్పుడు కొన్ని లక్షణాలను తప్పనిసరిగా అలవర్చుకోవాలి. కానీ అలాంటి పనులు ఏమీ చేయడం లేదు. చంద్రబాబుపై కోపంతో మళ్లీ తనకే ఓట్లు వేస్తారని ఆయనకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తే చాలనుకుంటున్నారు. భారత న్యాయవ్యవస్థను కూడా తక్కువ అంచనా వేస్తున్నారు. ప్రజాసంపదను అడ్డగోలుగా దోచుకుని.. ఘోరంగా కుటుంబసభ్యుల హత్యలకు సైతం కుట్ర పన్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు వ్యవస్థల నుంచి కొంత కాలం తప్పించుకోగలరు కానీ ఎల్లకాలం కాదు. త్వరలో ఆయనకు అర్థమవుతుంది. ప్రజలు కట్టిన రాజకీయ సమాధి శాశ్వతమని.. ఆయనకు రాజకీయ భవిష్యత్ లేదని త్వరలోనే అర్థమవుతుంది. అప్పటి వరకూ ఎగిరెగిరి పడుతూనే ఉంటారు.