రాజకీయాల్లో పవర్ ను గుర్తించాలి. ఆ పవర్ లో అసలు పవర్ ఉంటుంది. బాధ్యతలూ ఉంటాయి. వాటిని బ్యాలెన్స్ చేయడమే రాజకీయం. రాజకీయాలు ఎంత నేర్చుకున్నా ఎంతో కొంత మిగిలి ఉంటుంది. అది అంతులేని సబ్జెక్ట్. నరేంద్ర మోదీ గుజరాత్ చీఫ్ మినిస్టర్ గా బాధ్యతలు చేపట్టేటప్పుడు మంత్రిగా చేయలేదు.. ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టేటప్పుడు కేంద్రమంత్రిగా చేయలేదు. కానీ రెండు పదవుల్ని ఆయన నిర్వహించిన వైనం ..రాజకీయాల్లో పండిపోయిన వారికీ పాఠాలు నేర్పిస్తాయి. ప్రజాస్వామ్య రాజకీయాల్లో పాలన, రాజకీయం బ్యాలెన్స్ చేసుకోవడం ఎలాగో చూసి ఎంత నేర్చుకున్నా ఇంకా మిగిలిపోయేంత సబ్జెక్ట్ ఆయన వద్ద ఉంటుంది. ఆ స్థాయిలో కాకపోయినా రాజకీయాల్లో అడుగులు ముందుకు పడుతున్న కొద్దీ.. ఎదగడం అనేది చాలా ముఖ్యం. అది మాటల్లో అయినా.. వ్యూహాల్లో అయినా.. గుంభనంగా ఉండటంలో అయినా సరే. అయితే ఈ విషయంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. ఎన్నికల్లో విజయం రాక ముందు ఎలా ఉన్నారో..ఇప్పుడు కూడా అలాగే ఉన్నారు. ఇంకా చెప్పాలంటే ఆయన ఇంప్రూవ్ కావాల్సింది పోయి.. మరిన్ని ప్రమాణాలు తగ్గించుకుంటున్నారు. అదే ఆందోళనకరం.
బాధ్యతల్లో ఉన్నప్పుడు మాట తేడా రాకూడదు !
ఎన్నికలకు ముందు..జనసేన పార్టీ అధ్యక్షుడిగా పవన్ కల్యాణ్ ప్రసంగాలు వేరు. ఇప్పుడు మాట్లాడేది వేరు. ఎన్నికల సమయంలో ఆయన ప్రసంగాల్లో కంటిన్యూటీ ఉండదని.. ఏది గుర్తు వస్తే అది మాట్లాడతారని అంటారు. అంతే కాదు.. గుర్తు వచ్చిన వారి మీద వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తారు. నిజానికి పవన్ కల్యాణ్ స్పీచ్ పేపర్లు తెచ్చుకుంటారు. కానీ ఫాలో అవరని ..జంప్ అయ్యే టాపిక్స్ ను బట్టి అర్థం అవుతుంది ఓ రాజకీయ పార్టీ నేతగా అది చెల్లుతుంది. కానీ డిప్యూటీ సీఎంగా.. అలా మాట్లాడితే వివాదాస్పదం అవుతుంది. దీనికి సాక్ష్యం కోనసీమ పచ్చదనం గురించి.. తెలంగాణ నేతలతో ముడిపెట్టడమే. పవన్ ప్రసంగాలు అంతే అని మొదట్లో ఎవరూ పట్టించుకోలేదు..కానీ రాజకీయం చేయాలనుకున్నారు కాబట్టి ప్రారంభించారు. సమర్థించుకోవడానికి జనసేన వద్ద సరుకు లేకుండా పోయింది.
అంతర్గతంగా స్పందించాల్సినవి.. బయటపడాల్సినవి వేర్వేరుగా ఉంటాయి!
ఇటీవల ఓ డీఎస్పీ మీద పవన్ కల్యాణ్ నేరుగా ఎస్పీకి ఫోన్ చేసి ఫిర్యాదు చేశారు. పవన్ కల్యాణ్ డిప్యూటీ సీఎం. హోంశాఖ ఆయనది కాకపోవచ్చు. కానీ ప్రభుత్వంలో ఆయనకు అత్యున్నత గౌరవం ఉంది. ఎలాంటి సమస్యను ఆయన తీసుకొచ్చిన ఉన్నత స్థానంలో టేకప్ చేస్తారు. అది పవన్ కల్యాణ్‌కు తెలుసు. అలాంటప్పుడు.. ఆ డీఎస్పీ ఇష్యూను నేరుగా వ్యక్తిగతంగా డీజీపీతో మాట్లాడవచ్చు. హోంమంత్రితో మాట్లాడవచ్చు. వారు అన్ని రకాల సమాచారం తీసుకు వచ్చి డిప్యూటీ సీఎం ముందు పెడతారు. ఇదంతా అంతర్గతంగా జరిగిపోతుంది. పార్టీ హ్యాండిల్ లో ప్రచారం చేసుకుంటే.. ఓ డీఎస్పీ కోసం ఇలా చేస్తున్నారేంటి అనుకుంటారు. అనుకున్నారు కూడా. ఇలాంటిదే.. ఇటీవల ఓ కార్యకర్త పవన్ తో పాటు వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారని. ఆ కార్యకర్త తీరు అనుమానాస్పదం అయితే సీక్రెట్ గా దర్యాప్తు చేయించి నిజాలు తెలుసుకోవచ్చు. కానీ బహిరంగంగా స్పందించడం వల్ల.. సొంత అభిమానిని చూసి భయపడుతున్నారని విపక్షాలు ఎద్దేవా చేయడానికి అవకాశం కల్పించినట్లవుతుంది. అందుకే పవన్ బయటకు తెలియాల్సినవి.. అంతర్గతగా పూర్తి చేయాల్సిన పనులు వేర్వేరుగా ఉంటాయని గుర్తించాల్సి ఉంది.
పవన్ తన పవర్‌ను గుర్తించాలి!
పవన్ కల్యాణ్ ఇప్పుడు పవర్ ఫుల్ రోల్ లో ఉన్నారు. ఆయన ప్రజల కోసం చేయాలనుకున్న పనుల్ని ఇట్టే చేయగలరు.. చేయించగలరు..కానీ దానికి కొన్ని పరిమితులు ఉంటాయి. వాటిని అర్థం చేసుకోవాలి. అదే సమయంలో ప్రసంగాలు కూడా యథాలాపంగా ఏదో ఒకటి అనుకుంటూ పోవడం వల్ల సమస్యలే వస్తాయి. పవన్ కల్యాణ్ .. కొన్ని కీలకమైన బహిరంగసభల్లో ప్రసంగాలు సూటిగా ఉంటాయి. చెప్పాలనుకున్నవి చెబుతారు.కానీ అధికారిక కార్యక్రమాల్లో మాత్రం.. అటు వైసీపీకి ఇటు ఇతరులకు ఎంత దుష్ప్రచారం చేయడానికి అవకాశం కల్పించాలో అంతా కల్పిస్తారు. ఇలాంటివి రాజకీయంగా నష్టం చేస్తాయి. డిఫెండ్ చేసుకుంటే ఇంకా పెద్దవి అవుతాయి. అందుకే పవన్ కల్యాణ్ తన పవర్ ను ఎప్పుటిప్పుడు గుర్తు చేసుకుంటూ ఉండాలి.
