“స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః”
అని భగవద్గీతలో ఉంటుంది. అంటే, మన సొంత ధర్మంలో మరణించడం కూడా శ్రేయస్కరమే, కానీ పరధర్మం భయాన్ని, వినాశనాన్ని కలిగిస్తుంది. ఈ సనాతన సత్యాన్ని నేడు న్యాయస్థాన తీర్పులు సైతం పరోక్షంగా బలపరుస్తున్నాయి. మతం మారిన దళితులకు ఎస్సీ రిజర్వేషన్లు వర్తించవని, వారు హిందూ ధర్మాన్ని వీడి ఇతర మతాల్లోకి వెళ్ళిన క్షణమే తమ మూలాలను, రాజ్యాంగం కల్పించిన ప్రత్యేక వెసులుబాటును కోల్పోయారని సుప్రీంకోర్టు స్పష్టం చేయడం ఒక చారిత్రాత్మక సత్యానికి నిరూపణ అనుకోవచ్చు.
మతం మారిన వారి విషయంలో సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు
1950లో రాజ్యాంగం షెడ్యూల్డ్ కులాలు ఉత్తర్వు వెలువడినప్పుడే బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక స్పష్టమైన గీత గీశారు. హిందూ సమాజంలో అస్పృశ్యత వల్ల ఎదురైన సామాజిక అణచివేతకు పరిహారంగానే ఎస్సీ రిజర్వేషన్లను ఉద్దేశించారు. క్రైస్తవ, ఇస్లాం వంటి మతాల్లో కుల వివక్ష లేదని ఆయా మత పెద్దలు ప్రచారం చేసుకుంటున్నప్పుడు, మరి ఆ మతాల్లోకి వెళ్ళిన వారికి కుల ప్రాతిపదికన ఇచ్చే రిజర్వేషన్లు ఎలా వర్తిస్తాయి? ఈ మౌలిక ప్రశ్నను సుప్రీంకోర్టు సమర్థించింది. హిందూ ధర్మం నుంచి విడిపోయిన వారు తమ పూర్వీకుల వారసత్వాన్ని, హక్కులను కూడా వదులుకున్నట్లేనని అర్థం. దశాబ్దాలుగా విదేశీ నిధులతో నడుస్తున్న కొన్ని మిషనరీ సంస్థలు, మత సంస్థలు దళిత బిడ్డలను ప్రలోభాలకు గురిచేసి మతం మార్చాయి. అటు మతం మార్చి, ఇటు హిందూ ధర్మానికి దక్కే రిజర్వేషన్ ఫలాలను కూడా అనుభవించాలనే రెట్టింపు ప్రయోజన కుతంత్రానికి ఈ తీర్పుతో తెరపడింది. ఒకే ఒరలో రెండు కత్తులు ఇమడవు అన్నట్లుగా, హిందూ ధర్మాన్ని నిరసిస్తూ బయటకు వెళ్ళిన వారు, అదే ధర్మం వల్ల లభించే రాజ్యాంగ రక్షణను కోరడం అనైతికమని న్యాయస్థానం తేల్చిచెప్పింది. ఇది కేవలం న్యాయపరమైన తీర్పు కాదు, మన ధర్మ మూలాలను కాపాడే కవచం.
దశాబ్దాలుగా సెక్యులర్ పేరిట మత మార్పిళ్లకు ప్రోత్సాహం
భారతదేశంలో మత మార్పిళ్లు అనేవి కేవలం విశ్వాసానికి సంబంధించినవి కావు, అవి విదేశీ నిధులతో నడిచే ఒక భారీ పరిశ్రమగా రూపాంతరం చెందాయి. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ FCRA గణాంకాల ప్రకారం, ప్రతి ఏటా వేల కోట్ల రూపాయల విదేశీ విరాళాలు స్వచ్ఛంద సంస్థల పేరిట దేశంలోకి ప్రవహిస్తున్నాయి. కేవలం క్రైస్తవ మిషనరీ అనుబంధ సంస్థలకే సంవత్సరానికి సుమారు రూ. 15,000 కోట్ల నుంచి రూ. 