ఎన్నికల ఫలితాలు రాగానే ఐదేళ్లు కళ్లు మూసుకుందాం.. ఇట్టే అయిపోతాయి.. మళ్లీ మనం అధికారంలోకి వస్తాం.. అని జగన్ పార్టీ నేతలు, కార్యకర్తలకు సందేశం ఇచ్చారు.ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టినా ఈ కళ్లు మూసుకునే కాన్సెప్ట్ ను మాత్రం వదిలి పెట్టలేదు. నిన్నటి ప్రెస్మీట్ లోనూ మరో మూడేళ్లు కళ్లు మూసుకుందామని పిలుపునిచ్చారు. చిన్న తనంలో ఆయనకు ఇది అలవాటయిపోయిందేమో కానీ ఇప్పుడు అదే పాటిస్తున్నారు. కళ్లు మూసుకుని ఇంట్లో పడుకుంటే తీసుకొచ్చి ప్రజలు అధికారంలో కూర్చోబెడతారని గట్టి నమ్మకంతో ఉన్నారు. పార్టీకి గుడ్డి నాయకత్వాన్ని అందిస్తున్నారు. అందుకే ఆ పార్టీ ఇప్పటికే గోతిలో పడిపోయంది.
ప్రజల కోసం పోరాటమంటే ఏంటో తెలియదు !
నాకు 40 శాతం ఓట్లు వచ్చాయి.. ప్రతిపక్ష నేతనేనని ఆయన చెప్పుకుంటారు. ప్రతిపక్షం కాదని ఎవరన్నారు. అసెంబ్లీలో చట్టప్రకారం ఉండాల్సిన సభ్యులు లేరు కాబట్టి అధికారికంగా హోదా మాత్రం రాదు. కానీ ఆయన ప్రతిపక్షమే. చెప్పుకోవాల్సిన అవసరం లేదు. కానీ చేతల్లో చూపించాలి. ప్రతిపక్షం ఏం చేయాలో కనీసం అవగాహన లేనట్లుగా ఆయన వ్యవహారశైలి ఉంటుంది. స్క్రిప్ట్ రాసుకుని.. స్కిట్లు వేసుకునే కార్యక్రమాలు చేస్తే చాలు అదే పెద్ద పోరాటం అనుకుంటున్నారు. కానీ నిజంగా ప్రజల కోసం పోరాడిన సందర్భం ఒక్కటీ లేదు. అసలు అలాంటి ఆలోచన ఆయనకు లేదు.
ఆశ తప్ప.. ఆలోచన లేదు !
ముఖ్యమంత్రి పదవిపై ఆశ తప్ప జగన్మోహన్ రెడ్డికి.. దాన్ని ఎలా సాధించాలన్న ఆలోచన లేదు. అదే ఉండి ఉంటే ప్రజల పట్ల కాస్త గౌరవంగా ఉండేవారు. ప్రెస్మీట్లలో నరికేస్తామన్న డైలాగుల్ని సమర్థించేవారు కాదు. ప్రజల్ని కించ పరిచిన నేతల ప్రస్తావన తెచ్చేవారు కాదు. కానీ కొడాలి నాని, పేర్ని నాని, వంశీ, ప్రసన్న, కేతిరెడ్డి అందరి పేర్లు పెట్టి వారంతా మచ్చలేని వాళ్లని చెప్పేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇది ప్రజల్ని .. వారి అవగాహన స్థాయిని అవమానించడమే కాదా. గంజాయి బ్యాచ్ కు పరామర్శ చేసి ఆయన ప్రజలకు ఇచ్చిన సందేశమేంటో ఎవరికీ తెలియదా ?. జగన్ రెడ్డికి ప్రజల మనసుల్ని గెలుచుకోవాలన్న ఆలోచన లేదు.. కానీ ఎదుటి వారికి మాత్రం ఆ డైలాగులు రాసుకొని వచ్చి చదువుతారు.
ఈ నాయకత్వంతో బలయ్యేది వైసీపీ క్యాడరే
ఇలాంటి నాయకత్వంతో విజయాలు వస్తాయనుకుంటే అంతకు మించిన .. స్వయం మోసం మరొకటి ఉండదు. ఓ సారి అధికారం వచ్చిందంటే.. ఆయన పాలనా తీరు ఎలా ఉంటుందో తెలియక ప్రజలు అవకాశం ఇచ్చారు. ఆ అవకాశాన్ని పూర్తి స్థాయిలో దుర్వినియోగం చేశారు. ప్రజల రక్త మాంసాల్ని పీల్చారు. విపక్ష నేతల మాన, ప్రాణాలతో ఆడుకున్నారు. పార్టీ క్యాడర్ ను పట్టించుకోకుండా.. తాను మాత్రమే సంపాదించుకున్నారు. ఇప్పుడు మళ్లీ ఆ క్యాడర్ ను బలి చేసేందుకు ఆయన రాజకీయం చేస్తున్నారు. ఇలాంటి నాయకత్వంతో స్వయం వినాశనం తప్ప.. వైసీపీ బాగుపడే సూచనలే ఉండవు. ఆ అంశంపై ఇప్పుడిపిప్పుడే క్లారిటీకి వస్తున్నారు ఆ పార్టీ నేతలు. కార్యకర్తలే గుర్తించాల్సిఉంది.