రంపచోడవరం నియోజకవర్గంలో గిరిజనుల్ని బెదిరించి ఇంత కాలం రాజకీయాలు చేసిన వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు .. ఇప్పుడు అంతా తన చేతుల్లో నుంచి జారిపోతూండటంతో గెలిచిన టీడీపీ ఎమ్మెల్యేను బెదిరించడానికి ఏ మాత్రం వెనుకాడటం లేదు. తాను కనుసైగ చేస్తే ఆమె చంపేస్తారన్నట్లుగా ఆయన చేస్తున్న బెదిరింపుల వీడియో వైరల్ అవుతోంది. ఈ బెదిరింపులపై మహిళా ఎమ్మెల్యే శిరిషాదేవి కూడా స్పందించారు.
నేనేమైనా గాలిలో కొట్టుకుపోయే దూదినా.. మీ కనుసైగలకు భయపడటానికి నేను సిద్ధంగా లేనని .. అవినీతి అక్రమాలన్నీ బయటపెడతానని స్పష్టం చేశారు.
గతంలో తన కారు డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపి, మృతదేహాన్ని డోర్ డెలివరీ చేసిన చరిత్ర అనంతబాబుదని ఆమె ఈ సందర్భంగా గుర్తు చేశారు. అటువంటి నేరచరిత్ర ఉన్న వ్యక్తి ఇప్పుడు ఒక ఎమ్మెల్యేపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఏమిటన్నారు. ఏజెన్సీ ప్రాంతంలో అనంతబాబు అరాచకాలు పెరిగిపోతున్నాయని, అధికారులు కూడా దీనిపై దృష్టి సారించాల్సి ఉందన్నారు.
తాను సామాన్య అంగన్వాడీ కార్యకర్తగా ప్రస్థానాన్ని ప్రారంభించి, ప్రజల ఆశీస్సులతో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యానని శిరీషా దేవి గుర్తు చేశారు. ప్రజల కోసం పనిచేసే తనను ఇలాంటి బెదిరింపులు ఏమీ చేయలేవని, చట్టం తన పని తాను చేసుకుపోతుందన్నారు. ఏజెన్సీలో వైసీపీ నాయకుల దౌర్జన్యాలకు కాలం చెల్లిందని, కార్యకర్తలకు తాము అండగా ఉంటామని ఆమె స్పష్టం చేశారు. అనంతబాబు డోర్ డెలివరీ కేసులో పునర్విచారణ చేయడానికి సిట్ ను నియమిచారు కానీ.. ఆ సిట్ పని ప్రారంభించిందో లేదో స్పష్టత లేదు. ఆయన మాత్రం మళ్లీ బెదిరింపులకు దిగుతున్నారు.