20,000 కోట్ల వరకు నిధులు అందుతున్నట్లు అంచనా. ఈ నిధులను విద్య, వైద్యం , సామాజిక సేవ అనే ముసుగులో వినియోగిస్తూ, మారుమూల గ్రామాలు , దళిత వాడలు, గిరిజన ప్రాంతాల్లో మత మార్పిడి కేంద్రాలను నిర్మిస్తున్నారు. విదేశీ ధన ప్రవాహం ఆగిపోతే, ఇక్కడ మత మార్పిడి యంత్రం ఒక్క క్షణం కూడా ముందుకు సాగదనేది కాదనలేని సత్యం. దశాబ్దాల కాలంగా సాగిన విదేశీ నిధుల అప్రతిహత ప్రవాహం భారతీయ సామాజిక సమగ్రతకు చేసిన గాయం అంత సులభంగా మానేది కాదు. 2014లో కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, జాతీయ భద్రతను దృష్టిలో ఉంచుకుని FCRA నిబంధనలను కఠినతరం చేయడం ద్వారా వేల సంఖ్యలో అనుమానాస్పద మిషనరీ సంస్థల లైసెన్సులను రద్దు చేసింది. నిధుల మూలాలను కట్టడి చేయడం ద్వారా మత మార్పిడి యంత్రాంగం ఆర్థిక వెన్నెముక ను ప్రభుత్వం విరిచింది. అయితే, గత డెబ్బై ఏళ్లలో ప్రవహించిన లక్షల కోట్ల రూపాయల విదేశీ ధనం ఇప్పటికే క్షేత్రస్థాయిలో వేల సంఖ్యలో ప్రార్థనా మందిరాలను, నెట్వర్క్లను నిర్మించి పెట్టింది. ఈ నిధులతో సృష్టించిన క్యాడర్, వ్యవస్థలు నేటికీ మారుమూల గ్రామాల్లో హిందూ ధర్మ వ్యతిరేక ప్రచారాన్ని కొనసాగిస్తూనే ఉన్నాయి. నిధులు తగ్గినా, గతంలో జరిగిన నష్టం వల్ల ఏర్పడిన సామాజిక విచ్ఛిన్నతను సరిదిద్దడం ఇప్పుడు అతిపెద్ద సవాలుగా మారింది.
దళితులు, వెనుకబడిన వర్గాల వారిని ఉద్యమంలా క్రైస్తవులుగా మారిన క్రైస్తవ సంస్థలు
మిషనరీ సంస్థలు దశాబ్దాలుగా దళిత , వెనుకబడిన వర్గాలను తమ సాఫ్ట్ టార్గెట్ గా ఎంచుకోవడం వెనుక లోతైన వ్యూహం ఉంది. శతాబ్దాలుగా ఉన్న సామాజిక అసమానతలను ఆసరాగా చేసుకుని, మతం మారితే సమానత్వం లభిస్తుంది అనే కల్లబొల్లి మాటలతో వారిని ఆకర్షించారు. వాస్తవానికి మతం మారిన తర్వాత కూడా వారి సామాజిక స్థితిగతుల్లో మార్పు రాకపోగా, వారు తమ స్వంత సంస్కృతికి, మూలాలకు దూరమవుతున్నారు. ఒకవైపు మతం మారుస్తూనే, మరోవైపు రాజ్యాంగబద్ధంగా హిందూ దళితులకు దక్కే రిజర్వేషన్ ఫలాలను కూడా అనుభవించాలనే డబుల్ బెనిఫిట్ ఆశను చూపడం వీరి ప్రధాన ఎర. ఇది కేవలం ఆధ్యాత్మిక మార్పు కాదు, ఒక వర్గాన్ని తమ సంస్కృతి నుంచి వేరు చేసే విచ్ఛిన్నకర చర్య. స్వాతంత్య్రానంతరం ఓటు బ్యాంకు రాజకీయాల కోసం కొన్ని రాజకీయ పార్టీలు ఈ మత మార్పిళ్లను పరోక్షంగా ప్రోత్సహించాయి. సెక్యులరిజం అనే ముసుగులో మిషనరీల ఆగడాలను చూసీచూడనట్లు వదిలేయడం వల్ల, దేశవ్యాప్తంగా వేల సంఖ్యలో ప్రార్థనా మందిరాలు వెలిశాయి. ముఖ్యంగా తీర ప్రాంతాలు , సరిహద్దు రాష్ట్రాల్లో డెమోగ్రఫిక్ మార్పు తీసుకురావడం ద్వారా రాజకీయ ఆధిపత్యాన్ని సాధించాలనేది వీరి అంతిమ లక్ష్యం.
