అది రాజకీయసభ కాదు. ఓట్లు అడిగే సభ కాదు. తాము పదిహేను నెలల పాటు చేసిన దానిని చెప్పుకునేందుకు.. ప్రజలకు కృతజ్ఞతలు చెప్పుకునేందుకు ఏర్పాటు చేసిన సభ. సాధారణంగా ఎన్నికల వేడి ఉన్నప్పుడే ఇలాంటి సభలు పెడతారు. కానీ కూటమి నేతలు మాత్రం ప్రజలకు తమకు అప్పగించిన ప్రోగ్రెస్ రిపోర్టును వారికి చూపించడానికి… ముందు ముందు ఏం చేస్తామో చెప్పడానికి సభ ఏర్పాటు చేశారు.
ఈ సభకు పెద్ద ఎత్తున జనం తరలి వచ్చారు. సభలో ప్రసంగించిన వారు కూడా.. రాజకీయానికి తక్కువ.. తాము చేసిన పనులు చెప్పుకోవడానికి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. చంద్రబాబు మాత్రం జగన్మోహన్ రెడ్డికి గట్టి వార్నింగులు ఇచ్చారు. మెడికల్ కాలేజీలు కట్టేశానంటున్న జగన్ రెడ్డి నైజాన్ని బయట పెట్టారు. భూమి ఇచ్చి అదే మెడికల్ కాలేజీ అంటున్నారని.. చర్చించేందుకు అసెంబ్లీకి రావాలని సవాల్ చేశారు. వైసీపీ ఉనికి కోల్పోయిందని.. పార్టీ ఆఫీసులు మూసేసి సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేస్తోందని మండిపడ్డారు. అసెంబ్లీలో చర్చించే దమ్ము ఉందా అని మరోసారి సవాల్ చేశారు. చట్టసభల్లో చర్చకు రాకుండా రప్పా రప్పా అంటున్నారని.. బెదిరిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఒంటిమిట్ట, పులివెందుల ప్రజలు ఇప్పటికే బెండ్ తీశారని గుర్తు చేశారు.
జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ ప్రభుత్వ పనితీరు, విజయాలు, రాయలసీమతోపాటు రాష్ట్రం మొత్తాన్ని ఎలా అభివృద్ధి చేయాలని అనుకుంటున్నా అలా .. ప్రజల ఆశలను తీర్చేలా పని చేస్తున్నామని ప్రకటించారు. కూటమి ప్రభుత్వం 15 నెలల్లో అమలు చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, రాయలసీమ అభివృద్ధి గురించి వివరించారు. పవన్ కల్యాణ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, పెట్టుబడులు ఆకర్షించడం, సంక్షేమ పథకాల అమలు గురించి ప్రశంసించారు.
జగన్ రెడ్డి ప్రెస్మీట్లు ఏర్పాటు చేసి ఫేక్ న్యూస్లు చెప్పుకుంటున్నారు. అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలని చంద్రబాబు సవాల్ చేస్తున్నారు. కానీ జగన్ రెడ్డి మాత్రం.. తాను బయటే మాట్లాడతానని అసెంబ్లిలో కాదని అంటున్నారు.