1956లో కుట్రలను బట్టబయలు చేసిన నియోగి కమిటీ
1956లో నియోగి కమిటీ నివేదికలోనే మిషనరీల కుట్రల గురించి హెచ్చరించినప్పటికీ, నాటి పాలకులు తమ రాజకీయ ప్రయోజనాల కోసం ఆ హెచ్చరికలను బుట్టదాఖలు చేయడం నేటి దుస్థితికి కారణమైంది. 1956 నాటి నియోగి కమిటీ నివేదిక అనేది భారతీయ సాంస్కృతిక సార్వభౌమాధికారానికి సంబంధించి ఒక హెచ్చరిక లాంటిది. మధ్యప్రదేశ్ ప్రభుత్వం నియమించిన ఈ కమిటీకి నాగ్పూర్ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి భవానీ శంకర్ నియోగి నేతృత్వం వహించారు. నియోగి కమిటీ నివేదిక కేవలం మత మార్పిళ్ల గురించి మాత్రమే కాదు, అవి దేశ విభజన శక్తులకు ఎలా ఊతమిస్తున్నాయో నాడే ఎండగట్టింది. మిషనరీలు అందించే సేవలు కేవలం ఒక ముసుగు మాత్రమేనని, వాటి అసలు లక్ష్యం హిందూ సమాజంలో చీలికలు తెచ్చి, ఒక ప్రత్యేక రాజకీయ అస్తిత్వాన్ని నిర్మించడమేనని ఈ కమిటీ స్పష్టం చేసింది. ముఖ్యంగా అప్పట్లో ప్రాధాన్యత సంతరించుకున్న స్వతంత్ర క్రైస్తవ రాజ్యం వంటి డిమాండ్లు విదేశీ శక్తుల మద్దతుతోనే పుట్టుకొచ్చాయని నియోగి కమిటీ ఆధారాలతో సహా నిరూపించింది. మతం మార్చడం అంటే కేవలం దేవుడిని మార్చడం కాదు, దేశం పట్ల ఉండే విధేయతను మార్చడమేనని ఈ నివేదిక చేసిన హెచ్చరిక నేటికీ అక్షర సత్యం. అత్యంత లోతైన పరిశోధనతో, వేలమంది సాక్ష్యాలను సేకరించి నియోగి కమిటీ సమర్పించిన నివేదికను నాటి నెహ్రూ ప్రభుత్వం పూర్తిగా పక్కన పెట్టడం ఒక చారిత్రక తప్పిదం. మత మార్పిడి నిరోధక చట్టం తీసుకురావాలని, విదేశీ మిషనరీలను పంపించివేయాలని కమిటీ సిఫార్సు చేసినప్పటికీ, సెక్యులరిజం పేరుతో నాటి పాలకులు మౌనం వహించారు. మైనారిటీల ఓటు బ్యాంకును పదిలపరుచుకునే క్రమంలో, బహుళ సంఖ్యాక హిందూ సమాజం ఎదుర్కొంటున్న ముప్పును వారు విస్మరించారు. ఆనాడు నియోగి కమిటీ సూచనలను అమలు చేసి ఉంటే, నేడు మనం చూస్తున్న సామాజిక విచ్ఛిన్నత, సరిహద్దు రాష్ట్రాల్లో డెమోగ్రఫిక్ మార్పులు ఉండేవి కావు. విదేశాల నుంచి వచ్చే భారీ నిధులు దేశ అంతర్గత భద్రతకు ముప్పుగా పరిణమిస్తాయని నియోగి కమిటీ 1956లోనే హెచ్చరించింది. మిషనరీలకు అందుతున్న ధన ప్రవాహం సామాన్య ప్రజల దారిద్ర్యాన్ని, నిస్సహాయతను కొనుగోలు చేస్తోందని కమిటీ తీవ్రంగా ఆక్షేపించింది. నేడు మనం చూస్తున్న FCRA నిబంధనలు, లైసెన్సుల రద్దు వంటి చర్యలకు పునాది ఆనాటి నివేదికలోనే ఉంది. కానీ, దశాబ్దాల తరబడి ఆ నివేదికను దుమ్ము పట్టించడం వల్ల మత మార్పిళ్లు ప్రమాదకర స్థాయికి చేరాయి.
రాజకీయ కారణాలతో హిందూ ధర్మానికి మొదటి నుంచి అన్యాయం
రాజ్యాంగం కల్పించిన ఎస్సీ రిజర్వేషన్లు కేవలం హిందూ ధర్మంలోని సామాజిక అణచివేతకు గురైన వారికే పరిమితమని స్పష్టంగా ఉన్నప్పటికీ, క్షేత్రస్థాయిలో జరుగుతున్న సర్టిఫికేట్ జిమ్మిక్కులు అసలైన దళితుల నోటికాడ బువ్వను లాగేస్తున్నాయి. మతం మారిన క్రైస్తవులకు బీసీ-సీ కేటగిరీ కేటాయించినా, వారు ఉద్దేశపూర్వకంగా ఆ హోదాను దాచిపెట్టి ఎస్సీ సర్టిఫికేట్లతో అత్యున్నత పదవులను దక్కించుకోవడం సామాజిక ద్రోహమే అవుతుంది. ఐపీఎస్ అధికారి పీవీ సునీల్ కుమార్ వంటి వారి ఉదంతాలు ఈ వ్యవస్థీకృత మోసానికి నిలువెత్తు సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. ఐదో తరగతి వరకు బీసీ-సీగా ఉన్న రికార్డులు, ఆ తర్వాత ఐపీఎస్ స్థాయికి వెళ్లేసరికి ఎస్సీగా ఎలా మారిపోయాయన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న. ఇలాంటి అక్రమ మార్గాల ద్వారా లక్షలాది మంది లబ్ధి పొందడం వల్ల, మారుమూల గ్రామాల్లో ఉండి నిజమైన వివక్షను ఎదుర్కొంటున్న నిరుపేద దళితులకు తీరని అన్యాయం జరుగుతోంది. ఈ అక్రమాలను అరికట్టకపోతే రిజర్వేషన్ల లక్ష్యమే నీరుగారిపోతుంది.
ఇప్పుడు ఘర్ వాపసీ ఉద్యమానికి సరైన సమయం
ప్రలోభాలకో, తాత్కాలిక అవసరాలకో లొంగి పరమతాల్లోకి వెళ్ళిన వారు నేడు తమ అస్తిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని వెతుక్కునే పరిస్థితి ఏర్పడింది. మతం మారిన తర్వాత అక్కడ లభించిన సమానత్వం కేవలం కాగితాలకే పరిమితమవ్వడం, మరోవైపు తమ పూర్వీకుల వారసత్వమైన రిజర్వేషన్ హక్కులను సైతం కోల్పోవాల్సి రావడం ఒక చేదు నిజం. ఈ విషయంలో సుప్రీంకోర్టు వెలువరించిన తాజా తీర్పులు మత మార్పిడి వెనుక ఉన్న డొల్లతనాన్ని ఎండగడుతున్నాయి. ఇప్పుడు ప్రతి హిందూ సోదరుడు ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. పరాయి మతంలో అనామకులుగా ఉండటం కంటే, వేల ఏళ్ల ఘన చరిత్ర కలిగిన సనాతన ధర్మంలోకి తిరిగి రావడం అనేది కేవలం మత మార్పిడి కాదు, అది తమ మూలాల్లోకి చేరుకోవడం . ఘర్ వాపసీ అనేది కేవలం జనాభా లెక్కలను పెంచే ప్రక్రియ కాదు. అది విడిపోయిన కుటుంబ సభ్యులను సాదరంగా ఇంటికి ఆహ్వానించే ఒక పవిత్ర యజ్ఞం. మన పూర్వీకుల రక్తం, మన ఆచార వ్యవహారాలు, మన జీవన విధానం అన్నీ సనాతన ధర్మంతోనే ముడిపడి ఉన్నాయి. శాస్త్రోక్తమైన విధివిధానాల ద్వారా తిరిగి ధర్మంలోకి రావడం అనేది ఒక వ్యక్తికి తన పూర్వ వైభవాన్ని, ఆధ్యాత్మిక సంతృప్తిని ప్రసాదిస్తుంది. ఇది ఒక వ్యక్తిగత నిర్ణయం మాత్రమే కాదు, హిందూ సమాజం తన కోల్పోయిన శక్తిని మళ్ళీ కూడగట్టుకునే ప్రక్రియ. మన మూలాలు ఎక్కడ ఉన్నాయో గుర్తించి, ఆ వైపు అడుగులు వేయడమే నేటి చారిత్రక అవసరం. తిరిగి వస్తున్న వారిని ఆహ్వానించడంలో హిందూ సమాజంపై గురుతర బాధ్యత ఉంది. కేవలం ఆహ్వానించడమే కాకుండా, వారికి సమాజంలో తగిన గౌరవం, స్థానం కల్పించడం ప్రతి హిందువు విధి. శతాబ్దాల నాటి సామాజిక వివక్షను పక్కన పెట్టి, వారంతా మన రక్తసంబంధీకులనే భావనతో అక్కున చేర్చుకోవాలి. వారు గర్వంగా నేను హిందువును అని చెప్పుకునేలా, ధర్మ రక్షణలో వారు భాగస్వాములయ్యేలా వాతావరణాన్ని కల్పించాలి.
ధర్మ రక్షణే దేశ రక్షణ
ధర్మో రక్షతి రక్షితః – ధర్మాన్ని మనం కాపాడితే, ఆ ధర్మం మనల్ని కాపాడుతుంది. సుప్రీంకోర్టు తీర్పు ద్వారా లభించిన ఈ ఆయుధాన్ని ఉపయోగించి, హిందూ సమాజం తన కోల్పోయిన వైభవాన్ని తిరిగి పొందాలి. మతం మారిన సోదరులారా… అన్య మతాల్లో అనాథలుగా ఉండటం కంటే, గర్వంగా మీ మాతృధర్మంలోకి తిరిగి రండి. రాజ్యాంగబద్ధమైన హక్కులను పొందుతూనే, పవిత్రమైన గంగానది లాంటి సనాతన సంస్కృతిలో భాగస్వాములు కండి. ఘర్ వాపసీ ఉద్యమానికి ఇదే సరైన సమయం, ఇదే పవిత్రమైన ముహూర్తం!
